* హంద్రీ-నీవా పనులపై సీఎంవో ఆరా
* తొలి దశ పనుల పూర్తికి ఎంత ఖర్చవుతుంది?
* ఎన్ని రోజుల్లో పనులు పూర్తవుతాయి?
* కలెక్టర్‌ను వివరాలడిగిన సీఎం కార్యాలయం
సాక్షి ప్రతినిధి, అనంతపురం : అనంత వెంకటరెడ్డి హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు మొదటి దశ పనులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. కరువు జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై అసెంబ్లీలో ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులు నిలదీసిన నేపథ్యంలో ప్రభుత్వం హంద్రీ-నీవా పనులపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలకు గాను 12 స్థానాలను ప్రజలు అధికార పార్టీకి కట్టబెట్టిన నేపథ్యంలో, అత్యంత కరువు ప్రాంతమైన ఈ జిల్లా సాగు, తాగు నీటి అవసరాలపై శ్రద్ధ చూపకపోతే రాష్ట్ర వ్యాప్తంగా తప్పుడు సంకేతాలు వెళతాయన్న అంతర్మథనం మొదలైనట్లు జిల్లాకు చెందిన అధికార పార్టీ వర్గాల సమాచారం.
ఇప్పటికే ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు వైఖరిపై ప్రజల్లో అపనమ్మకం కలిగించడంలో సఫలీకృతులయ్యారని, కొద్దిమేరకైనా దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే గతం పుసరావృతమై రైతులు టీడీపీకిదూరమయ్యే ప్రమాదముందన్న విశ్లేషణలు అధికార పార్టీ వర్గాల్లో మొదలైనట్లు సమాచారం. దివంగత సీఎం వైఎస్ హయాంలోనే ‘హంద్రీ-నీవా’ పనులు దాదాపు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టుకు రూ.4,200 కోట్లు ఖర్చు చేశారు. అక్కడక్కడా ప్యాచ్ వర్క్‌లు, నిర్మాణాలు పూర్తయితే జిల్లాలో పలు చెరువులు నింపి.. భూగర్భజల మట్టాన్ని గణనీయంగా పెంచే అవకాశం ఉంది. ఇందుకు దాదాపు రూ.200 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. బడ్జెట్‌లో మాత్రం కేవలం రూ.100 కోట్లు కేటాయించారు.
ఇంకో రూ.100 కోట్లు ఖర్చు చేస్తే ప్రాజెక్టు పూర్తయ్యి.. వచ్చే ఖరీఫ్ నాటికి కర్నూలు, అనంతపురం జిల్లాల్లో దాదాపు లక్ష ఎకరాలు సాగులోకి వస్తుంది. అప్పుడు ఆ మైలేజీని రాష్ట్ర వ్యాప్తంగా వినియోగించుకునే అవకాశం ఉంటుందని ముఖ్యమంత్రికి కొందరు సలహా ఇచ్చినట్లు సమాచారం. విజయవాడలో రాజధాని ఖరారు చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో మిగతా అన్ని జిల్లాలకన్నా ఎక్కువ అసౌకర్యానికి గురవుతోంది అనంతపురమే. ప్రస్తుతం ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌కైతే జిల్లా వాసులు నాలుగైదు గంటల్లోనే చేరుకోవచ్చు. అదే విజయవాడ వెళ్లాలంటే సరైన రవాణా సౌకర్యాలు లేవు. వర్షపాత, సాగునీటి సౌకర్యాల ప్రాతిపదికన చూస్తే అనంతపురానికి, విజయవాడకు మధ్య ‘నక్కకు నాగలోకానికి’ ఉన్నంత తేడా కన్పిస్తోంది.
వీటన్నింటి నేపథ్యంలో అధికార పార్టీకి అత్యధిక సీట్లు కట్టబెట్టిన ‘అనంత’ విషయంలో ఎంతో కొంత శ్రద్ధ తీసుకోకపోతే.. ఆ ప్రభావం మొత్తం రాయలసీమ వ్యాప్తంగా కన్పించే అవకాశముంది. సీమ ప్రజల్లో రాజుకుంటున్న అసంతృప్తి పెరిగి పెద్ద కాకముందే ముందస్తు చర్యలు తీసుకోవాలన్న ఆలోచనతో అధికార పార్టీ ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ‘హంద్రీ-నీవా’ పనుల పురోగతి, పనుల పూర్తికి ఇంకా ఎంత మొత్తం అవసరం? ఎంతకాలం పడుతుంది?.. తదితర వివరాలపై నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) కలెక్టర్‌ను ఆదేశించినట్లు తెలిసింది. దీంతో కలెక్టర్ ‘హంద్రీ-నీవా’ ఇంజనీరింగ్ అధికారులను పిలిపించి సీఎంవో కోరిన మేరకు సవివరమైన నివేదిక తయారు చేస్తున్నట్లు కలెక్టరేట్ వర్గాలు తెలిపాయి.
ఎట్టకేలకు కదలిక
Published Tue, Sep 9 2014 1:53 AM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM
Advertisement
Advertisement