తొమ్మిదేళ్లలో ఏం చేశారు
- ఒక్క ప్రాజెక్టయినా నిర్మించారా?
- బాబుకు కొణతాల రామకృష్ణ సూటి ప్రశ్న
కె.కోటపాడు, న్యూస్‌లైన్ : రాష్ట్రంలో తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా అధికారం వెలగబెట్టిన చంద్రబాబునాయుడు ఒక్క సాగునీటి ప్రాజెక్టునైనా పూర్తి చేశారా? అని వైఎస్సార్ సీపీ రాష్ట్ర నాయకుడు కొణతాల రామకృష్ణ ప్రశ్నించారు. కె.కోటపాడులో బుధవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారంలో ఉన్నపుడు ఏమీ చేయని చంద్రబాబు ఇప్పుడు పదవిలోకి వస్తే సీమాంధ్రను సింగపూర్‌గా మార్చేస్తానని మాయమాటలు చెబుతున్నారని అన్నారు.
చంద్రబాబు విచ్చలవిడిగా బెల్టుషాపులను ప్రోత్సహించారని, వ్యవసాయ దండగ అంటూ రైతులను కించపర్చారని గుర్తు చేశారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి అన్ని వర్గాల ప్రజలకు ప్రత్యర్థి పార్టీల వారికి సంక్షేమ ఫలాలను అందించారని అన్నారు. వైఎస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రూ.12వేల కోట్లతో రైతుల రుణాలను మాఫీ చేయించారని అన్నారు.
ఆయన హయాంలోనే గోవాడ షుగర్స్ టన్నుకి అత్యధికంగా రూ.2200 మద్దతు ధర ఇచ్చిందని అన్నారు. ఆ మహానేత మరణం తర్వాత వైఎస్ కుటుంబాన్ని వేధించిన కాంగ్రెస్, టీడీపీలకు ఎన్నికల్లో ప్రజలు బుద్ధిచెప్పాలని అన్నారు. గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ జగన్ ప్రభంజనంలో చంద్రబాబు కొట్టుకుపోవడం ఖాయమని అన్నారు. కె.కోటపాడులో బుధవారం జరిగిన మండల పార్టీ కార్యకర్తల సమావేశంలో అమర్ మాట్లాడుతూ చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అవగాహనాలోపంతో దొంగ హామీలను ప్రజలకు చెబుతున్నాడని అన్నారు.
రాష్ట్రంలో ఎన్ని ఇళ్లు ఉన్నాయో చంద్రబాబుకు తెలియదు కానీ ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామనడం ఆయన అవగాహనా లేమికి నిదర్శన మని అన్నారు. పూడి మంగపతిరావు సూచనల మేరకు కె.కోటపాడు మండలంలో అభివృద్ధి పనులకు పెద్ద పీట వేస్తానని అన్నారు. అనంతరం మాడుగుల ఎమ్మెల్యే అభ్యర్థి బూడి ముత్యాలునాయుడు మాట్లాడుతూ కె.కోటపాడు మండలంతోబాటు నియోజకవర్గంలోని మిగిలిన మండలాల్లోను పూడి మంగపతిరావు ప్రచారం చేసి తన గెలుపు బాధ్యతను తీసుకోవాలని కోరారు.
అనంతరం పూడి మంగపతిరావు మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడమే లక్ష్యంగా పనిచేస్తానని తెలిపారు. గవిరెడ్డి సన్యాసినాయుడు, పి.వి.జి.కుమార్, దాట్ల తాతరాజు, రెడ్డి జగన్‌మోహన్, శ్రీకాంత్ శ్రీను, పార్టీ మండల కన్వీనర్ రొంగలి మహేష్, బోయిదాపు జగదీశ్వరరావు, దాట్ల శివాజీబాబు, బొడ్డు పేరునాయుడు, రెడ్డి బలరాం, నీలిమా వెంకటరావు, దంతులూరి చిరంజీవి రాజు, అవుగడ్డ సోంబాబు పాల్గొన్నారు.