ప్రాజెక్టుల పట్ల చిత్తశుద్ధేదీ?
► 80% ప్రాజెక్టు పనులు వైఎస్సార్ పూర్తి చేశారు..
► పులివెందుల ధర్నాలో చంద్రబాబుపై ప్రతిపక్ష నేత జగన్ ధ్వజం
► టెంకాయలు కొట్టడం మినహా చంద్రబాబు చేసిందేమీ లేదు
► పట్టిసీమ నీళ్లు సీమకిచ్చారా? జీవో ఏదీ?
► ప్రకాశం బ్యారేజీకి 48 టీఎంసీలు వస్తే... 58 టీఎంసీలు సముద్రంలో కలిశాయి
► రబీ రుణ లక్ష్యం రూ.34వేల కోట్లు కాగా... బ్యాంకులిచ్చింది రూ.4,500 కోట్లు
► రైతులకు లక్ష్యంలో 13 శాతం రుణాలు అందిస్తే ఆయన తృప్తిపడ్డారట
► ఇదీ రైతుల పట్ల చంద్రబాబు చిత్తశుద్ధి
సాక్షి ప్రతినిధి, కడప: ‘‘సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఎప్పుడూ చిత్తశుద్ధి లేదు. నాడు ఎన్నికలకు ముందు టెంకాయలు కొట్టి తర్వాత విస్మరించేవారు. ఇప్పుడు గోరంత చేసి కొండంత చెప్పుకుంటున్నారు. రాయలసీమ కోసమే పట్టిసీమగా ప్రచారం చేసుకుంటున్నారే తప్ప ఆ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులేవి.? కృష్ణా జలాలు రాయలసీమకు తెచ్చుకునే అవకాశమున్నా ఇవ్వలేకపోయారు. రైతుల కష్టాలు, కన్నీళ్లు, అగచాట్లు ఆయనకెన్నటికీ పట్టవు’’ అని ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజమెత్తారు. పులివెందుల బ్రాంచ్ కెనాల్‌కు నీరు విడుదల చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై సోమవారం వైఎస్సార్ జిల్లా పులివెందుల తహసీల్దార్ కార్యాలయం ఎదుట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతు మహా ధర్నా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వతీరుపై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరిని తూర్పారబట్టారు. ప్రసంగం పూర్తి పాఠం ఆయన మాటల్లోనే....
కృష్ణా జలాలు పారించాలని వైఎస్సార్ తపన
ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రచార ఆర్భాటాలు మినహా సాగునీటి ప్రాజెక్టుల్లో చిత్తశుద్ధి లేదు. నాడు ఎన్నికలకు ముందు ప్రాజెక్టుల కోసం టెంకాయలు కొట్టడం మినహా నిధులివ్వలేదు, పనులు చేపట్టలేదు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్లలో ముష్టి వేసినట్లు జీఎన్‌ఎస్‌ఎస్ కోసం రూ.13కోట్లు, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ కోసం రూ.17కోట్లు ఖర్చు చేశారు. కానీ దివంగత ముఖ్యమంత్రి, ప్రియతమ నేత వైఎస్ రాజశేఖరరెడ్డికి కృష్ణా జలాలను పులివెందుల గడ్డపై పారించాలనే తపన ఉండేది. తుంగభద్ర నీరు మనకు సరిపోవడంలేదు కాబట్టి కృష్ణా జలాలను తీసుకొచ్చి గండికోట ప్రాజెక్టులో 26 టీఎంసీలు నిల్వ చేయాలని తపించారు.
గండికోటలో 26 టీఎంసీలుంటే పైడిపాళెం ప్రాజెక్టులో ఆరు టీఎంసీలు, చిత్రావతికి ఎనిమిది టీఎంసీలు, సర్వరాయసాగర్‌కు 3.2 టీఎంసీలు, వామికొండలో 1.6 టీఎంసీలు నిల్వ చేయవచ్చు. అందుకే కరువు సీమ దశ దిశ మార్చేందుకు జీఎన్‌ఎస్‌ఎస్‌కు రూ.4వేల కోట్లు, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌కు రూ.4వేల కోట్లు చొప్పున వెచ్చించారు. 80 శాతం ప్రాజెక్టు పనులు పూర్తి చేయించారు. మిగతా 20 శాతం పనులు చేయించడంలో ఆ తర్వాతి ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఆ పనులే పూర్తయ్యి ఉంటే రాయలసీమ సస్యశ్యామలమయ్యేది. దివంగత ముఖ్యమంత్రి కలలు సాకారమయ్యేవి.
చంద్రబాబువి ప్రచార ఆర్భాటాలే....
పట్టిసీమ నుంచి నీళ్లు తీసుకువచ్చామని చంద్రబాబు పదేపదే చెబుతున్నారు. పట్టిసీమ వల్లనే రాయలసీమకు నీరు ఇచ్చామని చెబుతున్నారు. మీకేమైనా కన్పించాయా? రాయలసీమకు ఎక్కడ నీళ్లు తీసుకువచ్చారని అడుగుతున్నా. పట్టిసీమ ప్రాజెక్టు కట్టారు. దాని ద్వారా 48 టీఎంసీలు తీసుకువచ్చి ప్రకాశం బ్యారేజీలో పోశారు. ప్రకాశం బ్యారేజీ నుంచి 58 టీఎంసీలు సముద్రంలో కలిశాయి. పట్టిసీమ నుంచి తెచ్చిన నీరు నిల్వ చేసుకునే స్టోరేజీ ట్యాంకులే లేవు. దీంతో ఆ నీరు సముద్రంలో కలిసింది. పట్టిసీమ నీరు కృష్ణా డెల్టాకు ఇస్తున్నా, రాయలసీమకు శ్రీశైలం నీరు వాడుకోవచ్చునని జీఓ ఎందుకు ఇవ్వరని చంద్రబాబును అడుగుతున్నా. రూ.1,600 కోట్లతో పట్టిసీమ నిర్మించారు. అందులో రూ.1,200 కోట్లు ఖర్చు చేసుంటే జీఎన్‌ఎస్‌ఎస్ ఫేజ్ –1 పనులు పూర్తి అయ్యేవి. తద్వారా గండికోటలో 26 టీఎంసీలు నిల్వ చేసుంటే జిల్లా సస్యశ్యామలం అయ్యేది.
గండికోట ముంపు వాసులకు ఆర్‌అండ్‌ఆర్ ఏదీ?
చంద్రబాబు ముఖ్యమంత్రయి మూడేళ్లవుతున్నా... గండికోట ప్రాజెక్టు పరిధిలో 22 ముంపుగ్రామాల ప్రజలకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ రూపాయి కూడా ఇవ్వలేదు. గాలేరు–నగరి పనులు పూర్తి చేసుంటే శ్రీశైలం నుంచి రోజుకు 22వేల క్యూసెక్కులు గండికోటకు వచ్చేవి. గండికోటలో 26 టీఎంసీలు నిల్వ చేసుకుంటే... చిత్రావతి, పైడిపాళెం, సర్వరాయసాగర్, వామికొండ, మైలవరం జలాశయాలకు నీళ్లిచ్చే అవకాశం ఉండేది. 2012లోనే అప్పటి కలెక్టర్ గండికోటకు మూడు టీఎంసీల నీరు తెచ్చారు. కాలువ కెపాసిటీ 22వేల క్యూసెక్కులు ఉంటే, అప్పట్లో 600 క్యూసెక్కులు తెచ్చారు. ఇప్పటికీ 1000 క్యూసెక్కులకు మించి తీసుకురాని పరిస్థితి. 22వేల క్యూసెక్కుల కెపాసిటీతో గండికోటకు 26 టీఎంసీలు తీసుకురావాలి. పెండింగ్‌లో ఉన్న ప్రతిపనిని పూర్తిచేసి గండికోట నుంచి చిత్రావతికి నీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే ఆమేరకు ముంపు గ్రామాల ప్రజలకు ప్యాకేజీ చెల్లించాలని కోరుతున్నాం.
చంద్రబాబుకు రైతుల మీద ఏమాత్రం ప్రేమలేదు
చంద్రబాబుకు రైతుల మీద ఏమాత్రం ప్రేమలేదు. కేబినెట్ మీటింగ్‌లో రైతుల పరిస్థితి గురించి మాట్లాడరు. రైతుల భూములు ఎలా లాక్కోవాలి, ఎలా పెద్దలకు ఇవ్వాలని ఆలోచిస్తారు. ఎస్‌ఎల్‌బీసీ మీటింగ్‌లో చంద్రబాబునాయుడు సంతృప్తిపడ్డారని ఈనాడు పేపర్లో చదివా. రూ.24వేల కోట్ల రబీ పంట రుణాలు, రూ.10వేల కోట్ల దీర్ఘకాలిక రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లు టార్గెట్ పెట్టుకున్నారు. కానీ రూ.4500 కోట్లు మాత్రమే రబీ రుణాలు ఇచ్చి చేతులు దులుపుకొంటుంటే, చంద్రబాబు సంతృప్తి పడ్డారట. ఈ పెద్దమనిషికి బుద్ధి, జ్ఞానం ఉందా? రబీలో 24 లక్షల హెక్టార్లల్లో పంటలు సాగుచేయాల్సి ఉండగా, కేవలం తొమ్మిది లక్షల హెక్టార్లు మాత్రమే సాగులోకి వచ్చింది. రైతులపట్ల చంద్రబాబుకు ప్రేమలేదు... ఏమి జరుగుతోందనే అవగాహన లేదు... డబ్బు డబ్బు అనే పిచ్చి మాత్రమే ఉంది. రైతులు పడుతున్న అగచాట్లు చూసైనా ఆయనకు బుద్ధి వస్తుందని ఆశిస్తున్నాం. నీళ్ల కోసం రైతులు చేపట్టిన ఈ ధర్నాను చూసైనా ఆయనకు జ్ఞానోదయమై చిత్రావతికి నీరు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.
చిత్రావతికి వెంటనే నీరివ్వండి
చిత్రావతి రిజర్వాయర్‌కు తక్షణమే నీరు విడుదల చేయాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. ‘‘ఇవాళ చిత్రావతిలో, శ్రీశైలంలో నీరున్నా రైతులకు వదలని పరిస్థితి. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (సీబీఆర్) సామర్థ్యం 10 టీఎంసీలు కాగా కేవలం 3.2 టీఎంసీలు కేటాయించారు. అందులో తొలివిడతగా ఆగస్టు 16 నుంచి అక్టోబర్ 7 వరకూ 1.8 టీఎంసీలు మిడ్‌పెన్నార్ రిజర్వాయర్ ద్వారా విడుదల చేయగా, సీబీఆర్‌లోకి కేవలం 0.675 టీఎంసీలు చేరాయి. మొదటి విడతలో విడుదల చేసిన నీటిలో 63 శాతం లాస్ (ఆవిరి నష్టాలు) అయ్యా యి. రెండోవిడతగా నవంబర్ 1 నుంచి డిసెంబర్ 22 వరకూ 1.4 టీఎంసీల నీరు విడుదల చేయగా కేవలం 0.66 టీఎంసీలు చేరాయి. అంటే రెండోవిడతలో 53 శాతం నీటినష్టం జరిగింది.
ఆ తర్వాత చిత్రావతికి నీరు రాని పరిస్థితి. ప్రస్తుతం చిత్రావతిలో 1.15 టీఎంసీల నీరు ఉంది. చిత్రావతి నుంచి సాగునీరు అందించాలంటే డ్రైవింగ్ హెడ్ 0.9 టీఎంసీలు ఉండాలి. ప్రస్తుతం 1.15 టీఎంసీలు ఉన్నాయి కాబట్టి సాగునీరు కాస్తోకూస్తో అందించవచ్చు. కానీ ప్రభుత్వం డిసెంబర్ 22 తర్వాత హఠాత్తుగా చిత్రావతికి నీళ్లందించడం మానేసింది. డ్రైవింగ్ హెడ్ ఉన్నప్పుడు చిత్రావతికి నీరు పంపిస్తే పులివెందుల పరిధి లోని చెరువులు, స్టోరేజీ ట్యాంకులు నింపుకొనే అవకాశం ఉండేది. ప్రస్తుతం చిత్రావతి ద్వారా 40 క్యూసెక్కులు పులివెందుల, కదిరి, ధర్మవరం, పుట్టపర్తి ప్రాంతాలకు తాగునీరు కోసం ఖర్చుచేస్తున్నారు. డ్రైవింగ్ హెడ్ తగ్గిపోయూక నీరు ఇస్తే డ్రైవింగ్ హెడ్ పెంచుకునేందుకు ఉపయోగపడడం తప్ప, కాలువలకు నీరు విడుదల సాధ్యం కాదు’’ అని జగన్ దుయ్యబట్టారు. అందుకే తక్షణమే చిత్రావతికి నీరు విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.