సాక్షి, హైదరాబాద్: కృష్ణా ట్రిబ్యునల్–1 జల కేటాయింపులకు విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం చేపట్టిన హంద్రీ నీవా సుజల స్రవంతి (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్) ఎత్తిపోతల పథకంతో పాటు దాని విస్తరణ పనులను తక్షణమే అడ్డుకోవాలని కృష్ణా నది యాజమాన్య బోర్డు(కేఆర్‌ఎంబీ)ను తెలంగాణ ప్రభుత్వం మరోసారి కోరింది. కృష్ణా జలాల ఆధారంగా చేపట్టిన ప్రస్తుత హంద్రీ నీవా ఎత్తిపోతల పథకాలకే కేఆర్‌ఎంబీ అనుమతి, అపెక్స్ కౌన్సిల్ ఆమోదం లేదని తెలిపింది. అలాంటిది మరో కొత్త పథకాన్ని చేపట్టడం సమంజసం కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ సి.మురళీధర్ ఇటీవల కృష్ణా బోర్డు చైర్మన్‌కు లేఖ రాశారు.
అభ్యంతరాలు పట్టించుకోకుండా..
హంద్రీ నీవా విస్తరణలో భాగంగా మల్యాల నుంచి (–)4.8 – 216.3 కి.మీల(1–8 పంపింగ్ స్టేషన్లు) పరిధిలోని ప్రధాన కాల్వ సామర్థ్యాన్ని 3,850 క్యూసెక్కుల నుంచి 6,300 క్యూసెక్కులకు పెంచేందుకు రూ.4,652 కోట్ల వ్యయంతో ఏపీ ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించిందని లేఖలో ఫిర్యాదు చేశారు. శ్రీశైలం జలాశయం నుంచి ఏపీ 34 టీఎంసీలకు మించి నీళ్లను తీసుకోకుండా నిలువరించాలని తెలంగాణ ప్రభుత్వం పదేపదే కోరుతున్నా.. ఇలా టెండర్లను ఆహ్వానించిందని పేర్కొన్నారు. శ్రీశైలంనుంచి ఏపీ ప్రభుత్వం విని యోగించుకోవాల్సిన 34 టీఎంసీల వరద జలాలకు సంబంధించిన అంతర్రాష్ట్ర ఒప్పందాలు, ప్రణాళికా సంఘం అనుమతుల్లో హంద్రీ నీవా పథకం ప్రస్తావనే లేదని గుర్తు చేశారు.
కేంద్ర జలసంఘం/కేంద్ర జల వనరుల శాఖ అనుమతుల ప్రకారం వరద ప్రవాహ సమయాల్లోనే శ్రీశైలం జలాశయం నుంచి ఏపీ 34 టీఎంసీలను తీసుకోవాలని స్పష్టం చేశారు. అయితే కృష్ణా పరీవాహక ప్రాంతం వెలుపలి ప్రాంతాలకు ఏపీ ప్రయోజనం కలిగిస్తోందని అభ్యంతరం వ్యక్తం చేశారు. కృష్ణా ట్రిబ్యునల్–1 కేటాయింపులకు విరుద్ధంగా తుంగభద్ర ఉప పరీవాహక ప్రాంతాలకు ఈ ప్రాజెక్టు నీటిని తరలిస్తోందని పేర్కొన్నారు. కృష్ణా బేసిన్ పరిధిలోని ప్రాజెక్టులకే భవిష్యత్తు కేటాయింపుల్లో ప్రాధాన్యత ఇవ్వాలని కృష్ణా ట్రిబ్యునల్–1 స్పష్టం చేసిందని తెలిపారు. అందువల్ల తక్షణమే హంద్రీ నీవా విస్తరణ పనులను అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు.
‘హంద్రీ నీవా’ను అడ్డుకోండి.. ! కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ
Published Tue, Nov 16 2021 3:19 AM | Last Updated on Tue, Nov 16 2021 9:43 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment