సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. చిత్రంలో మంత్రి అంబటి తదితరులు
సాక్షి, అమరావతి: హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం ద్వారా కుప్పం నియోజకవర్గానికి వచ్చే ఏడాది జూన్ నాటికి నీళ్లందించేలా పనులు పూర్తి చేయాలని జలవనరుల శాఖకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. పథకంలో అంతర్భాగమైన కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులను జూన్‌లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిని సమీక్షించి గడువులోగా పూర్తయ్యేలా తీసుకోవాల్సిన చర్యలను సూచించారు.
వంశధార ప్రాజెక్టు ఫేజ్–2, స్టేజ్–2 పూర్తి స్థాయి ఫలాలను ముందస్తుగా అందించడానికి గొట్టా బ్యారేజీ నుంచి హిరమండలం రిజర్వాయర్‌కు నీటి ఎత్తిపోత పనుల టెండర్ల ప్రక్రియను ప్రారంభించామని అధికారులు తెలిపారు. ఈ ఎత్తిపోతలకు డిసెంబర్‌లో శంకుస్థాపన నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. విజయనగరం జిల్లా తారకరామ తీర్థ సాగరంలో మిగిలిన పనులకు టెండర్లు పిలిచామని, నవంబర్‌లో పనులు ప్రారంభిస్తామని వివరించారు. మహేంద్ర తనయ ప్రాజెక్టు పూర్తి చేయడానికి అన్ని చర్యలు చేపట్టి రూ.852 కోట్లతో అంచనాలను సవరించామని, మిగిలిన పనుల పూర్తికి చర్యలు చేపట్టామని తెలిపారు.
గాలేరు–నగరిలో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్ పనులు కూడా పూర్తి కావస్తున్నాయని వెల్లడించారు. వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్‌లో 3.4 కి.మీ. మేర పనులు మిగిలాయని అధికారులు పేర్కొనగా సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రకాశం బ్యారేజీకి దిగువన కృష్ణా నదిపై కొత్త బ్యారేజీ నిర్మాణాన్ని ప్రాధాన్యతగా తీసుకోవాలని సూచించారు.
ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం పనులు చేపట్టడానికి అవసరమైన భూ సేకరణకు నిధులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాధాన్యతగా పనులు చేపట్టాలని సూచించారు. కొత్తవి పూర్తి చేయటంతోపాటు సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించి అవసరమైన సిబ్బందిని నియమించుకోవాలన్నారు. ప్రాజెక్టుల నిర్వహణకు సంబంధించి ఒక కార్యాచరణ రూపొందించి క్రమం తప్పకుండా తనిఖీలతో అవసరమైన పనులు చేపట్టాలని నిర్దేశించారు.
అత్యంత ప్రాధాన్యతగా పోలవరం..
పోలవరంను అత్యంత ప్రాధాన్యతగా పరిగణిస్తూ పనుల పురోగతిపై సీఎం జగన్ సమీక్షించారు. ఈసీఆర్‌ఎఫ్ (ఎర్త్ కమ్ రాక్ ఫిల్) డ్యాం నిర్మాణ ప్రాంతంలో కోతకు గురైన ప్రాంతం(అగాధాలు), డయాఫ్రమ్‌వాల్ పటిష్టతను తేల్చడం, ఆ తర్వాత ఈసీఆర్‌ఎఫ్ పనులు చేపట్టే ప్రణాళికపై అధికారులతో చర్చించారు. ఇప్పటికీ గోదావరిలో వరద కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఈ రోజు కూడా గోదావరిలో 2.50 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తోందన్నారు.
ఈసీఆర్‌ఎఫ్ డ్యాంలో ఎలాంటి పనులు చేపట్టాలన్నా తొలుత కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చేందుకు పరీక్షలు, వాటిలో వెల్లడైన అంశాల ఆధారంగా సీడబ్ల్యూసీ డిజైన్లు ఖరారు చేస్తేగానీ చేపట్టమలేమన్నారు. కోతకు గురైన ప్రాంతాన్ని పూడ్చటానికి, డయాఫ్రం వాల్ పటిష్టతపై నిర్ధారణల కోసం సీడబ్ల్యూసీ సూచించిన మేరకు పరీక్షలను నవంబర్ మధ్యలో ప్రారంభిస్తామన్నారు. వాటి తుది ఫలితాలు డిసెంబరు ఆఖరుకు వచ్చే అవకాశం ఉందన్నారు. ఆ ఫలితాల ఆధారంగా కోతకు గురైన ప్రాంతం పూడ్చివేత విధానం, డిజైన్లను సీడబ్ల్యూసీ ఖరారు చేస్తుందన్నారు.
పరీక్షల్లో వెల్లడయ్యే ఫలితాల ఆధారంగా డయాఫ్రమ్ వాల్‌పై సీడబ్ల్యూసీ ఒక నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఈ పరీక్షలు చేస్తున్న సమయంలోనే దిగువ కాఫర్ డ్యామ్‌ను పూర్తి చేస్తామని అధికారులు వివరించారు. దిగువ కాఫర్ డ్యాం పూర్తి కాగానే.. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల మధ్య నిల్వ ఉన్న నీటిని తోడివేసి సీడబ్ల్యూసీ ఖరారు చేసిన డిజైన్ల మేరకు ఈసీఆర్‌ఎఫ్ పనులు ప్రారంభిస్తామన్నారు. ఆలోగా 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని నిర్వాసితులకు పునరావాసం కల్పించడంపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ ఆదేశించారు.
గోదావరికి రెండో అతి పెద్ద వరద ప్రవాహం
గోదావరిలో వరద ప్రవాహం నిరంతరం కొనసాగుతోందని అధికారులు తెలిపారు. 1990 తర్వాత అత్యధికంగా ఈ ఏడాది గోదావరికి అతి పెద్ద వరద ప్రవాహం వచ్చిందన్నారు. ఈ ఏడాది జులై 18న అత్యధికంగా 25.92 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందన్నారు. ఆ తర్వాత ఆగస్టు 14న కూడా 15.04 లక్షల క్యూసెక్కులు, ఆగస్టు 19న 15.92 లక్షల క్యూసెక్కులు, సెప్టెంబరు 16న 13.78 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని తెలిపారు.
ఇప్పటికీ రెండున్నర లక్షల క్యూసెక్కులకు పైగా వరద కొనసాగుతోందన్నారు. ధవళేశ్వరం బ్యారేజీకి 1990లో 355 రోజుల పాటు ప్రవాహం రాగా 7,092 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలిశాయన్నారు. 1994లో ధవళేశ్వరం బ్యారేజీకి 188 రోజులు వరద ప్రవాహం రాగా 5,959 టీఎంసీలు కడలిలో కలిశాయి. 2013లో 213 రోజులు వరద రాగా 5,921 టీఎంసీలు సముద్రంలో కలిశాయి. ఈ ఏడాది ధవళేశ్వరం బ్యారేజీకి 136 రోజుల పాటు వరద ప్రవాహంతో 6,010 టీఎంసీలు సముద్రంలో కలిశాయన్నారు.
సమర్థంగా నియంత్రిస్తూ ఆయకట్టుకు నీళ్లు ప్రకాశం బ్యారేజ్ నుంచి 1,164.10 టీఎంసీలు కృష్ణా జలాలు, గొట్టా బ్యారేజ్ నుంచి 119.2 టీఎంసీల వంశధార జలాలు, నారాయణపురం ఆనకట్ట నుంచి 34.8 టీఎంసీల నాగావళి జలాలు, నెల్లూరు బ్యారేజ్ నుంచి 92.41 టీఎంసీల పెన్నా జలాలు ఇప్పటిదాకా కడలిలో కలిశాయని అధికారులు వెల్లడించారు. నదుల్లో వరద ప్రవాహం కొనసాగుతోందని, ఇంకా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రిజర్వాయర్లలో 90 శాతాన్ని నీటిని నిల్వ చేసి ఆయకట్టుకు నీళ్లందిస్తున్నామన్నారు. వరదను సమర్థంగా నియంత్రిస్తూ ఆయకట్టుకు నీటిని అందించి రైతులకు ప్రాజెక్టుల ఫలాలు అందించాలని సీఎం జగన్ సూచించారు.
ఎత్తిపోతల నిర్వహణపై ప్రత్యేక దృష్టి
ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల అభివృద్ధి సంస్థ(ఏపీఎస్‌ఐడీసీ) పరిధిలోని ఎత్తిపోతల పథకాలు ఏళ్ల తరబడి నిర్వహణ సరిగ్గా లేక మూలనపడుతున్నాయని అధికారులు పేర్కొనగా నిర్వహణపై ఎస్‌వోపీ (నిర్దిష్ట నిర్వహణ ప్రణాళిక)లు రూపొందించాలని సీఎం జగన్ ఆదేశించారు. సంబంధిత ఎత్తిపోతల పథకాల పరిధిలో రైతులతో కమిటీలు ఏర్పాటు చేసి వారి పర్యవేక్షణలో నిర్వహించడంపై కసరత్తు చేయాలని సూచించారు.
కర్ణాటక, మహారాష్ట్రతోపాటు వివిధ రాష్ట్రాల్లో ఎత్తిపోతల నిర్వహణకు అమలు చేస్తున్న విధానాలపై అధ్యయనం చేసి మెరుగైన పద్ధతి రూపొందించాలన్నారు. ఈ పథకాల నిర్వహణకు ప్రభుత్వం నుంచి కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలన్నారు. కరెంట్ బిల్లులను ప్రభుత్వమే చెల్లిస్తున్నందున రైతుల పర్యవేక్షణలో ఎత్తిపోతలను సమర్థంగా నిర్వహించేలా అవగాహన కల్పించి శిక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు, ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, వివిధ ప్రాజెక్టుల సీఈలు ఈ సమీక్షకు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment