సాక్షి, అమరావతి: విజయనగరం జిల్లాలోని ప్రాజెక్టులను వీలైనంత త్వరాగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఈ ఏడాది లక్ష్యంగా పెట్టుకున్న అవుకు టన్నెల్-2, పూల సుబ్బయ్య వెలిగొండ టన్నెల్-1, నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, వంశధార-నాగావళి అనుసంధానం, వంశధార ప్రాజెక్ట్-2లో ఫేజ్-2 పనుల ప్రగతిపై సీఎం జగన్ సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణంపై కరోనా ప్రభావం చూపిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. ఇప్పుడు ప్రాజెక్టు పనులు వేగం పుంజుకుంటున్నాయని వివరణ ఇచ్చారు. వరద సమయంలోనూ పోలవరం పనులు చేసేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. అక్టోబరు నాటికి అవుకు టన్నెల్-2 పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. ఇటీవల వర్షాలకు సొరంగ మార్గంలో మట్టి జారిందని, దాన్ని అరికట్టడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి వారి సూచనల మేరకు తగిన చర్యలు చేపడతామని అధికారులు పేర్కొన్నారు. అనుకున్న ప్రకారం అక్టోబరు నాటికి అదనంగా మరో 10వేల క్యూసెక్కుల నీరు వెళ్లే అవకాశం ఉంటుందని అధికారులు చెప్పారు. (తమ్ముడూ బాగున్నారా.. అన్నా ధన్యవాదాలు)
విజయనగరం జిల్లాలోని ప్రాజెక్టులను కూడా వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. తోటపల్లిలో మిగిలిపోయిన పనులు సహా వివిధ ప్రాజెక్టులకు రూ.500 కోట్లు ఖర్చుపెడితే ఇక్కడ అన్ని ప్రాజెక్టులూ పూర్తవుతాయన్నారు. నెలకు కొంత మొత్తాన్ని కేటాయించుకుంటూ పోతే ఇవన్నీ కూడా పూర్తిస్థాయిలో వినియోగంలోకి వస్తాయని సీఎం తెలిపారు. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్ నుంచి డిసెంబర్ మొదటి వారంలో నీటి విడుదలకు సిద్ధం చేస్తామని అధికారులు సీఎం జగన్‌కి తెలిపారు. ఒక్క ఏడాది కాలంలోనే సుమారు 2.2 కిలోమీటర్లు తవ్వగలిగామని అధికారులు వెల్లడించారు.
వెలిగొండ ప్రాజెక్టుకు టన్నెల్-2ను వేగంగా పూర్తి చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. నెల్లూరు బ్యారేజీలో సివిల్ పనులు దాదాపు పూర్తికావచ్చాయని అధికారులు వివరించారు. గేట్ల బిగింపు ప్రక్రియను మొదలుపెట్టామని మొత్తంగా 86.35శాతం పనులు పూర్తి అయినట్లు ముఖ్యమంత్రికి తెలిపారు. నవంబరు నెలాఖరు నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. సంగం బ్యారేజీ కూడా నవంబర్ నాటికి పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు. (వైఎస్సార్ చేయూతను ప్రారంభించడం నా అదృష్టం)
వంశధార ప్రాజెక్టు రెండో ఫేజ్-2 పనుల ప్రగతిపై సీఎం జగన్ ఆరా తీశారు. వంశధార - నాగావళి లింకు పనులు డిసెంబరు చివరి నాటికి పూర్తి చేస్తామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. ఈ ప్రాజెక్టు పనులు వచ్చే మార్చినాటికి పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు. నేరడి ప్రాజెక్టు నిర్మాణానికి తగిన చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఇప్పటికే ఒడిశా సీఎంతో చర్చల కోసం సీఎం జగన్ లేఖ రాసిన అంశాన్ని గుర్తు చేశారు. దీని రిప్లై కోసం వేచి చూడకుండా, వారితో మాట్లాడి ఒడిశా సీఎంతో చర్చలకు ఖరారు చేయాలన్నారు. అలాగే జంఝావతి ప్రాజెక్టుకు సంబంధించి ఒడిశాతో ఉన్న సమస్యల పరిష్కారానికి దృష్టి పెట్టాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు.
పోలవరం ప్రాజెక్టు
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ప్రగతిని సీఎం వైఎస్ జగన్‌కు అధికారులు వివరించారు. కోవిడ్ సమయంలో కూడా పనులు కొనసాగించామని తెలిపారు. పోలవరం స్పిల్‌వే పిల్లర్స్ ఈ ప్రభుత్వం వచ్చేనాటికి సగటు ఎత్తు 28 మీటర్లు కాగా, ఇప్పుడు 51 మీటర్లుగా ఉందని తెలిపారు. సెప్టెంబరు 15కల్లా స్పిల్‌వే పిల్లర్స్ పనులు పూర్తవుతాయని అధికారులు సీఎంకు చెప్పారు. వర్షాకాలంలో కూడా పనులు చేసేందుకు ప్రణాళికలు వేసుకున్నామని సీఎం దృష్టికి తీసుకువచ్చారు. అలాగే ఎడమ కాల్వ పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. పోలవరం సహాయ పునరావాస పనులపైనా సమీక్షించిన సీఎం వైఎస్ జగన్.. పునరావాస కార్యక్రమాల్లో నాణ్యతపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. గండికోటలో 26.85 టీఎంసీల నీటిని నిల్వ చేసేందుకు వీలుగా అవసరమైన ఆర్ అండ్ ఆర్ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈసారి ప్రాజెక్టును పూర్తి స్థాయిలో నింపాలని అధికారులకు సూచించారు. చిత్రావతిలో 10 టీఎంసీల నీటిని కూడా నిల్వచేయాలని అధికారులకు తెలిపారు.
గండికోట-పైడిపాలెం లిఫ్ట్ అప్‌గ్రెడేషన్ పనులు కూడా త్వరగా మొదలు పెట్టాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. రాజోలి, జొలదరాశి ప్రాజెక్టులు పనులు త్వరితగతిన మొదలుపెట్టాలని సూచించారు. టెండర్ ప్రక్రియ జ్యుడిషియల్ ప్రివ్యూకు వెళ్లిందని అధికారులు సీఎంకి వివరించారు. జీఎన్‌ఎస్‌ఎస్ నుంచి హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌కు లింక్ చేసే లిఫ్ట్ పనులు కూడా త్వరగా మొదలు పెట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. పులివెందుల మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు కూడా వెంటనే చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. ఈ సమీక్షలో జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ , సీఎం ముఖ్య సలహాదారు అజేయకల్లం, జవవనరుల శాఖ ఉన్నాతాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment