సాక్షి, అమరావతి: దున్నపోతు ఈనిందని ఎవరో అంటే.. ఎలా సాధ్యమని కనీసం ఆలోచించకుండా దూడను గాటికి కట్టేసేందుకు పలుగుతో సిద్ధమవడం ‘ఈనాడు’ మార్కు అజ్ఞాన సంపదకు తార్కాణం. ఆ అజ్ఞానంతో పచ్చి అబద్ధాలను ప్రచురిస్తూ నిజమని నమ్మించే దుస్సాహసానికి ఒడిగట్టడం రామోజీకే సాధ్యం. కొత్త ప్రాజెక్టుల్లో నీటి నిల్వకు సంబంధించి డ్యామ్ సేఫ్టీ ప్రొటోకాల్ ప్రకారం సీడబ్ల్యూసీ నిర్దిష్టంగా కొన్ని మార్గదర్శకాలు జారీ చేసిందనే కనీస పరిజ్ఞానం కూడా ‘ఈనాడు’కు లేకపోవడంపై నీటిపారుదల రంగ నిపుణుల్లో విస్మయం వ్యక్తమవుతోంది.
ఎత్తు తగ్గడం ఉత్తదే..
పోలవరం ఎత్తు 45.72 మీటర్ల నుంచి ఒక్క అం గుళం కూడా తగ్గించే ప్రతిపాదన ఏదీ తమ వద్ద లే దని లోక్‌సభలో సాక్షాత్తూ కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ గతేడాది ఫిబ్రవరి 11న స్పష్టం చేశారు. అయితే పోలవరం ఎత్తు తగ్గిస్తున్నట్లు తనకు తానే ఊహించుకుని పదేపదే కల్పిత కథనాలను ప్రచురించడం ఏమిటని సాగునీటి నిపుణులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రానికి జీవనాడి లాంటి పోలవరాన్ని కమీషన్ల కోసం జీవచ్ఛవంలా మార్చిన చంద్రబాబును అపర భగీరథుడుగా కీ ర్తిస్తూ.. ప్రాజెక్టుకు జీవం పోసి శరవేగంగా ఫలాల ను అందించేందుకు వడివడిగా అడుగులు వేస్తున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై అభూత కల్పనలతో అసత్యాలను అచ్చేస్తున్నారని ప్రాజెక్టు పనులను సుదీర్ఘకాలం పర్యవేక్షించిన రిటైర్డు చీఫ్ ఇంజనీర్ ఒకరు పేర్కొన్నారు.
ఆ ప్రకారమే పోలవరంలోనూ..
పోలవరం డెడ్ స్టోరేజీ 17 మీటర్లు కాగా కనీస నీటి మట్టం 41.15 మీటర్లు. గరిష్ట నీటి మట్టం 45.72 మీటర్లు. ఈ ప్రకారమే ప్రాజెక్టు నిర్మాణానికి సీడబ్ల్యూసీ ఆమోదం తెలిపింది. ఆ డిజైన్ ప్రకారమే జాతీయ ప్రాజెక్టు పోలవరాన్ని కేంద్రం తరఫున రా ష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. వచ్చే ఏడాదికి పూర్తి చేసే దిశగా పనులను వేగవంతం చేసింది. పూర్తి చేసిన తొలి ఏడాది సీడబ్ల్యూసీ మార్గదర్శకాల (డ్యామ్ సేఫ్టీ ప్రొటోకాల్) మేరకు కనీస నీటి మట్టం 41.15 మీటర్ల కాంటూర్ స్థాయిలో 115.44 టీఎంసీలను నిల్వ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండో ఏడాది 150 టీఎంసీలు, మూడో ఏడాది పూర్తి సామర్థ్యం మేరకు అంటే 194.6 టీఎంసీలు నిల్వ చేసేలా ప్రణాళిక రూపొందించి కేంద్ర జల్ శక్తి, ఆర్థిక శాఖలకు సమర్పించింది. ఈ ప్రణాళిక అమలుకు నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేసింది.
తొలి ఏడాది నీటి నిల్వ కోసం నిధులు..
రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికను అనుసరించి సీడబ్ల్యూసీ మార్గదర్శకాల ప్రకారం పోలవరంలో తొలి ఏడాది 41.15 మీటర్ల కాంటూర్ వరకూ నీటిని నిల్వ చేయడానికి వీలుగా పనులు పూర్తి చేసేందుకు ఎన్ని నిధులు అవసరమో తేల్చాలని జల్ శక్తి శాఖను కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశించింది. ఇదే తరహాలో రెండో ఏడాది 2/3, మూడో ఏడాది పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేయడానికి అవసరమైన నిధులను తేల్చాలని నిర్దేశించింది. ఇదే అంశంపై జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ ఆదేశాల మేరకు సీడబ్ల్యూసీ సభ్యులు కుశ్వీందర్ వోహ్రా పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ), రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులతో మంగళవారం వర్చువల్ పద్ధతిలో సమీక్ష నిర్వహించారు. ప్రతిపాదనలు అందచేస్తే కేంద్ర ఆర్థిక శాఖకు పంపి నిధులు విడుదల చేయాలని సూచిస్తామని సీడబ్ల్యూసీ సభ్యులు వోహ్రా పేర్కొన్నారు. వారంలో సమర్పిస్తామని జలవనరుల అధికారులు తెలిపారు. మంగళవారం సమావేశంలో జరిగింది ఇది కాగా అజ్ఞానంతో విషం చిమ్మడంపై సాగునీటిరంగ నిపుణులు విస్తుపోతున్నారు.
ఒకేసారి పూర్తి ఫలాలందించడం సాధ్యమా?
కొత్తగా చేపట్టిన ఒక ప్రాజెక్టును పూర్తి చేసిన తొలి ఏడాదిలోనే పూర్తి స్థాయిలో ఫలాలను అందించిన దాఖలాలు ప్రపంచ చరిత్రలో ఎక్కడా లేవు. దశల వారీగా ప్రాజెక్టు ఫలాలను ప్రజలకు అందిస్తారు. ఈ క్రమంలోనే పోలవరం పూర్తయ్యే తొలి ఏడాది 41.15 మీటర్ల స్థాయిలో 115.44 టీఎంసీలను నిల్వ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
పదేపదే తప్పుడు రాతల్లో ఆంతర్యమేంటి?
పోలవరం ఎత్తు 41.15 మీటర్లకే పరిమితం చేస్తున్నారంటూ 2020లోనూ ‘ఈనాడు’ ఇదే రీతిలో రాష్ట్ర ప్రభుత్వంపై విషం చిమ్మింది. రామోజీ అచ్చేసిన అబద్ధాలతో ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతున్నారు. వీటిని శాసనసభ సాక్షిగా 2020 డిసెంబర్ 2న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఖండించారు. పోలవరం ఎత్తు ఒక్క ఇంచు కూడా తగ్గించడం లేదని.. 45.72 మీటర్ల స్థాయిలోనే నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. కావాలంటే ప్రాజెక్టు ఎత్తు కొలిచేందుకు టేపుతో సిద్ధంగా ఉండాలని చంద్రబాబుకు సవాల్ విసిరారు. అజ్ఞానంతో రాష్ట్ర జీవనాడిపై విషం చిమ్మవద్దని హితవు పలికారు. అయినా సరే ప్రాజెక్టు పూర్తవుతోందనే కడుపుమంటతో పోలవరంపై అక్కసు వెలిబుచ్చుతూనే ఉన్నారు.
సీడబ్ల్యూసీ మార్గదర్శకాలు (డ్యామ్ సేఫ్టీ ప్రొటోకాల్) తెలుసా?
► ఏదైనా ఒక కొత్త ప్రాజెక్టును నిర్మిస్తే అందులో నీటిని ఎలా నిల్వ చేయాలనే అంశంపై కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) నిర్దిష్టంగా కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. ప్రాజెక్టు భద్రత దృష్ట్యా తప్పనిసరిగా వీటి ప్రకారమే నిల్వ చేయాలి.
► ప్రాజెక్టు పూర్తయిన తొలి ఏడాది పూర్తి నీటి నిల్వ సామర్థ్యంలో 1/3 వంతు మాత్రమే నిల్వ చేయాలి. రెండో ఏడాది పూర్తి నీటి నిల్వ సామర్థ్యంలో 2/3 వంతు నీటిని నిల్వ చేయాలి. ఏవైనా లోటుపాట్లు ఉంటే సరిదిద్దాలి.
► అన్నీ సక్రమంగా ఉన్నాయని, ప్రాజెక్టు భద్రతకు ఢోకా లేదని నిర్ధారించుకున్నాకే పూర్తి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ చేయాలి.
పదేపదే తప్పుడు రాతల్లో ఆంతర్యమేంటి?
పోలవరం ఎత్తు 41.15 మీటర్లకే పరిమితం చేస్తున్నారంటూ 2020లోనూ ‘ఈనాడు’ ఇదే రీతిలో రాష్ట్ర ప్రభుత్వంపై విషం చిమ్మింది. రామోజీ అచ్చేసిన అబద్ధాలతో ప్రతిపక్ష నేత చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసం పాకులాడుతున్నారు. వీటిని శాసనసభ సాక్షిగా 2020 డిసెంబర్ 2న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఖండించారు. పోలవరం ఎత్తు ఒక్క ఇంచు కూడా తగ్గించడం లేదని.. 45.72 మీటర్ల స్థాయిలోనే నిర్మిస్తున్నామని స్పష్టం చేశారు. కావాలంటే ప్రాజెక్టు ఎత్తు కొలిచేందుకు టేపుతో సిద్ధంగా ఉండాలని చంద్రబాబుకు సవాల్ విసిరారు. అజ్ఞానంతో రాష్ట్ర జీవనాడిపై విషం చిమ్మవద్దని హితవు పలికారు. అయినా సరే ప్రాజెక్టు పూర్తవుతోందనే కడుపుమంటతో పోలవరంపై అక్కసు వెలిబుచ్చుతూనే ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment