FactCheck: Eenadu Ramojirao Fake News On YS Jagan Govt About Polavaram, Facts Inside - Sakshi
Sakshi News home page

Fact Check: హామీ అమలు చేస్తున్నా హాహాకారాలేనా?

Published Tue, Jul 25 2023 3:42 AM | Last Updated on Fri, Aug 11 2023 1:46 PM

Eenadu Ramojirao Fake News On YS Jagan Govt about Polavaram - Sakshi

సాక్షి, అమరావతి : పోలవరం ప్రాజెక్టువల్ల ప్రయోజనం పొందే రైతులకు దీటుగా ఆ ప్రాజెక్టు కోసం త్యాగం చేస్తున్న నిర్వాసితుల జీవన ప్రమాణాలు పెంచేలా సీఎం వైఎస్‌ జగన్‌ పునరావాసం కల్పిస్తుండటాన్ని చూసి ఓర్వలేని రామోజీరావు ‘ఈనాడు’లో ఎప్పటిలాగే రోతరాతలతో యథేచ్ఛగా విషం చిమ్మారు. సర్వస్వం త్యాగంచేసిన నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా వారిని రోడ్డున పడేసి.. ప్రాజెక్టు ప్రోటోకాల్‌ను తుంగలో తొక్కి కొడుకు వియ్యంకుడి సంస్థతో కలి­సి ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ పనుల­ను రామోజీరావు, చంద్రబాబు చేపట్టి ప్రజా­ధనాన్ని దోచుకుని, పంచుకు తిన్నారన్నది బహిరంగ రహస్యం.

కమీషన్ల కోసం పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంగా మా­ర్చు­కున్నా­రని సాక్షాత్తూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్య­లే ఇందుకు నిదర్శనం. వైఎస్‌ జగన్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టాక.. చంద్రబాబు చేసిన ఘోర తప్పిదాలను సరిదిద్దుతూ ని­ర్వా­సితులకు పునరావాసం కల్పిస్తూ ప్రణాళి­కాబద్ధంగా ప్రాజెక్టును పూర్తిచేస్తుంటే రామోజీరావు దానిని జీర్ణించుకోలేకపోతున్నారు.

కాంట్రాక్టు నుంచి రామోజీ కొడుకు వియ్యంకుడి సంస్థను జగన్‌ తప్పించడంతో తమ డీపీటీ (దోచుకో, పంచుకో,  తినుకో)కి అడ్డుకట్ట ప­డిందనే రామోజీరావు అక్కసు సోమ­వారం ‘ఈనాడు’లో ‘గోదాట్లో కలిసిన జగన్‌ హా­మీ’ శీర్షికన ప్రచురించిన కథనంలోని ప్రతి అక్షరంలోనూ కన్పిస్తుంది. ఆ క్షుద్ర పాత్రి­కేయంలోని ఆరోపణలు, వాస్తవాలు ఇవీ..  

ఈనాడు ఆరోపణ: నిర్వాసితులకు పునరావా­స ప్యాకేజీ ఇవ్వలేదు.. పునరావాస కాలనీల­కు తరలించలేదు. పోలవరం ప్రాజెక్టు కోసం సర్వస్వం త్యాగంచేస్తే రోడ్డున పడేస్తారా? 
వాస్తవం: రాష్ట్రానికి హక్కుగా దక్కాల్సిన ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టేందుకు చంద్రబాబు అంగీకరించడంతో.. 2016, సెప్టెంబరు 7న అర్థరాత్రి పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్రానికి కేంద్రం అప్పగించింది. ఈ క్రమంలో 2013–14 ధరల ప్రకారం 2014, ఏప్రిల్‌ 1 నాటికి నీటిపారుదల విభాగంలో మిగిలిపోయిన వ్యయాన్ని మాత్రమే రీయింబర్స్‌ చేస్తామని కేంద్రం పెట్టిన షరతుకు అంగీకరించారు. 2013–14 ధరల ప్రకారం ప్రాజెక్టు నీటిపారుదల విభాగం వ్యయం రూ.20,398.61 కోట్లు.

ఇందులో 2014, ఏప్రిల్‌ 1 నాటికి రూ.4,730.71 కోట్లు వ్యయం చేశారని.. మిగిలిన రూ.15,667.9 కోట్లు మాత్రమే ఇస్తామంటూ 2016, సెప్టెంబరు 30న కేంద్ర ఆర్ధిక శాఖ తెగేసిచెబితే.. దానికి చంద్రబాబు తలూపారు. అందులో భూసేకరణ, నిర్వాసితుల పునరావాస వ్యయం రూ.9,477 కోట్లే. భూసేకరణ చట్టం–2013 అమల్లోకి వచ్చిన నేపథ్యంలో..  భూసేకరణ, నిర్వాసితుల పు­న­రావాస వ్యయం రూ.28,172.21 కోట్లు. అలాంటప్పుడు రూ.9,477 కోట్లతోనే భూసేకరణతోపాటు 373 ముంపు గ్రామాల్లోని 1,06,006 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పిస్తానని చంద్రబాబు అంగీకరించడంలో ఆంతర్యమేమిటన్నది బహిరంగ రహస్యమే.

నిర్మాణ బాధ్యతలు దక్కగానే రామోజీరావు కొడుకు వియ్యంకుడి సంస్థకు నామినేషన్‌పై పనులు కట్టబె­ట్టిన చంద్రబాబు.. ప్రాజెక్టు ప్రోటోకాల్‌ను తుంగలో తొక్కి.. సులభంగా చేయగలిగి, అధికంగా లాభాలు వచ్చే పనులకే ప్రాధాన్యమిచ్చి కమీషన్లు దండుకున్నారు. ఈ క్రమంలో నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండానే ఎగువ, దిగువ కాఫర్‌ డ్యామ్‌ల పనులు చేపట్టారు.

పునరావాసం కల్పించకుండా కాఫర్‌ డ్యామ్‌లు నిర్మిస్తూ తమను ముంచేస్తున్నారంటూ కేంద్ర జల్‌శక్తి శాఖ, సీడబ్ల్యూసీ (కేంద్ర జలసంఘం)కు నిర్వాసితు­లు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కేంద్ర జల్‌శక్తి శాఖ.. నిర్వాసితులకు పునరావా­సం కల్పిస్తూ కాఫర్‌ డ్యామ్‌ల పనులు చేయా­లని అప్పట్లో చేసిన సూచనలను చంద్రబాబు తోసిపుచ్చారు.

కమీషన్లు రావనే నెపంతో పునరావాసం పనులు చేపట్టకుండా.. కాఫర్‌ డ్యామ్‌ల పనులు మధ్యలోనే ఆపేసి చేతులెత్తేశారు. ఇప్పుడు చెప్పండి రామోజీ.. సర్వ­స్వం త్యాగం చేసిన నిర్వాసితులను రోడ్డున పడేసి వియ్యంకుడితో కలిసి పోలవరంలో దోచుకుంది మీరు, చంద్రబాబు కాదా? 

ఈనాడు: తొలిదశ పునరావాసానికీ దిక్కులే­దు. ఆందోళనలో 24 వేల కుటుంబాలు, ఊళ్లు. మాట తప్పను.. మడమ తిప్పను అనే సీఎం జగన్‌ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఇచ్చిన ఒక్కటంటే ఒక్క మాటనూ ఇప్పటికీ నిలబెట్టుకోలేదు.  
వాస్తవం: ప్రాజెక్టులో 41.15 మీటర్ల పరిధిలో 20,946 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించాలని తొలుత గుర్తించారు. ఇందులో 2014–2019 మధ్య 3,073 నిర్వాసిత కుటుంబాలకు రూ.96.80 కోట్లను పరిహారంగా అందించారు. 3,066 ఇళ్లను రూ.96.60 కోట్లతో నిర్మించి పునరావాసం కల్పించారు. అంటే.. ఐదేళ్లలో కేవలం రూ.193.4 కోట్లు వెచ్చించి 3,073 కుటుంబాలకు మాత్రమే చంద్రబాబు సర్కార్‌ పునరావాసం కల్పించినట్లు స్పష్టమవుతోంది. కానీ, జగన్‌ సీఎం అయ్యాక పునరావాసంపై ప్రత్యేక దృష్టిపెట్టారు.  

► 2019, మే 30 నుంచి ఇప్పటివరకూ 10,720 కుటుంబాలకు పునరావాస పరిహారంగా రూ.722.27 కోట్లు చెల్లించారు.  
► రూ.1,006.15 కోట్ల వ్యయంతో పునరావాస కాలనీల్లో 11,575 ఇళ్లను నిర్మించారు. 8,878 కుటుంబాలను కాలనీలకు తరలించి పునరావాసం కల్పించారు.  
► అంటే.. నాలుగేళ్లలో.. అందులో కరోనా విపత్తువల్ల రెండేళ్లు తీవ్ర ఇబ్బందులున్నా సరే రూ.1,728.42 కోట్ల వ్యయంతో 8,878 కుటుంబాలకు సీఎం జగన్‌ పునరావాసం కల్పించినట్లు స్పష్టమవుతోంది.  
► నిర్వాసితులకు పునరావాసం కల్పించడా నికి బాబు ఐదేళ్లలో చేసిన వ్యయం కంటే జగన్‌ నాలుగేళ్లలోనే తొమ్మిది రెట్లు అధికంగా ఖర్చుచేశారన్నది స్పష్టమవుతోంది.  
► మిగిలిన 8,228 కుటుంబాలకు నాలుగు నెలల్లో పునరావాసం కల్పించేందుకు జగన్‌ సర్కారు సిద్ధమైంది. ఇందుకు సంబంధించి రూ.830.14 కోట్ల బిల్లులు చెల్లించడానికి సిద్ధంగా ఉంది.  
► జగన్‌ ఇచ్చిన హామీ మేరకు పోలవరం నిర్వాసిత కుటుంబాలకు రూ.పది లక్షల నగదు ప్యాకేజీ ఇచ్చేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తూ 2021, జూన్‌లో జారీచేసిన జీఓ–224 అమలుకు కూడా సిద్ధమైంది. 

ఈనాడు: ‘ప్రధాని అపాయింట్‌మెంట్‌ తీసుకున్నాను.. మీ కష్టాలను ప్రధానికి వివరించి.. మీరే బటన్‌ నొక్కి నిర్వాసితులకు ఖాతాల్లో పరిహారం జమచేయాలని ప్రధానిని కోరుతా’ అని 2022, జూలై 28న పోలవరం నిర్వాసితులకు ఇచ్చిన హామీని సీఎం జగన్‌ నిలుపుకోలేదు. 
వాస్తవం: జగన్‌ 2022, ఆగస్టు 22న ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీతో సమావేశమై.. వాస్తవంగా భూసేకరణ, నిర్వాసితుల పునరావాస వ్య­య­మే రూ.28,172.21 కోట్లని.. కానీ, 2016­లో నాటి సీఎం చంద్రబాబు 2013–14 ధరల ప్రకారం రూ.15,667.9 కోట్లకే పూర్తిచేస్తానని అంగీకరించారని.. కానీ, ఆ ధరలతో ప్రాజెక్టును పూర్తిచేయడం అసాధ్యమని మరోసారి వివరించారు.

2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్య­యం రూ.55,656.87 కోట్లను ఆమోదించి.. ప్రాజెక్టును పూర్తి చేయడానికి సహకరించాలని విజ్ఞప్తిచేశారు. నిర్వాసితులకు చెల్లించాల్సిన నగదు పరిహారాన్ని వారి ఖాతాల్లో­నే నేరుగా జమచేయాలని ప్రధానిని కోరా­రు. ఇందుకు సానుకూలంగా స్పందించిన కేంద్రం.. నిర్వాసితుల పునరావాసంతో సహా తొలిదశ పూర్తికి రూ.12,911.15 కోట్ల­ను అదనంగా ఇచ్చేందుకు అంగీకరిస్తూ జూన్‌ 5న కేంద్ర ఆర్ధికశాఖ ప్రకటించింది.

ఇటీవల నిర్వహించిన లైడార్‌ సర్వేలో 41.15 కాంటూర్‌ పరిధిలోకి 36 గ్రామాలు ముంపునకు గురవుతాయని తేలింది. అందులో నివసిస్తున్న 16,642 కుటుంబాలకు పునరావాసం కల్పించడానికి రూ.4,223 కోట్లు వ్యయం అవుతుందని.. ఈ నేపథ్యంలో తొలిదశ పనుల పూర్తికి రూ.17,144 కోట్లు విడుదల చేయాలని జూలై 5న ప్రధానిని సీఎం జగన్‌ మరోసారి కోరారు. నిర్వాసితులకు జగన్‌ ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నిలబెట్టుకునే దిశగా చిత్తశుద్ధితో అడుగులు వేస్తుంటే నీకెందుకంత కడుపుమంట రామోజీ?.

అప్పుడు, ఇప్పుడూ అవే గ్రామాలు.. 
భద్రాచలం వద్ద గోదావరికి వరద వచ్చే సమయంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినప్పటికీ కుక్కునూ­రు, వేలేరుపాడు, కూనవరం, వరరామచంద్రాపురం మండలాల్లో పోలవరం ప్రాజెక్టు నిర్మించక ముందు కూడా అనేక గ్రామా­లు ముంపునకు గురయ్యేవి. ఆ గ్రామాల ప్రజలను రెవిన్యూ అధికారులు పునరావాస శిబిరాలకు తరలించేవారు.

ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు 48 గేట్లను పూర్తిగా ఎత్తివేసి, వచ్చిన వరదను వచ్చినట్లుగా దిగువకు వదిలేస్తున్నారు. అంటే నీటిని ఏమాత్రం నిల్వచేయడంలేదని స్పష్టమవుతోంది. ప్రాజెక్టు కట్టనప్పుడు ఏ గ్రామాలైతే ముంపునకు గురయ్యేవో ఇప్పుడు అవే గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఆ గ్రా­మా­ల ప్రజల­ను రెవిన్యూ అధికారులు పునరావాస శిబిరాలకు తరలిస్తున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement