సాక్షి, అమరావతి: వరద నీటిని ఒడిసి పట్టడంతోపాటు సాగునీటి ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేసి రైతులకు వాటి ఫలాలు అందించాలని జలవనరుల శాఖ అధికారులకు సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులతోపాటు కొత్తవాటిని ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయాలన్నారు. ఈ ఏడాది పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్న అవుకు టన్నెల్–2, వెలిగొండ తొలిదశ, నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, వంశధార–నాగావళి నదుల అనుసంధానం, వంశధార ప్రాజెక్టు స్టేజ్–2 ఫేజ్–2 పనుల పురోగతిపై బుధవారం తన క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్షించారు. జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు. ప్రాజెక్టుల పనులపై లాక్‌డౌన్, కోవిడ్ ప్రభావం చూపాయని, ఇప్పుడిప్పుడే వేగం పుంజుకుంటున్నాయని అధికారులు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గడువులోగా ప్రాజెక్టుల పనులు పూర్తి చేయాల్సిందేనని ఈ సందర్భంగా సీఎం జగన్ స్పష్టం చేశారు. సీఎం సమీక్ష వివరాలివీ..
సకాలంలో పూర్తి కావాల్సిందే..
► ఇటీవల వర్షాలకు అవుకు టన్నెల్–2 మార్గంలో మట్టి జారిందని, దీన్ని నివారించేందుకు చేపట్టాల్సిన చర్యలపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేశామని సమీక్షలో అధికారులు తెలిపారు. గడువులోగా అక్టోబర్ నాటికి అవుకు టన్నెల్–2 పూర్తి చేస్తామన్నారు. గాలేరు–నగరి సుజల స్రవంతి పథకానికి అదనంగా మరో 10 వేల క్యూసెక్కులను తరలించే ఈ టన్నెల్ పనులను వేగంగా పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు.
► తోటపల్లిలో మిగిలిపోయిన పనులు సహా విజయనగరం జిల్లాలో వివిధ ప్రాజెక్టులకు రూ.500 కోట్లు ఖర్చు పెడితే ఆ ప్రాజెక్టులన్నీ పూర్తవుతాయని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. క్రమం తప్పకుండా నిధులు కేటాయిస్తామని, ఆ ప్రాజెక్టులను శరవేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు.
► పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్ నుంచి డిసెంబర్ మొదటి వారంలో నీటి విడుదలకు ఏర్పాట్లు చేస్తామని అధికారులు తెలిపారు. ఒక్క ఏడాదిలోనే సుమారు 2.2 కిలోమీటర్ల మేర టన్నెల్ తవ్వకం పూర్తైందన్నారు.
► నెల్లూరు బ్యారేజీలో సివిల్ పనులు దాదాపు పూర్తి కావచ్చాయని, గేట్ల బిగింపు ప్రారంభించామని, మొత్తం 86.35 శాతం పనులు పూర్తయ్యాయని, నవంబరు ఆఖరు నాటికి బ్యారేజీని పూర్తి చేస్తామని అధికారులు వెల్లడించారు. సంగం బ్యారేజీ కూడా నవంబర్ నాటికి పూర్తి చేస్తామన్నారు.
► వంశధార స్టేజ్–2 ఫేజ్–2లో భాగమైన నేరడి బ్యారేజీ పనులకు సంబంధించి చర్చల కోసం ఇప్పటికే ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో లేఖ రాశామని, ఆ ప్రభుత్వాన్ని సంప్రదించి తేదీలను ఖరారు చేయాలని సీఎం ఆదేశించారు. జంఝావతిపై ఒడిశాతో సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలన్నారు.
► అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలవరం ప్రాజెక్టును 2021 డిసెంబర్ నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేయాల్సిందేనని సీఎం జగన్ ఆదేశించారు. లాక్‌డౌన్ సమయంలోనూ పోలవరం పనులు కొనసాగినట్లు అధికారులు తెలిపారు.
► వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి పోలవరం స్పిల్ వే పియర్స్ సగటు ఎత్తు 28 మీటర్లు కాగా ఇప్పుడు వాటి ఎత్తు 51 మీటర్లుగా ఉందని, శరవేగంగా పనులు జరుగుతున్నాయని వివరించారు. వర్షాకాలంలోనూ నిరాటంకంగా పనులు జరిగేలా ఏర్పాట్లు చేశామన్నారు. సెప్టెంబరు 15 కల్లా స్పిల్ వే పియర్స్ పనులు పూర్తవుతాయన్నారు. ఎడమ కాలువ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. పోలవరం సహాయ పునరావాస కార్యక్రమాల్లో నాణ్యతపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు.
► పోలవరంపై కేంద్రం నుంచి రీయింబర్స్‌మెంట్ నిధుల విడుదలకు చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో రూ.2,300 కోట్ల రీయింబర్స్‌కు ఇప్పటికే ప్రతిపాదనలు పంపామని, మరో రూ.2,277.34 కోట్ల రీయింబర్స్‌కు సంబంధించి పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ) ద్వారా పంపుతామని అధికారులు తెలిపారు.
► రాయలసీమ కరువు నివారణ పథకంలో భాగమైన ప్రాజెక్టుల టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. ఈ ఏడాది గండికోటలో 26.85 టీఎంసీలు, చిత్రావతిలో 10 టీఎంసీలు నిల్వ చేసేలా సహాయ, పునరావాస ప్యాకేజీ పనులను పూర్తి చేయాలన్నారు.
ప్రాజెక్టులు ఇక పరుగులు
Published Thu, Aug 13 2020 4:12 AM | Last Updated on Thu, Aug 13 2020 4:14 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment