సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల సమగ్రాభివృద్ధికి చుక్కానిలా నిలిచే తోటపల్లి బ్యారేజీ మిగిలిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తోటపల్లి బ్యారేజీ కింద పాత ఆయకట్టు 64 వేల ఎకరాలను స్థిరీకరించడంతోపాటు కొత్తగా 1.20 లక్షల ఎకరాలు, గజపతినగరం బ్రాంచ్ కెనాల్ కింద 15 వేల ఎకరాలు వెరసి 1.99 లక్షల ఎకరాలకు నీళ్లందించేందుకు జలవనరుల శాఖ సన్నద్ధమైంది.
శిథిలావస్థలో రెగ్యులేటర్..
విజయనగరం జిల్లాలో గరుగుబిల్లి మండలం తోటపల్లి వద్ద నాగావళిపై 1908లో ఆంగ్లేయుల హయాంలో రెగ్యులేటర్ నిర్మించారు. శిథిలావస్థకు చేరుకున్న ఈ రెగ్యులేటర్‌పై ఆధారపడి 64 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. నాగావళి వరద జలాలను గరిష్టంగా వినియోగించుకుని, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో 2004లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పాత రెగ్యులేటర్‌కు ఎగువన 2.509 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ బ్యారేజీ ద్వారా పాత ఆయకట్టు 64 వేల ఎకరాలను స్థిరీకరించడంతోపాటు కొత్తగా కుడికాలువ ద్వారా 1.20 లక్షల ఎకరాలు, కుడి కాలువలో 97.7 కిలోమీటర్ల నుంచి 25 కిలోమీటర్ల మేర గజపతినగరం బ్రాంచ్ కాలువ తవ్వడం ద్వారా 15 వేల ఎకరాలకు నీళ్లందించాలని నిర్ణయించారు.
భూ సేకరణ సమస్య పరిష్కారం..
తోటపల్లి బ్యారేజీ పనులు 2009 నాటికే పూర్తయ్యాయి. అయితే కుడి కాలువలో మిగిలిన పనులు పూర్తి కాకపోవడంతో 40 వేల ఎకరాలకు నీళ్లందని దుస్థితి నెలకొంది. రెండు ప్యాకేజీల కాంట్రాక్టర్లు పనులు చేయకుండా పదేళ్లుగా మొండికేస్తుండటంతో కొత్త కాంట్రాక్టర్లకు అప్పగించారు. ప్రధాన కాలువతోపాటు డిస్ట్రిబ్యూటరీల్లో మిగిలిన పనులు పూర్తి చేయడానికి 72.335 ఎకరాల భూసేకరణ సమస్యను ఇటీవలే ప్రభుత్వం పరిష్కరించింది. దీంతో మిగిలిన పనులను రూ.124.23 కోట్లతో వేగంగా పూర్తి చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు.
వేగంగా గజపతినగరం బ్రాంచ్ కెనాల్ పనులు
గజపతినగరం బ్రాంచ్ కెనాల్ పనులు కూడా వేగవంతమయ్యాయి. మిగిలిపోయిన 13,42,558 క్యూబిక్ మీటర్ల మట్టి పని, 30 వరకు బ్రిడ్జిలు, అండర్ టన్నెళ్లు లాంటి నిర్మాణాలు, 12,583 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులను వేగంగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు. కెనాల్ పూర్తయ్యేలోగా ఆయకట్టుకు నీళ్లందించే డిస్ట్రిబ్యూటరీలను పూర్తి చేసే దిశగా పనులను వేగవంతం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment