Totapalli barrage
-
‘తోటపల్లి’కి సంపూర్ణంగా సాగునీరు
సాక్షి, అమరావతి: ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల సమగ్రాభివృద్ధికి చుక్కానిలా నిలిచే తోటపల్లి బ్యారేజీ మిగిలిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తోటపల్లి బ్యారేజీ కింద పాత ఆయకట్టు 64 వేల ఎకరాలను స్థిరీకరించడంతోపాటు కొత్తగా 1.20 లక్షల ఎకరాలు, గజపతినగరం బ్రాంచ్ కెనాల్ కింద 15 వేల ఎకరాలు వెరసి 1.99 లక్షల ఎకరాలకు నీళ్లందించేందుకు జలవనరుల శాఖ సన్నద్ధమైంది. శిథిలావస్థలో రెగ్యులేటర్.. విజయనగరం జిల్లాలో గరుగుబిల్లి మండలం తోటపల్లి వద్ద నాగావళిపై 1908లో ఆంగ్లేయుల హయాంలో రెగ్యులేటర్ నిర్మించారు. శిథిలావస్థకు చేరుకున్న ఈ రెగ్యులేటర్‌పై ఆధారపడి 64 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. నాగావళి వరద జలాలను గరిష్టంగా వినియోగించుకుని, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో 2004లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పాత రెగ్యులేటర్‌కు ఎగువన 2.509 టీఎంసీల సామర్థ్యంతో బ్యారేజీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ బ్యారేజీ ద్వారా పాత ఆయకట్టు 64 వేల ఎకరాలను స్థిరీకరించడంతోపాటు కొత్తగా కుడికాలువ ద్వారా 1.20 లక్షల ఎకరాలు, కుడి కాలువలో 97.7 కిలోమీటర్ల నుంచి 25 కిలోమీటర్ల మేర గజపతినగరం బ్రాంచ్ కాలువ తవ్వడం ద్వారా 15 వేల ఎకరాలకు నీళ్లందించాలని నిర్ణయించారు. భూ సేకరణ సమస్య పరిష్కారం.. తోటపల్లి బ్యారేజీ పనులు 2009 నాటికే పూర్తయ్యాయి. అయితే కుడి కాలువలో మిగిలిన పనులు పూర్తి కాకపోవడంతో 40 వేల ఎకరాలకు నీళ్లందని దుస్థితి నెలకొంది. రెండు ప్యాకేజీల కాంట్రాక్టర్లు పనులు చేయకుండా పదేళ్లుగా మొండికేస్తుండటంతో కొత్త కాంట్రాక్టర్లకు అప్పగించారు. ప్రధాన కాలువతోపాటు డిస్ట్రిబ్యూటరీల్లో మిగిలిన పనులు పూర్తి చేయడానికి 72.335 ఎకరాల భూసేకరణ సమస్యను ఇటీవలే ప్రభుత్వం పరిష్కరించింది. దీంతో మిగిలిన పనులను రూ.124.23 కోట్లతో వేగంగా పూర్తి చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. వేగంగా గజపతినగరం బ్రాంచ్ కెనాల్ పనులు గజపతినగరం బ్రాంచ్ కెనాల్ పనులు కూడా వేగవంతమయ్యాయి. మిగిలిపోయిన 13,42,558 క్యూబిక్ మీటర్ల మట్టి పని, 30 వరకు బ్రిడ్జిలు, అండర్ టన్నెళ్లు లాంటి నిర్మాణాలు, 12,583 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులను వేగంగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు. కెనాల్ పూర్తయ్యేలోగా ఆయకట్టుకు నీళ్లందించే డిస్ట్రిబ్యూటరీలను పూర్తి చేసే దిశగా పనులను వేగవంతం చేశారు. -
విజయనగరం: ప్రేమజంట మృతదేహాలు లభ్యం
సాక్షి, విజయనగరం: గరుగుబిల్లి మండలం తోటపల్లి బ్యారేజ్‌లోకి దూకి రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట మృతదేహాలు లభ్యమయ్యాయి. తోటపల్లి రిజర్వాయర్ సమీపంలో మృతదేహాలను గుర్తించారు. కాగా సోమవారం నాగావళి నదిలో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. విషయం తెలిసిన పోలీసులు ఈతగాళ్ల సాయంతో ప్రేమజంట కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు 42 గంటల తరువాత మృతదేహాలు నదిలో తేలాయి. ఒకరినొకరు చున్నీతో కట్టుకొని ప్రేమజంట నదిలో దూకారు. యువకుడు రాకేష్ స్వగ్రామం బొబ్బిలి కాగా.. ప్రియురాలు కురుపాంకు చెందిన బాలికగా పోలీసులు తెలిపారు. చదవండి: బ్యారేజ్‌లోకి దూకి ప్రేమజంట ఆత్మహత్య చదవండి: బ్యారేజ్‌లోకి దూకి ప్రేమజంట ఆత్మహత్య -
తోటపల్లి మీరు కట్టారా బాబూ?
* వైఎస్ చేసిన పనులను నీవిగా చెప్పుకోవడానికి సిగ్గులేదా: అంబటి * కాపుల సంక్షేమానికి వందకోట్లే ఇచ్చి మోసగించారని ఆరోపణ సాక్షి, హైదరాబాద్: తోటపల్లి బ్యారేజీ తన మానస పుత్రికని, తానే ఈ ప్రాజెక్టును పూర్తిచేశానని చెప్పుకోవడానికి ఏపీ సీఎం చంద్రబాబుకు సిగ్గనిపించడం లేదా? అని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. వర్షాన్ని లెక్కచేయకుండా తానే పొలం గట్ల వెంటతిరిగి, అధికారుల్ని ప్రోత్సహించి ఈ బ్యారేజీని పూర్తి చేశానని గురువారం ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తున్న సందర్భంగా ప్రభుత్వం విడుదల చేసిన పత్రికా ప్రకటనలపై ఆయన మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. తోటపల్లి ప్రాజెక్టును పట్టుదలతో శ్రమించి పూర్తి చేసిన ఘనత దివంగత వైఎస్ఆర్దేనన్నారు. వైఎస్ చేసిన పనిని తాను చేసినట్లుగా బాబు ఎలా చెప్పుకోగలుగుతున్నారని ప్రశ్నించారు. ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన చరిత్రేతప్ప చంద్రబాబుకు వాటిని పూర్తిచేసిన ఘనత లేదని, తొమ్మిదేళ్లలో ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయలేదని విమర్శించారు. 2003లో తానే శంకుస్థాపన చేసి ఈనాడు తానే జాతికి అంకితం చేస్తున్నట్లు చంద్రబాబు బహుగొప్పగా మార్కెటింగ్ చేసుకుంటున్నారన్నారు. 2003లో సీఎంగా తోటపల్లికి శంకుస్థాపన చేసిన చంద్రబాబు ఆ తర్వాత అధికారంలోనుంచి దిగిపోయారని గు ర్తుచేశారు. వైఎస్ పుణ్యమే తోటపల్లి: 2004లో సీఎం అయిన వైఎస్ రాజశేఖరరెడ్డి నిరంతర పర్యవేక్షణ చేసి.. భారీగా నిధులు కేటాయించి శ్రమించిన ఫలితంగానే ఇవాళ తోటపల్లి బ్యారేజీ పూర్తయిందని అంబటి తెలిపారు. వైఎస్ చేసిన శ్రమను ప్రస్తావించే సంస్కారం చంద్రబాబుకు ఎలాగూ లేదని, అయితే తననుతాను పొగుడుకుంటూ ప్రచారం చేసుకోవడం చూస్తూంటే ఆయనకు సిగ్గుందా? అనేది అర్థం కావట్లేదన్నారు. మొన్న ప్రారంభించిన పులిచింతల కూడా తన కలేనని చంద్రబాబు చెప్పుకోవడం మరీ విడ్డూరమన్నారు. నదుల అనుసంధానం చేసేసినట్లు చంద్రబాబు గ్యాంగ్ కామెడీ షోలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పట్టిసీమను పూర్తిచేసి ఆగస్టు 15కల్లా నీరిస్తామన్న చంద్రబాబు ఇపుడున్న తాడిపూడినుంచే నీళ్లను తెచ్చి నదుల అనుసంధానం అంటున్నారని అంబటి ఆశ్చర్యం వెలిబుచ్చారు. జరిగింది నదుల అనుసంధానం కాదు.. నిధుల అనుసంధానమన్నారు. ఏడాదికి రూ.వెయ్యి కోట్లు కేటాయించి కాపుల సంక్షేమానికి ఖర్చు చేస్తానన్న చంద్రబాబు చివరకు వందకోట్లే కేటాయించి వారిని మోసం చేస్తున్నారని అంబటి దుయ్యబట్టారు.