తోటపల్లి మీరు కట్టారా బాబూ?
* వైఎస్ చేసిన పనులను నీవిగా చెప్పుకోవడానికి సిగ్గులేదా: అంబటి
* కాపుల సంక్షేమానికి వందకోట్లే ఇచ్చి మోసగించారని ఆరోపణ
సాక్షి, హైదరాబాద్: తోటపల్లి బ్యారేజీ తన మానస పుత్రికని, తానే ఈ ప్రాజెక్టును పూర్తిచేశానని చెప్పుకోవడానికి ఏపీ సీఎం చంద్రబాబుకు సిగ్గనిపించడం లేదా? అని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.
వర్షాన్ని లెక్కచేయకుండా తానే పొలం గట్ల వెంటతిరిగి, అధికారుల్ని ప్రోత్సహించి ఈ బ్యారేజీని పూర్తి చేశానని గురువారం ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తున్న సందర్భంగా ప్రభుత్వం విడుదల చేసిన పత్రికా ప్రకటనలపై ఆయన మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం విలేకరులతో మాట్లాడుతూ.. తోటపల్లి ప్రాజెక్టును పట్టుదలతో శ్రమించి పూర్తి చేసిన ఘనత దివంగత వైఎస్‌ఆర్‌దేనన్నారు. వైఎస్ చేసిన పనిని తాను చేసినట్లుగా బాబు ఎలా చెప్పుకోగలుగుతున్నారని ప్రశ్నించారు.
ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన చరిత్రేతప్ప చంద్రబాబుకు వాటిని పూర్తిచేసిన ఘనత లేదని, తొమ్మిదేళ్లలో ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయలేదని విమర్శించారు. 2003లో తానే శంకుస్థాపన చేసి ఈనాడు తానే జాతికి అంకితం చేస్తున్నట్లు చంద్రబాబు బహుగొప్పగా మార్కెటింగ్ చేసుకుంటున్నారన్నారు. 2003లో సీఎంగా తోటపల్లికి శంకుస్థాపన చేసిన చంద్రబాబు ఆ తర్వాత అధికారంలోనుంచి దిగిపోయారని గు ర్తుచేశారు.
వైఎస్ పుణ్యమే తోటపల్లి: 2004లో సీఎం అయిన వైఎస్ రాజశేఖరరెడ్డి నిరంతర పర్యవేక్షణ చేసి.. భారీగా నిధులు కేటాయించి శ్రమించిన ఫలితంగానే ఇవాళ తోటపల్లి బ్యారేజీ పూర్తయిందని అంబటి తెలిపారు. వైఎస్ చేసిన శ్రమను ప్రస్తావించే సంస్కారం చంద్రబాబుకు ఎలాగూ లేదని, అయితే తననుతాను పొగుడుకుంటూ ప్రచారం చేసుకోవడం చూస్తూంటే ఆయనకు సిగ్గుందా? అనేది అర్థం కావట్లేదన్నారు. మొన్న ప్రారంభించిన పులిచింతల కూడా తన కలేనని చంద్రబాబు చెప్పుకోవడం మరీ విడ్డూరమన్నారు. నదుల అనుసంధానం చేసేసినట్లు చంద్రబాబు గ్యాంగ్ కామెడీ షోలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
పట్టిసీమను పూర్తిచేసి ఆగస్టు 15కల్లా నీరిస్తామన్న చంద్రబాబు ఇపుడున్న తాడిపూడినుంచే నీళ్లను తెచ్చి నదుల అనుసంధానం అంటున్నారని అంబటి ఆశ్చర్యం వెలిబుచ్చారు. జరిగింది నదుల అనుసంధానం కాదు.. నిధుల అనుసంధానమన్నారు. ఏడాదికి రూ.వెయ్యి కోట్లు కేటాయించి కాపుల సంక్షేమానికి ఖర్చు చేస్తానన్న చంద్రబాబు చివరకు వందకోట్లే కేటాయించి వారిని మోసం చేస్తున్నారని అంబటి దుయ్యబట్టారు.