రూ.7,192 కోట్లకు పెరిగిన పోలవరం హెడ్‌ వర్క్స్‌ | Polavaram Headworks increased to Rs 7,192 crore | Sakshi
Sakshi News home page

రూ.7,192 కోట్లకు పెరిగిన పోలవరం హెడ్‌ వర్క్స్‌

Apr 20 2021 3:34 AM | Updated on Apr 20 2021 3:34 AM

Polavaram Headworks increased to Rs 7,192 crore - Sakshi

సాక్షి, అమరావతి: పోలవరం జాతీయ ప్రాజెక్టు హెడ్‌ వర్క్స్‌ (జలాశయం) డిజైన్లలో పలు మార్పులు చేసిన కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ).. ఆ మేరకు అదనంగా పనులు చేపట్టాలని రాష్ట్ర జలవనరులశాఖను ఆదేశించింది. అదనపు పనులకయ్యే వ్యయాన్ని కేంద్రం రీయింబర్స్‌ చేస్తుందని స్పష్టం చేసింది. దీంతో సీడబ్ల్యూసీ ఆదేశాల మేరకు పోలవరం హెడ్‌ వర్క్స్‌లో అదనపు పనులు చేపట్టడానికి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు హెడ్‌ వర్క్స్‌ అంచనా వ్యయాన్ని రూ.5,535.41 కోట్ల నుంచి రూ.7,192.02 కోట్లకు సవరిస్తూ రాష్ట్ర జలవనరులశాఖ కార్యదర్శి జె.శ్యామలరావు సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. పోలవరం ప్రాజెక్టు డిజైన్లలో రాష్ట్ర జలవనరులశాఖకు సహకరించేందుకు సీడబ్ల్యూసీ మాజీ చైర్మన్‌ ఏబీ పాండ్య నేతృత్వంలో డ్యామ్‌ డిజైన్‌ రివ్యూ ప్యానల్‌ (డీడీఆర్పీ)ను కేంద్ర జల్‌శక్తిశాఖ ఏర్పాటు చేసింది. డీడీఆర్పీ.. రాష్ట్ర జలవనరులశాఖ రూపొందించిన డిజైన్లను పరిశీలించి, క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి, మార్పులుచేర్పులు చేసి.. సీడబ్ల్యూసీకి సిఫార్సు చేసింది. ఆ డిజైన్లను పరిశీలించి సీడబ్ల్యూసీ ఆమోదించింది.

డిజైన్లలో సీడబ్ల్యూసీ చేసిన మార్పులు..
► పోలవరం ప్రాజెక్టు హెడ్‌ వర్క్స్‌లో ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) గ్యాప్‌–3లో 153.50 మీటర్ల మట్టికట్టను నిర్మించేలా కాంట్రాక్టు సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. కానీ.. ఈసీఆర్‌ఎఫ్‌ గ్యాప్‌–3లో మట్టికట్ట కాకుండా కాంక్రీట్‌ డ్యామ్‌ నిర్మించాలని సీడబ్ల్యూసీ ఆదేశించింది. ఆ మేరకు డిజైన్‌ను ఆమోదించింది. దాంతో గ్యాప్‌–3లో కాంక్రీట్‌ డ్యామ్‌ నిర్మాణాన్ని ప్రభుత్వం అదనంగా చేపట్టింది.
► ఈసీఆర్‌ఎఫ్‌ గ్యాప్‌–1లో 564 మీటర్ల పొడవున మట్టికట్ట (ఎర్త్‌ డ్యామ్‌)ను నిర్మించేలా కాంట్రాక్టు సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదర్చుకుంది. కానీ.. ఈ డిజైన్‌ను సీడబ్ల్యూసీ మార్చేసింది. గ్యాప్‌–1లో 564 మీటర్ల పొడువున ఈసీఆర్‌ఎఫ్‌కు పునాదిగా డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మించాలని, ఎర్త్‌ డ్యామ్‌ కాకుండా ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌ నిర్మించేలా డిజైన్‌ను ఆమోదించింది. గ్యాప్‌–1 ఈసీఆర్‌ఎఫ్‌ నిర్మించే ప్రదేశంలో ఇసుక పొరలను పటిష్టవంతం చేసేలా డెన్సిఫికేషన్‌ కొత్తగా చేపట్టాలని ఆదేశించింది. దీంతో కొత్తగా 564 మీటర్ల పొడవున డయాఫ్రమ్‌ వాల్, ఈసీఆర్‌ఎఫ్, భారీ ఎత్తున డెన్సిఫికేషన్‌ పనులను ప్రభుత్వం అదనంగా చేపట్టింది.
► గోదావరి వరదను స్పిల్‌ వైపు మళ్లించే అప్రోచ్‌ చానల్‌లో తొలుత 32 లక్షల క్యూబిక్‌ మీటర్ల మట్టిపని చేస్తే సరిపోతుందని.. ఆ మేరకే పనులను ప్రభుత్వం కాంట్రాక్టర్‌కు అప్పగించింది. కానీ.. అప్రోచ్‌ చానల్‌ను 600 మీటర్ల పొడవున 500 నుంచి 1,000 మీటర్ల వెడల్పుతో తవ్వాలని సీడబ్ల్యూసీ డిజైన్‌ను ఖరారు చేసింది. దీంతో మట్టి తవ్వకం పనుల పరిమాణం 1.16 కోట్ల క్యూబిక్‌ మీటర్లకు పెరిగింది. అదనంగా అప్రోచ్‌ చానల్‌కు ఎడమ గట్టున గైడ్‌ వాల్‌ నిర్మించేలా డిజైన్‌ను సీడబ్ల్యూసీ ఆమోదించింది. దీంతో.. అప్రోచ్‌ చానల్‌లో మట్టితవ్వకం పరిమాణం 85 లక్షల క్యూబిక్‌ మీటర్లు పెరిగింది. అదనంగా గైడ్‌ వాల్‌ను నిర్మించాల్సి వచ్చింది.
► స్పిల్‌ వేకు ఎగువన, దిగువన.. స్పిల్‌ చానల్‌కు రెండువైపులా ఉన్న కొండల చరియలు విరిగి కిందకు పడకుండా రక్షణ పనులు చేపట్టాలని సీడబ్ల్యూసీ కొత్తగా ప్రతిపాదించింది. దీంతో.. కొండ చరియలు విరిగిపడకుండా రక్షణ పనులను చేపట్టడానికి ప్రభుత్వం సిద్ధమైంది.
► స్పిల్‌ చానల్‌ ఎండ్‌ కటాఫ్‌ వాల్‌ను తొలుత జెడ్‌–షీట్‌ ఫైల్స్‌ విధానంలో నిర్మిస్తే సరిపోతుందని డిజైన్‌ రూపొందించారు. కానీ.. ఎండ్‌ కటాఫ్‌ వాల్‌ను డయాఫ్రమ్‌ వాల్‌ వేసి నిర్మించేలా సీడబ్ల్యూసీ డిజైన్‌ను ఆమోదించింది. దీంతో అదనంగా పనులు చేపట్టడానికి ప్రభుత్వం సిద్ధమైంది. 
► స్పిల్‌ చానల్‌ 902 హిల్‌ వద్ద రక్షణ చర్యలు చేపట్టాలని సీడబ్ల్యూసీ కొత్తగా ప్రతిపాదించడంతో.. ఆ మేరకు అదనపు పనులు చేపట్టడానికి ప్రభుత్వం సిద్ధమైంది. 

అదనపు పనుల వల్ల పెరిగిన వ్యయం
పోలవరం ప్రాజెక్టు డిజైన్లలో చేసిన మార్పుల వల్ల అదనంగా చేపట్టే పనులకయ్యే వ్యయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్‌ చేస్తుందని రాష్ట్ర ప్రభుత్వానికి సీడబ్ల్యూసీ స్పష్టం చేసింది. దీంతో.. సీడబ్ల్యూసీ ఆదేశాల మేరకు అదనంగా పనులు చేపట్టడానికి అంచనాలను సిద్ధం చేయాలని పోలవరం అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. సీడబ్ల్యూసీ డిజైన్లలో మార్పులు చేయడం వల్ల అదనంగా చేపట్టే పనులకు రూ.1,656.61 కోట్ల వ్యయం అవుతుందని లెక్క కట్టారు. దీంతో హెడ్‌ వర్క్స్‌ అంచనా వ్యయాన్ని రూ.5,535.41 కోట్ల నుంచి రూ.7,192.02 కోట్లకు సవరించాలని ఫిబ్రవరి 4న పోలవరం ప్రాజెక్టు చీఫ్‌ ఇంజనీర్‌ సుధాకర్‌బాబు పంపిన ప్రతిపాదనలపై ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement