
సాక్షి, అమరావతి: డిజైన్ల ఆమోదంలో డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ (డీడీఆర్పీ), కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చేస్తున్న జాప్యం వల్లే పోలవరం ప్రాజెక్టు ఎర్త్ కమ్ రాక్ ఫిల్(ఈసీఆర్‌ఎఫ్) డ్యామ్ పనులు ఆలస్యమవుతున్నాయని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. డిజైన్లను త్వరగా ఆమోదించేలా చర్యలు తీసుకోవాలని కోరింది. పోలవరం, సత్వర సాగు నీటి ప్రయోజన పథకం (ఏఐబీపీ), కాడ్వామ్ (కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ అండ్ వాటర్ మేనేజ్‌మెంట్) పనుల పురోగతిని కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ గురువారం వర్చువల్ విధానంలో సమీక్షించారు.
పోలవరం పనుల ప్రగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. పనులను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డిలను ఆదేశించారు. డిజైన్లను వేగంగా ఆమోదిస్తే ప్రాజెక్టును గడువులోగా పూర్తి చేస్తామని జవహర్‌రెడ్డి చెప్పగా.. తక్షణమే డీడీఆర్పీ సభ్యులు పనులను పరిశీలించి, డిజైన్లను ఖరారు చేసేలా చర్యలు తీసుకోవాలని సీడబ్ల్యూసీ చైర్మన్ ఆర్కే సిన్హాను పంకజ్‌కుమార్ ఆదేశించారు. ఈనెల 7న డీడీఆర్పీ ఛైర్మన్ ఏబీ పాండ్య పోలవరం పనులను పరిశీలించారని ఈఎన్‌సీ నారాయణరెడ్డి గుర్తు చేశారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితిపై ఆయనకు పూర్తి అవగాహన ఉందన్నారు.
వర్చువల్ విధానంలో డీడీఆర్పీ సమావేశం నిర్వహించి డిజైన్లను ఆమోదిస్తే ఈ సీజన్‌ను పూర్తి స్థాయిలో వినియోగించుకుని ప్రాజెక్టును పూర్తి చేస్తామని వివరించారు. ఇందుకు పంకజ్‌కుమార్ సానుకూలంగా స్పందించారు. తక్షణమే డీడీఆర్పీ సమావేశం నిర్వహించి.. డిజైన్ల ఆమోదానికి చర్యలు తీసుకోవాలని సీడబ్ల్యూసీ చైర్మన్‌ను ఆదేశించారు. ప్రాజెక్టుకు ఇటీవల విడుదల చేసిన రూ.320 కోట్లకు యూసీలు (వినియోగ ధ్రువీకరణ పత్రాలు) పంపామని, రీయింబర్స్ చేయాల్సిన మిగతా నిధులను మంజూరు చేయాలని జవహర్‌రెడ్డి చేసిన వి/æ్ఞప్తిపై పంకజ్‌కుమార్ సానుకూలంగా స్పందించారు.
పోలవరం ప్రాజెక్టుకు 2017–18 ధరల ప్రకారం సవరించిన అంచనా వ్యయం రూ.55,548.87 కోట్లకు ఇన్వెస్ట్‌మెంట్ క్లియరెన్స్ ఇచ్చి.. ఆ మేరకు నిధులు విడుదల చేయాలని రాష్ట్ర అధికారులు కోరారు. దీనిపై మరో సమావేశంలో చర్చిద్దామని పంకజ్‌కుమార్ చెప్పారు. ఏఐబీపీ, కాడ్వామ్ కింద చేపట్టిన గుండ్లకమ్మ, తోటపల్లి ప్రాజెక్టులను గడువులోగా పూర్తి చేసి.. పూర్తి ఆయకట్టుకు నీళ్లందించాలని ఆదేశించారు. భూసేకరణకు సంబంధించి న్యాయస్థానాల్లో కేసులు ఉన్నందువల్ల మిగిలిన పనులను పూర్తి చేయలేకపోతున్నట్లు రాష్ట్ర అధికారులు వివరించారు. వాటిని వీలైనంత తొందరగా పరిష్కరించుకుని.. గడువులోగా ఆ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment