వర్చువల్ సమావేశంలో మాట్లాడుతున్న సీఎస్ సమీర్ శర్మ
సాక్షి, అమరావతి: సంప్రదింపుల ద్వారా పెండింగ్ అంశాలను పరిష్కరించుకోవాలని ఆంధ్రప్రదేశ్, ఒడిశా నిర్ణయించాయి. ఈ మేరకు సోమవారం సచివాలయం నుంచి రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సమీర్‌శర్మ, సురేశ్ చంద్ర మహాపాత్ర వర్చువల్ విధానంలో సమావేశం నిర్వహించారు. అంతర్రాష్ట్ర సమస్యలను నిర్దిష్ట వ్యవధిలోగా పరిష్కరించుకునే అంశంపై ఇటీవల ఏపీ, ఒడిశా ముఖ్యమంత్రులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, నవీన్ పట్నాయక్ భువనేశ్వర్‌లో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెండు రాష్ట్రాల సీఎస్‌ల నేతృత్వంలో అధికారులతో కమిటీలను ఏర్పాటు చేశారు.
ఇందులో భాగంగా ఆ కమిటీలు రెండూ సోమవారం పెండింగ్ అంశాలపై సమీక్షించాయి. ఈ సందర్భంగా సీఎస్ డా.సమీర్ శర్మ మాట్లాడుతూ.. పెండింగ్ అంశాలను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకుందామన్నారు. ఒడిశా సీఎస్ సురేశ్ చంద్ర మహాపాత్ర మాట్లాడుతూ సీఎంల భేటీలో ప్రస్తావనకు వచ్చిన అంశాలను పరిష్కరించుకునేందుకు సమావేశాలు దోహదం చేస్తాయన్నారు. రెండు రాష్ట్రాల సరిహద్దు గ్రామాల్లో రోడ్డు అనుసంధాన పనులను త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉందని సీఎస్ సమీర్ శర్మ దృష్టికి తెచ్చారు. సమావేశం మినిట్స్‌ను రెండు రాష్ట్రాలు పంపితే తదుపరి భేటీల్లో పెండింగ్ అంశాలపై చర్చించుకోవచ్చన్నారు.
ఇంధనం, జల వనరులు, రవాణాపై చర్చ
ఈ సమావేశంలో ప్రధానంగా రెండు రాష్ట్రాల మధ్య ఇంధన, జలవనరులు, ఉన్నత విద్య, పాఠశాల విద్య, రెవెన్యూ, రవాణా శాఖలకు సంబంధించి వివిధ పెండింగ్ అంశాలపై చర్చించారు. ముఖ్యంగా ఇంధన శాఖకు సంబంధించి జోలాపుట్, లోయర్ మాచ్‌ఖండ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు, బలిమెల డ్యామ్, చిత్రకొండ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులపై చర్చలు జరిపారు. జలవనరుల శాఖకు సంబంధించి వంశధార నదిపై నేరడి బ్యారేజ్, ఝంజావతి రిజర్వాయర్, బహుదా నది నీరు విడుదలకు సంబంధించి పంపు స్టోరేజ్ ప్రాజెక్టులకు ఇరు రాష్ట్రాల తరఫున ఎన్‌వోసీల మంజూరు అంశాలపై సమీక్షించారు.
బహుదా నీటిని విడుదల చేయండి
నేరడి బ్యారేజీ నిర్మాణానికి ఒడిశా ప్రభుత్వం 106 ఎకరాల భూమిని అప్పగించాల్సి ఉందని రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్‌రెడ్డి తెలిపారు. ఆ భూమిని అప్పగిస్తే బ్యారేజ్ సకాలంలో పూర్తయి ఇరు రాష్ట్రాలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. అలాగే ఝంజావతి రిజర్వాయర్ ప్రాజెక్టు నిర్మాణంతో విజయనగరం జిల్లాలోని 5 మండలాల్లో 75 గ్రామాలకు తాగునీరు అందడమే కాకుండా 24,640 ఎకరాలకు సాగు నీరు అందుతుందని చెప్పారు. పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఒడిశా ప్రభుత్వం ఆ ప్రాంతంలో గ్రామ సభలు నిర్వహించలేదన్నారు. ఒప్పందం ప్రకారం బహుదా నది ద్వారా ఒడిశా ప్రభుత్వం 1.5 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment