వైఎస్సార్‌సీపీ గెలుపును ఖరారు చేసిన ఎల్లో మీడియా!.. ఈ రాతలు అందుకేనా? | Ksr Comments On Eenadu Ramojirao's False Statements And Jawahar Reddy's Behavior | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ గెలుపును ఖరారు చేసిన ఎల్లో మీడియా!.. ఈ రాతలు అందుకేనా?

Published Tue, May 21 2024 11:12 AM | Last Updated on Tue, May 21 2024 4:46 PM

Ksr Comments On Eenadu Ramojirao's False Statements And Jawahar Reddy's Behavior

ఏపీలో శాసనసభ ఎన్నికలు ముగిశాయి కనుక ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియాలో మార్పు వస్తుందేమోలే అని ఆశించినవారికి యధాప్రకారం ఆశాభంగమే ఎదురైంది. ఎన్నికల ముందు ఎలాగైతే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిను, ఆయన ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి విశ్వయత్నం చేశారో, వైఎస్సార్‌సీపీపై విషం కక్కారో అదే ధోరణి ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అవే అబద్దాలు, అవే మోసపూరిత కథనాలు, కక్ష, విద్వేషంతో కూడిన వార్తలు రాస్తూ ప్రజలను ఇంకా తప్పుదారి పట్టించాలని చూస్తున్నారు.

ఎన్నికల పోలింగ్ జరిగిన రోజున, పోలింగ్ అయిన తర్వాత జరిగిన హింసపై వారు తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకున్న తీరు నీచంగా ఉంది. టీడీపీ వారిని రక్షించడానికి, వారి ప్రమేయంతో నియమితులైన పోలీసు అధికారులకు ఎలాంటి సమస్య రాకుండా చేయాలన్న లక్ష్యంతో వారు రాస్తున్న వార్తలు జర్నలిజం ప్రమాణాలను దిగజార్చుతూనే ఉన్నాయి. ఈ ఘటనలలో ఇరు వర్గాల తప్పులు ఉంటే వాటిని రిపోర్టు చేయవచ్చు. అలాకాకుండా ఏకపక్షంగా రాస్తున్న తీరును బట్టే ఈ అల్లర్లు పెత్తందార్లే చేశారని అర్థం అవుతుంది. బలహీనవర్గాలపై జరిగిన దాడుల పట్ల కూడా మానవత్వం లేకుండా రామోజీ వార్తలు రాయించారంటే పేదలపై ఎంతటి పగ పట్టారో తెలుస్తుంది.

ఎన్నికల సంఘం ఈ దాడులపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించాలని ఆదేశిస్తే, ఆ ప్రకారం ప్రభుత్వం కొంతమంది అధికారులను ఎంపిక చేసింది. అంతే!ఈనాడు రామోజీకి నచ్చలేదట. వారందరికి రాజకీయాలు అంటగడుతూ రాసేశారు. అంటే ముందస్తుగానే సిట్ అధికారులను ప్రభావితం చేయడానికి, భయపెట్టడానికి వీరు ప్రయత్నం చేశారన్నమాట. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిపై వారు ఇచ్చిన స్టోరీలు చూస్తే వీరు ఉగ్రవాదుల కన్నా ఘోరంగా మారారన్న సంగతి ఇట్టే అర్థం అయిపోతుంది. ఈనాడు రామోజీరావు రాస్తే ఎవరినైనా ఉద్యోగం నుంచి తీసివేయాల్సిందే. ఆయన ఎవరిని కోరితే వారిని ఆయా పోస్టులలో నియమించాల్సిందే. లేకుంటే వారిపై బండలు వేస్తాం. వారిని నైతికంగా దెబ్బతీస్తాం. ఈ క్రమంలో వారు చెప్పినట్లు వింటే సరి.. ఎక్కడైనా ఒకటి, రెండు విషయాలలో మరీ బాగుండదని వినకపోతే.. ఇంకేముంది.. ఎన్నికల సంఘాన్ని వదలిపెట్టం అన్న రీతిలో దారుణమైన కథనాలు వండి పాఠకులను మోసం చేస్తున్నారు.

ఇలా ఒకటి కాదు.. ఎక్కడ వీలైతే అక్కడ మళ్లీ బురద వేయడం చేస్తున్నారు. ఎన్నికలు అయ్యాయో, లేదో ఇంకా డీబీటీ కింద లబ్దిదారులకు డబ్బులు ఎందుకు వేయలేదని రాశారు. పేదలకు కాకుండా కాంట్రాక్టర్‌లకు డబ్బులు ఇస్తున్నారని ప్రచారం చేశారు. కానీ ప్రభుత్వం తన డ్యూటీ ప్రకారం ఆయా స్కీముల కింద నిధులు విడుదల చేసింది. ఇంకా వారికి ఇవ్వలేదు.. వీరికి ఇవ్వలేదు.. అంటూ పిచ్చి కథనాలు ఇస్తున్నారు. కాంట్రాక్టర్‌లకు డబ్బులు ఇవ్వకపోతే చేసిన పనులకు బిల్లులు రాక వారు ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని రాసేది వీరే. బిల్లులు చెల్లిస్తుంటే స్కీముల డబ్బును కాంట్రాక్టర్‌లకు ఇస్తున్నారని రాసేది వీళ్లే.

రాజకీయ నేతలు డబుల్ టాక్ చేయడంలో దిట్టలని అనుకుంటాం. అందులో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి నేతలు డాక్టరేట్ సంపాదించారని అంతా భావిస్తారు. కానీ వారిని మించి రామోజీరావు, రాధాకృష్ణ వంటి ఎల్లో మీడియా వారు ఏది పడితే అది రాసి పరువు పోగొట్టుకుంటున్నారు. వీరి పరిస్థితి ఎలా ఉందంటే ఒకసారి పరువు పోయాక, కొత్తగా పోయేదేముందిలే అని సిగ్గు విడిచి వ్యవహరిస్తున్నారని చెప్పాలి. ఎన్నికల సంఘం పల్నాడు, తాడిపత్రి, తిరుపతి వంటి చోట్ల జరిగిన హింసపై సిట్ దర్యాప్తు చేయాలని ఆదేశించగానే, టీడీపీకి కొమ్ముకాసి తప్పులు చేసిన అధికారులను రక్షించడానికి ఈ మీడియా పూనుకుంది. వైఎస్సార్‌సీపీవారే హింసకు పాల్పడ్డారని పిక్చర్ ఇవ్వడానికి ప్రయత్నించింది.

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు కానీ, స్వయంగా ఒక మంత్రిగాని ఫోన్ చేస్తే బదులు ఇవ్వని ఎస్పీలను గొప్పవారిగా ప్రొజెక్టు చేయడానికి యత్నించారు. బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి టీడీపీ వారు రాసిన పిర్యాదుపై సంతకం చేసి ఎన్నికల కమిషన్‌కు పంపించారు. అందులో ఏ ఏ అధికారిని తొలగించాలో రాయడమే కాకుండా, ఫలానా వారిని నియమించాలని కూడా కోరడం చిత్రమైన సంగతి. ఎన్నికల సంఘం కూడా ప్రామ్ట్ గా వారు కోరిన విధంగా అధికారులను మార్పు చేసింది. ఆ సమయంలో డీజీపీ, సీఎస్‌ను, ఇంటెలెజజెన్స్ ఉన్నతాధికారిని బదిలీ చేయాలని ఈనాడు పెద్ద ఉద్యమంలా చెడరాసింది. ఈసీ ఒక్క సీఎస్‌ను తప్ప వారు కోరిన వారందరిని బదిలీ చేసింది.

కొత్త అధికారులు వైఎస్సార్‌సీపీ ఓటర్లను బెదిరించి ఓటింగ్‌కు రాకుండా చేస్తారని వీరు ఆశించినట్లు ఉన్నారు. అది పూర్తి స్థాయిలో జరగలేదు. అయినా పేదలంతా వెల్లువలా ఓటింగ్‌కు తరలిరావడంతో వీరు ఆశించిన రీతిలో టీడీపీకి ప్రయోజనం కల్పించి ఉండకపోవచ్చు. దాంతో మరుసటి రోజు టీడీపీ వారు హింసాకాండకు దిగారు. నరసరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆస్పత్రిపైన దాడి చేశారు. తాడిపత్రిలో టీడీపీ రౌడీ మూకలు అల్లర్లకు దిగితే పోలీసులు చోద్యం చూస్తున్నట్లు చూస్తూ కూర్చున్నారు. పైగా కొందరు పోలీసులు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిలోకి వెళ్లి అరాచకం చేశారు. అది కనిపించకుండా సీసీ కెమెరాలను కూడా పోలీసులే పగులకొట్టారు. మరో సీసీ కెమెరాలో చిక్కడంతో వారు దొరికిపోయారు. ఈ సన్నివేశం మొత్తం పోలీసు వ్యవస్థకే మచ్చ తెచ్చింది. దాంతో అనంతపురం, పల్నాడు కొత్త ఎస్పీలను ఈసీ సస్పెండ్ చేసింది.

ఇది కేవలం తెలుగుదేశం వారి నిర్వాకమే. రామోజీ వంటివారి నీచమైన రాతల ఫలితమే అని చెప్పాలి. మరి కొందరిపై బదిలీ వేటు పడింది. ఇప్పుడు వారిని రక్షించడానికి కంకణం కట్టుకున్న ఈనాడు రామోజీరావు సీఎస్‌పై అడ్డగోలు కథనం రాశారు. మొత్తం ఈ హింసాకాండకు సీఎస్‌ బాధ్యుడని రామోజీ తేల్చేశారు. ఆయన ఎలా బాధ్యుడు అవుతారో అర్థం కాదు. కొత్తగా నియమితుడైన డీజీపీ బాధ్యుడు కాదట. టీడీపీ, ఈనాడు ఏరికోరి వేయించుకున్న ఎస్పీలు బాధ్యులు కాదట. అర్థం, పర్థం లేకుండా ఎన్నికల సంఘం ఎన్నికలకు రెండు, మూడు రోజుల ముందు చేసిన తెలివితక్కువ నిర్ణయాలు కారణం కాదట. ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక సీఎస్‌ వివాదాలకు కేంద్ర బిందువు అయ్యారని రామోజీ తేల్చేశారు.

జవహర్ రెడ్డి ఏమి వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు? ఈసీ ఏమి చెబితే అది చేశారు తప్ప సొంతంగా ఆయన చేసింది ఏముంది? అయినా రామోజీ మరి అది పార్టీ పక్షపాతమో, కుల పక్షపాతమోకానీ, నిర్లజ్జగా ప్రభుత్వ ఉన్నతాధికారి నైతికస్థైర్యం దెబ్బతినేలా చెత్త వార్తలు రాసి పారేశారు. చేతిలో టీవీ, పేపర్ ఉంది కదా అని, ఎలాగూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఆయా వ్యవస్థలలో తమకు పలుకుబడి ఉంది కదా అని ఇంత ఘోరంగా వార్తలు ఇస్తారా? నిజానికి ఇలాంటి వార్తలు రాసిన ఈనాడు రామోజీరావుపై కేసు పెట్టాలి! ఈసీ ఛీఫ్ సెక్రటరీపై ఆధారపడుతూ నిర్ణయాలు చేసిందట. అంటే చంద్రబాబుకో, రామోజీకో ఫోన్ చేసి వారు ఏమి ఆదేశిస్తే అది చేయాలన్నది వీరి కోరిక కావచ్చు. అక్కడికి వీరు అడిగినవన్నీ ఈసీ చేసినా కనీసం కృతజ్ఞత లేకుండా ఈసీని ఆక్షేపిస్తూ వార్తలు ఇచ్చారంటేనే వీరు ఎంత అవకాశవాదులో అర్థం చేసుకోవచ్చు.

వృద్దులకు ఇళ్ల వద్ద వలంటీర్ల ద్వారా పెన్షన్ ఇవ్వద్దని ఈసీ ద్వారా చెప్పించిందే తెలుగుదేశం, ఈనాడు రామోజీ వంటి వారు అయితే దానికి జవహర్ రెడ్డి బాధ్యుడట. ఈసీ సూచనలను పరిగణనలోకి తీసుకునే సీఎస్ గ్రామ సచివాలయాలకు వెళ్లి పెన్షన్ తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చినా ఆయనపైనే ఏడుపుగొట్టు వార్తలు. బ్యాంకుల ద్వారా పెన్షన్ ఇవ్వాలని కోరింది నిమ్మగడ్డ రమేషే కదా! అయినా ఆయన తప్పు లేదట. జనం అందరికి ఇది అర్థం అయినా రామోజీకి ఇంకా తెలియలేదు. వృద్దులంతా చంద్రబాబును, నిమ్మగడ్డను, రామోజీ వంటివారిని బండబూతులు తిట్టిన సంగతి జనానికి తెలియదా! సీఎస్‌నుంచి ఈసీ నివేదిక తెప్పించుకుని అధికారులను నియమించిందట.

రామోజీ కొత్త రాజ్యాంగం రాయాలి. ప్రతిపక్ష నేతనో, లేక రామోజీనో నివేదికలు అడగాలి కాబోలు. పెద్ద ఎత్తున హింసాకాండ చెలరేగితే ఛీఫ్ సెక్రటరీని బాధ్యుడిని చేయకపోవడం ఏమిటి? అని ఈనాడు రాసిందంటే వారు జర్నలిజం చేస్తున్నారా? లేక ఇంకేమైనా చేస్తున్నారా? అనే అనుమానం వస్తుంది. ఈసీకి జాబితాలు పంపించి, వారు ఎవరిని నియమించమని చెబితే వారిని అప్పాయింట్ చేస్తే అది కూడా జవహర్ రెడ్డి తప్పేనట. ఈయన ఉంటే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగవని విపక్షాలు అన్నాయట. అది వేద వ్యాఖ్యమట.

ఆయా స్కీములకు కొన్ని నెలలు డబ్బు వేయకుండా, ఎన్నికల ముందు లబ్దిదారులకు ఇచ్చేయత్నం చేశారని అన్నారు. మరి చంద్రబాబు ఎన్నికల ముందు పసుపు-కుంకుమ అని, అన్నదాత సుఖీభవ అని డబ్బులు వేస్తే గొప్ప విషయమని ఇదే ఎల్లో మీడియా ఆ రోజుల్లో ప్రచారం చేసింది. ఇప్పుడు ఎన్నికల సమయంలో లబ్దిదారులకు డబ్బులు పడకుండా ఆపింది టీడీపీ, ఎల్లో మీడియానే కదా! ఇంక వైఎస్సార్‌సీపీకి వచ్చిన లాభం ఏముంది. చివరిగా వీరి అసలు బాధ బయటపెట్టేశారు. ఏపీ ప్రభుత్వం వివిధ ఆరోపణలపై సస్పెండ్ చేసిన ఏబీ వెంకటేశ్వరరావుకు వెంటనే పోస్టింగ్ ఇవ్వలేదట. అదట వీరి కడుపు నొప్పికి కారణం. ఈయనేమో టీడీపీ ఆఫీస్‌లో కూర్చుని పోలీసు అదికారులను ప్రభావితం చేయడానికి కృషి చేశారని వైఎస్సార్‌సీపీ ఆరోపించింది. అయినా పోస్టింగ్ ఎందుకు ఇవ్వలేదని ఈనాడు గొడవ చేస్తోంది. దీనిని బట్టే వారి మధ్య ఎలాంటి సంబంధ, బాంధవ్యాలు ఉన్నాయో గమనించవచ్చు.

ఆంధ్రజ్యోతి అయితే హీనంగా మరో అబద్దపు కథనాన్ని ప్రచారం చేసింది. నీతి అయోగ్ లాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి తమకు తెలియదని అన్నదట. ఎన్నికల సమయంలో అబద్ధాలు ప్రచారం చేశారంటే ఓట్ల కోసం అని అనుకోవచ్చు. ఇప్పుడు కూడా అదే రకంగా అబద్ధాలు చెబుతున్నారంటే వారికి బుద్ది, జ్ఞానం లేదని అనుకోవాలి. నీతి అయోగ్ ముసాయిదా పంపించామని తెలిపినా వీరు ఒప్పుకోరన్నమాట. ఎన్నికలు అయిపోయాక కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి తెగబడి ఇలాంటి అసత్య కథనాలు ఇవ్వడం ద్వారా సాధించేది ఏమిటో తెలియదు! అంటే ఎన్నికలలో గెలవడం కష్టమనే అభిప్రాయానికి ఎల్లో మీడియా వచ్చేసిందా? అందుకే అప్పుడే మళ్లీ దాడి ఆరంభించిందా!


– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement