పదేళ్లపాటు ఎంపీగా పనిచేసిన వ్యక్తి పెద్దవాడవుతాడా? లేక ఒక క్రికెటర్‌గా ఉండి రిటైరైన వ్యక్తి పెద్ద వ్యక్తి అవుతారా? ఎవరైనా ఏమంటాం. ఒక రాజకీయ వేత్తగా రెండుసార్లు ఎంపీగా గెలిచారంటేనే అతనికి ప్రజాభిమానం ఉందనే కదా! దేశంలో చట్టాలు చేసే అత్యున్నత చట్టసభలో ఉండడం కన్నా గొప్ప విషయం ఏమి ఉంటుంది. రాజకీయాలలో అదే కదా ఎవరైనా కోరుకునేది. క్రికెటర్‌గా రాణించడం మంచి విషయమే. కాదనం. ఆయన రాజకీయాలలోకి వచ్చి ప్రజాదరణ పొందితే అది వేరే సంగతి.
పదేళ్లు ఎంపీగా ఉన్న నేత చిన్నవాడట
ఒక పార్టీలో చేరి వారం రోజులకే మనసు మార్చుకున్న వ్యక్తి చాలా పెద్దవాడట. పదేళ్లుగా ఎంపీగా ఉన్న నేత చాలా చిన్నవాడట. ఇది ఈనాడు మీడియా అధిపతి రామోజీరావు చిత్రీకరణ. తెలుగుదేశం పార్టీకి ఏది అనుకూలం అయితే అదే కరెక్ట్ అనేంత పతనావస్తకు ఈనాడు మీడియా చేరింది. క్రికెటర్ అంబటి రాయుడు కొద్ది రోజుల క్రితం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన అంతకుముందు ఏపీలోని ఆయా ప్రాంతాల్లో ఉన్న స్కూళ్లు, ఇతర సంస్థలలో జరుగుతున్న అభివృద్దిని చూసి మెచ్చుకున్నారు. వాటికి ఆకర్షితులై ఆయన పార్టీలో చేరానన్నారు. తదుపరి ఆయన రాజకీయాలకు దూరం అవుతున్నానని ప్రకటించారు. అంతే!
మోసపూరిత కథనాలతో తప్పుడు కథనాలు
ఈనాడు మీడియాకు కోతికి కొబ్బరికాయ దొరికిన చందం అయిపోయింది. మొదటి పేజీలో తాటికాయంత అక్షరాలతో అచ్చేసి ఆనందపడింది. పైగా దీనికి వంచన అంటూ మరో ముక్తాయింపు ఇచ్చింది. ముఖ్యమంత్రి జగన్ ఈయనను వంచించేశారట. ఇలాంటి మోసపూరిత కథనాలు రాసి ప్రజలను తప్పుదారి పట్టించాలని ఈనాడు ఎంత నీచంగా ప్రయత్నిస్తోందో అర్ధం అవుతుంది.
ఏబీఎన్‌తో పోటీ పడి నిసిగ్గుగా మద్దతు
పదేళ్లపాటు ఎంపీగా ఉన్న కేశినేని అటు ఎంపీ పదవికి, ఇటు తెలుగుదేశం సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని చెబితే మాత్రం దానిని చాలా చిన్న విషయంగా పది లైన్ల వార్తగా ఇచ్చి సరిపెట్టుకుంది. అంటే దీనిని బట్టి ఏమి అర్దం అవుతుంది. ఈనాడు మీడియా ఆంద్రజ్యోతితో పోటీ పడి తెలుగుదేశం పార్టీకి నిస్సిగ్గుగా మద్దతు ఇస్తోందనే కదా!అదేమీ కొత్త విషయం కాకపోయినా, ఒకటికి రెండుసార్లు ఈ విషయం చెప్పి వక్కాణించవలసి వస్తోంది. కేశినేని నాని 2014లో మొదటిసారి విజయవాడ నుంచి ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత వైఎస్సార్‌సీపీ వేవ్‌ను కూడా తట్టుకుని నిలబడి స్వల్ప ఆధిక్యంతో అయినా గెలవగలిగారు.
కేశినేని కుటుంబంలో లోకేష్ చిచ్చు
అలాంటి వ్యక్తి తన కుటుంబంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చిచ్చుపెట్టారని అంటున్నారు. తన సోదరుడు చిన్నిని లోకేష్ ఎంకరేజ్ చేసి డబ్బు ఖర్చు పెట్టించి, తనకు పోటీగా తయారు చేశారని, అందుకే తనకు టికెట్ లేదని చంద్రబాబు ప్రకటించారని అంటున్నారు. ఇవేవి ఎల్లో మీడియాకు విశేషాలు కావు. టీడీపీలో చంద్రబాబు పెత్తనం కన్నా లోకేష్‌దే ఎక్కువ ఆధిపత్యం అని ఈ ఘటన తెలియచేస్తోందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. 2014-19 కాలంలో తన కొడుకు లోకేష్‌ను ఎమ్మెల్సీని చేసి, మంత్రిగా నియమించారు. ఆ తర్వాత ప్రభుత్వంలో అంతా తానై లోకేష్ చక్రం తిప్పారు.
జోక్యం చేసుకోవద్దని స్థానిక ఎంపీకే చెబుతారా?
చంద్రబాబు చాలా సందర్భాలలో నిస్సహాయంగా చూస్తు ఉండిపోయారని కొందరు అంటారు. అంతేకాక, తనవద్ద ఎవరైనా పనులకు వస్తే లోకేష్‌ను కలిశావా అని అడిగేవారని కూడా కొందరు చెబుతారు. అంటే దాని అర్ధం తెలుసుకదా! ఈ నేపథ్యంలో లోకేష్ తన సొంత టీమ్‌ను తయారు చేసుకుంటున్నారన్నమాట. ముఖ్యమంత్రి జగన్ వాళ్లను కలవలేదు. వీళ్లను కలవలేదు అని ఎల్లో మీడియా వారు తప్పుడు ప్రచారం చేస్తుంటారు? కనీసం కేశినేని నానిని పిలిచి టికెట్ విషయం ఎందుకు చర్చించలేదని మాత్రం కథనం ఇవ్వరు. అదేదో పరాయి వ్యక్తికి చెప్పినట్లు నలుగురు మనుషులను పంపించి టికెట్ ఇవ్వడం లేదని నానికి చెప్పిస్తారా? తిరువూరు సభ ఏర్పాట్లలో జోక్యం చేసుకోవద్దని స్థానిక ఎంపీకే చెబుతారా? పైగా తెల్లవారి లేస్తే ప్రజాస్వామ్యం అని ఒకటే సోది చెబుతారు!
ఎంపీ రాజీనీమా పెద్ద వార్త కాదా?
చంద్రబాబు ఎవరికైనా టిక్కెట్లు ఇవ్వకపోతే అదేదో పార్టీ ప్రయోజనాల కోసం. వేరే పార్టీవారు అదే పని చేస్తే అన్యాయం, వంచన చేసినట్లట! దీనిని ఈనాడు, ఆంద్రజ్యోతి మీడియా భుజాన వేసుకుని తప్పుడు ప్రచారం చేస్తుంటాయి. కేశినేని నాని టీడీపీకి రాజీనామా చేస్తే అది పెద్ద వార్తకాదని ఈ దిక్కుమాలిన మీడియా అబిప్రాయం. అసలు రాజకీయాలలోకి దాదాపు రాని, కేవలం వారం రోజుల వ్యవధిలో తప్పుకుంటే మాత్రం అది వంచన అని, ఇంకేవో రాసిపారేశారు.
ఈనాడు చెత్తరాతలు
అంబటి రాయుడుకు గుంటూరు టికెట్ ఇస్తానని జగన్ చెప్పారని, ఇప్పుడు నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలును గుంటూరు నుంచి పోటీచేమంటున్నారని ఇది మోసం అని ఈనాడు చెత్తరాతలు రాసింది. పార్టీ అవసరాల కోసం ఒకవేళ టికెట్ మార్చుకుంటే అది వంచన అవుతుందా? అదే పార్టీ ఎంపీగా పోటీచేసి రెండుసార్లు గెలిచిన కేశినేని నాని ఇంటిలో స్వయంగా చంద్రబాబో లేక లోకేషో చిచ్చు పెడితే అది మోసం కాదా?
నాని ఇప్పుడు తన కార్యాయలం నుంచి టీడీపీ జెండాలు కూడా పీకేశారట. అయినా ఎల్లో మీడియా దానిని వార్తగా ఇవ్వదు. నోరు మూసేసుకుంది. అంబటి రాయుడు స్టోరీని అడ్డుపెట్టుకుని ఇంతకు ముందు రాసిన విషయాలనే మళ్లీ, మళ్లీ రాసి పాఠకులను విసిగించింది. ఈ మద్యకాలంలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ పార్టీ కార్యకలాపాలకు అంటిముట్టనట్లు ఉంటున్నారని చెబుతున్నారు. అయినా అవేవి ఈనాడు రామోజీరావు కళ్లకు వార్తలు కావు. ఎంతైనా వృద్దాప్యంలో ఉన్నారు కదా! రామోజీరావు కళ్లకు కాస్త మసక వచ్చి ఉండవచ్చు.
వివరణ ఇవ్వని అనైతిక పరిస్థితి
తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం అంబటి రాయుడు ఊపీఎల్ పోటీలలో ఆడడానికి ఎంపికయ్యారు. వారు ఏ రాజకీయపార్టీలలో ఉండకూడదట. ఈ విషయాన్ని ఆయనే వెల్లడించారు. దీంతో ఈనాడు మీడియాకు నోరు పడిపోయినంత పనైంది. తాను రాసింది తప్పుడు వార్త అని తెలిసినా కనీసం వివరణ కూడా ఇవ్వని అనైతిక పరిస్థితికి ఈనాడు మీడియా వెళ్లింది. నెల్లూరు నుంచి వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రబాకరరెడ్డి పోటీచేయడం లేదని, ఆయన టీడీపీ వైపు చూస్తున్నారంటూ ఒకటే ప్రచారం చేసింది. అన్నిసార్లు రాస్తే నమ్మకపోతారా అన్నది వారి గోబెల్స్ ఆలోచన అన్నమాట. తీరా వేమిరెడ్డి తానే నెల్లూరునుంచి వైఎస్సార్‌సీపీ నుంచి పోటీచేస్తున్నానని స్పష్టంగా చెప్పారు.
ఎన్నిసార్లు వీరు వదంతులు సృష్టిస్తారు?
పైగా ఆయన ఒక మాట అన్నారు. ఎన్నిసార్లు వీరు వదంతులు సృష్టిస్తారు! తనకు విసుగువచ్చి పదే, పదే జవాబు ఇవ్వడం మానివేశానని అన్నారు. ఈనాడు తదితర ఎల్లో మీడియా అంత అసహ్యంగా మారాయనే కదా ఆయన వ్యాఖ్యల సారాంశం. వైఎస్సార్‌సీపీ తమ అభ్యర్దులను మార్చినా వ్యతిరేక ప్రచారమే. మార్చకపోయినా దుష్ప్రచారమే. చంద్రబాబు కాంగ్రెస్ వారితో కలిసి మంతనాలు జరిపితే అది వ్యూహం. అదే వేరే వారు చేస్తే కుట్ర. కేశినేని నాని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలతో కలిసి అభివృద్ది కార్యక్రమాలలో పాల్గొన్నారట. దానిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారట.
టీడీపీ జెండాలు పీకేస్తే ఎందుకు రాయలేదు
ఎవరైన వైఎస్సార్‌సీపీ నేతను పార్టీ అధిష్టానం ఏదైనా అంశంపై ప్రశ్నిస్తే ఇంకేముంది.. ఇదేనే ప్రజాస్వామ్యం అని ఈనాడు, ఆంద్రజ్యోతి వంటి మీడియా ప్రశ్నిస్తూ నీచంగా కథనాలు ఇస్తాయి. కేశినేని నాని తన ఆఫీస్ వద్ద టీడీపీ జెండాలు పీకేశారట. మరి దానికి టీడీపీ జెండా పీకేశారని ఈనాడు మీడియా ఎందుకు రాయలేదు? అంటే టీడీపీపై వల్లమానిన ప్రేమ. తన స్వార్ధ వ్యాపార రాజకీయం కోసం రామోజీరావు ఎంతకైనా దిగజారుతున్నారు. ఆంద్రజ్యోతి రాధాకృష్ణ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇంటర్వ్యూ చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై విషం చిమ్మించడానికి యత్నించారు.
రాధాకృష్ణ బ్లాక్ మెయిల్
జగన్ ఫోన్ చేసి పలకరించలేదని చెప్పించారు. ఓకే. ఇదే రాధాకృష్ణ అంతకుముందు ఒకసారి రేవంత్‌కు జగన్ ఫోన్ చేయడానికి ప్రయత్నించారని, కాని రేవంత్ సిద్దపడలేదని రాసిందే. మరి దాని గురించి ఏమంటారు. ఇందులో ఏది నిజం? ఏది అబద్దం అంటే వారికే తెలియాలి. రాజకీయవర్గాలలో ఒక ప్రచారం జరుగుతోంది. అదేమిటంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాధాకృష్ణ బ్లాక్ మెయిల్ చేసి తన వద్దకు ఇంటర్వ్యూ నిమిత్తం రప్పించుకున్నారని అంటున్నారు.
తొలుత రేవంత్ ఒక టీవీ చానల్‌కు వెళితే మిగిలిన చానళ్లు కూడా అడుగుతాయని అనుకుని వద్దని చెప్పారట. కాని రాధాకృష్ణ బ్లాక్ మెయిల్‌కు తట్టుకోలేక ఇంటర్వ్యూ ఇచ్చారట. సహజంగానే రాదాకృష్ణ మానసికి పరిస్థితిని బట్టి అది నిజమేనేమో అనిపిస్తుంది. అదే ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను ఎవరూ బ్లాక్ మెయిల్ చేయలేరు కదా! అందుకే ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణల ఏడుపు అని అనుకోవాలి.
-కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment