కె గంగవరం మండలం సుందరపల్లి వద్ద చెక్కుచెదరకుండా ఉన్న వైఎస్ హయాంలో పటిష్టం చేసిన ఏటి గట్టు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: పది రోజులపాటు మహోగ్రంగా పోటెత్తిన గోదావరి లంక గ్రామాలకు కంటిపై కునుకు లేకుండా చేసింది. ఎగువన భద్రాచలం వద్ద 71 అడుగులు, దిగువన ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 21 అడుగులతో క్షణక్షణం వణికించింది. మూడు రోజుల పాటు మూడో నంబర్ ప్రమాద హెచ్చరికతో ప్రమాద ఘంటికలు మోగించింది. అయితే ఈ స్థాయిలో వరద వచ్చినా గోదావరి తీరాన ఉన్న నాలుగు జిల్లాల్లో ఎక్కడా గండ్లు పడ్డ దాఖలాలు లేవు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముందుచూపే దీనికి కారణమని నీటిపారుదల రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. వైఎస్సార్ హయాంలో దూరదృష్టితో రూ.600 కోట్లతో 535 కిలోమీటర్లు మేర గోదావరి గట్లను ఆధునికీకరించడం, ఎత్తు పెంచడం వల్లే వరద ఉగ్రరూపం దాల్చినా ప్రాణనష్టం జరగకుండా కాపాడగలిగినట్లు పేర్కొంటున్నారు.
యుద్ధ ప్రాతిపదికన చర్యలు...
వైఎస్సార్ సీఎంగా ఉండగా 2006 ఆగస్టు 7న గోదావరికి వరదలు వచ్చాయి. నాడు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 22.80 అడుగుల నీటిమట్టంతో 28,50,664 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేశారు. నాటి వరదల ఉధృతికి వశిష్ట ఎడమ గట్టుకు పి.గన్నవరం మండలం మొండెపులంక, గౌతమి కుడిగట్టుకు అయినవిల్లి మండలం శానపల్లిలంక వద్ద భారీగా గండ్లు పడ్డాయి. ఏటిగట్లకు పడ్డ గండ్లతో పలు మండలాల్లో పంటలు ముంపునకు గురై రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో చలించిపోయిన వైఎస్సార్ యుద్ధప్రాతిపదికన చర్యలకు ఆదేశించారు. నాడు నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న పొన్నాల లక్ష్మయ్య ఆధ్వర్యంలో ఒక బృందాన్ని గోదావరి జిల్లాలకు పంపి వాస్తవ పరిస్థితిపై నివేదిక తెప్పించుకున్నారు. రిటైర్డ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ సీతాపతిరావు సారథ్యంలో వరదలు, ఏటిగట్ల ఆధునీకరణపై సాంకేతిక బృందంతో సర్వేచేసి సమగ్ర నివేదిక సిద్ధం చేయించారు.
ఎటు చూసినా 8 మీటర్ల ఎత్తుతో..
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో 535 కిలోమీటర్ల మేర గోదావరి ఏటిగట్ల పటిష్టం కోసం వైఎస్సార్ రూ.548 కోట్లు మంజూరు చేశారు. పనులు పూర్తయ్యేసరికి అంచనాలు రూ.600 కోట్లు దాటిపోయాయి. 1986 నాటి వరదల సమయంలో ఏటిగట్లు ఆరు మీటర్ల ఎత్తు ఉండగా మరో రెండు అడుగులు పెంచి ఆధునీకరించారు. గోదావరి బండ్ ఎత్తు ఎక్కడ చూసినా ఎనిమిది మీటర్లు ఉండేలా పెంచారు. నాలుగు మీటర్లు వెడల్పున్న ఏటిగట్లను ఆరున్నర మీటర్లకు పెంచి విస్తరించారు. ఏటిగట్లు కోతకు గురికాకుండా మరో రూ.112 కోట్లతో నదీ పరీవాహకం వెంట గ్రోయిన్స్ కూడా నిర్మించారు. పటిష్టమైన చర్యల ద్వారా 1986 నాటి పరిస్థితులు పునరావృతం కాకుండా నివారించారు. తద్వారా గోదావరి జిల్లాల ప్రజలకు వైఎస్ రాజశేఖరరెడ్డి దార్శనికుడిగా నిలిచారు.
ముందుచూపు ఫలితమే..
1986 ఆగస్టు 16న ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 20.10 అడుగులతో రికార్డు స్థాయిలో 35,06,380 క్యూసెక్కుల మిగులు జలాలు సముద్రంలోకి విడుదల చేశారు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద అత్యధికంగా నమోదైన 1986 వరదలనే ప్రామాణికంగా తీసుకుని ఏటిగట్లు పటిష్టం చేయాలని వైఎస్సార్ నిర్ణయించారు. దూరదృష్టితో ఎత్తు పెంపు, వెడల్పు, పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకోవడంతో తాజా వరదల్లో ఏటిగట్లకు ఎక్కడా చిన్న గండి కూడా పడలేదు. ఆనాడు ముందుచూపుతో ఆయన తీసుకున్న నిర్ణయాలే గోదావరి ప్రజల ప్రాణాలకు భరోసాగా నిలిచాయి.
గాలికొదిలేసిన చంద్రబాబు సర్కారు
వైఎస్సార్ హయాంలో చేపట్టిన రక్షణ చర్యల్లో కొన్ని ప్యాకేజీలను ఆయన హఠాన్మరణం తరువాత చంద్రబాబు సర్కార్ గాలికొదిలేసింది. వశిష్ట కుడి గట్టు నరసాపురం, వశిష్ట ఎడమగట్టు పరిధిలో 48వ కిలోమీటరు నుంచి 90వ కిలోమీటరు వరకు మూడు ప్యాకేజీలు నిలిచిపోయాయి. అప్పట్లో పనులు నిలిచిపోయిన ప్రాంతాల్లోనే తాజాగా అధికార యంత్రాంగం, స్థానికులు నిద్రాహారాలు మాని గట్లకు కాపలా కాయాల్సి వచ్చింది. రాజోలు పరిధిలోని తాటిపాక మఠం నుంచి అంతర్వేది, రాజోలు నుంచి అంతర్వేది వరకు మానేపల్లి వద్ద గోదావరి వరద ఉధృతి భయపెట్టింది. సఖినేటిపల్లి లంక, టేకిశెట్టిపాలెం, దిండి, రామరాజులంక, ఎల్ గన్నవరం, మానేపల్లి ప్రాంతాల్లో వరద భీతిగొల్పింది. వైఎస్సార్ హయాంలో చేపట్టిన ఈ పనులను తరువాత ప్రభుత్వాలు పూర్తి చేసి ఉంటే ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదని పేర్కొంటున్నారు.
ఆ నిర్ణయమే కాపాడింది..
ఈరోజు గోదావరి జిల్లాలు సురక్షితంగా బయటపడ్డాయంటే ఆ రోజు వైఎస్సార్ తీసుకున్న నిర్ణయాలే కారణం. ఆయన దూరదృష్టితో కరకట్ట పటిష్టం చేయకుంటే ఈ వరదలకు ఏం జరిగేదో ఊహించలేం. ఎప్పుడూ లేనిది జూలైలో ఇంత ఉధృతంగా రావడం ప్రమాదకరమే. 2006లో వైఎస్సార్ సీఎంగా ఉండగా ధవళేశ్వరం హెడ్‌వర్క్స్ ఈఈగా ఏటిగట్ల అంచనాలు రూపొందించే ప్రక్రియలో భాగస్వామి కావడం నాకెంతో సంతృప్తినిచ్చింది.
– విప్పర్తి వేణుగోపాలరావు, రిటైర్డ్ ఎస్‌ఈ, జలవనరులశాఖ, జెడ్పీ చైర్మన్, ఉమ్మడి తూర్పుగోదావరి
Comments
Please login to add a commentAdd a comment