సాక్షి, అమరావతి: ఈ నెలలో కేవలం 27 రోజుల్లోనే 2,192.93 టీఎంసీల గోదావరి జలాలు ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలో కలిశాయి. 1861 నుంచి అందుబాటులో ఉన్న రికార్డులను పరిశీలిస్తే.. ఈ ఏడాది జూలైలో రికార్డు స్థాయిలో గోదావరి జలాలు కడలి పాలవడం గమనార్హం. ఈ నెల ముగియడానికి మరో నాలుగు రోజులు మిగిలి ఉన్నాయి. ప్రస్తుత ప్రవాహాలను పరిగణనలోకి తీసుకుంటే రోజుకు 75 చొప్పున నాలుగు రోజుల్లో మరో 300 టీఎంసీలు సముద్రంలో కలుస్తాయని జల వనరుల శాఖ అంచనా వేసింది. అంటే.. జూలై ముగిసే నాటికి కనీసం 2,492.93 టీఎంసీలు సముద్రంలో కలవనున్నాయి.
సాధారణంగా జూలైలో గోదావరికి భారీ వరదలు రావు. ఈ నెలలో సాధారణంగా 100 నుంచి 500 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలుస్తాయి. ఇంతకంటే అధికంగా గోదావరి జలాలు కడలి పాలయ్యే అవకాశాలు తక్కువ. 2013 జూలైలో తొలి సారిగా గోదావరికి భారీ వరదలు వచ్చాయి. అది కూడా జూలై ద్వితీయార్థంలో రావడంతో 2,033.86 టీఎంసీలు కడలి పాలయ్యాయి. ఇప్పటివరకూ అదే అత్యధిక రికార్డు. కానీ.. ఈ ఏడాది చరిత్రలో ముందెన్నడూ లేని రీతిలో జూలై ప్రథమార్థంలోనే గోదావరికి భారీ వరదలు వచ్చాయి. ద్వితీయార్థంలోనూ కొనసాగుతున్నాయి. కేవలం 27 రోజుల్లోనే 2,192.93 టీఎంసీలు సముద్రంలో కలవడం ద్వారా 2013 జూలైలో సృష్టించిన రికార్డును తొమ్మిదేళ్ల తర్వాత గోదావరి ఈ ఏడాది బద్దలు కొట్టడం గమనార్హం.
మూడుసార్లు గరిష్ట ప్రవాహం వచ్చినా..
సాధారణంగా గోదావరి నదికి ఆగస్ట్ నెలలో మాత్రమే గరిష్ట ప్రవాహం వస్తుంటుంది. అందుకు భిన్నంగా.. గోదావరి చరిత్రలో 1861, 1988, 1989 సంవత్సరాల్లో జూలై నెలలో గరిష్టంగా 15 లక్షల క్యూసెక్కుల చొప్పున వరద ప్రవాహాలు వచ్చాయి. కానీ.. ఈ ఏడాది జూలై 16న ధవళేశ్వరం బ్యారేజీలో 26.9 లక్షల క్యూసెక్కుల ప్రవాహం రావడం గమనార్హం. ధవళేశ్వరం బ్యారేజీ చరిత్రలో జూలైలో వచ్చిన గరిష్ట వరద ప్రవాహం ఇదే కావడం గమనార్హం. 1861 నుంచి ఇప్పటివరకూ గోదావరికి 1986లో ఆగస్టు 16న గరిష్టంగా 35,06,338 క్యూసెక్కుల ప్రవాహం రాగా.. అంతే స్థాయిలో సముద్రంలోకి వదిలేశారు. ఆ తర్వాత 2006 ఆగస్టు 6న అత్యధికంగా 28,05,773 క్యూసెక్కుల ప్రవాహం ధవళేశ్వరం బ్యారేజీలోకి రాగా.. గోదావరి చరిత్రలో ఇది రెండో అత్యధిక వరద ప్రవాహంగా నమోదైంది.
వరద జలాల మళ్లింపునకు సర్కారు యత్నం
ధవళేశ్వరం బ్యారేజీ నుంచి ఏటా సగటున 3 వేల టీఎంసీల గోదావరి జలాలు కడలిలో కలుస్తున్నాయి. సముద్రం పాలవుతున్న ఈ నీటిని గరిష్ట స్థాయిలో వినియోగించుకుని.. రాష్ట్రంలో దుర్భిక్ష ప్రాంతాలకు మళ్లించి వాటిని సుభిక్షం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీలోకి.. అక్కడి నుంచి కొత్తగా నిర్మించే బొల్లాపల్లి రిజర్వాయర్‌లోకి.. అక్కడి నుంచి వెలిగొండ ప్రాజెక్టులోకి గోదావరి జలాలను తరలించి.. అక్కడి నుంచి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్‌లోకి పోసి.. సోమశిల (పెన్నా)కు తరలించేందుకు ప్రణాళిక రచించింది. ఇచ్చంపల్లి నుంచి నాగార్జున సాగర్ (కృష్ణా), సోమశిల (పెన్నా), గ్రాండ్ ఆనకట్ట (కావేరి) అనుసంధానం ద్వారా 247 టీఎంసీల గోదావరి జలాలను తరలించడానికి ఎన్‌డబ్ల్యూడీఏ (జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ) ప్రణాళిక రచించింది.
Comments
Please login to add a commentAdd a comment