![Godavari Flood Flow At Dowleswaram Barrage Andhra Pradesh - Sakshi](/styles/webp/s3/article_images/2022/09/14/dowleswaram.jpg.webp?itok=IK_6KKHs)
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం/పోలవరం/కూనవరం(అల్లూరి సీతారామరాజు జిల్లా): తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి వరద ఉద్ధృతి మరింతగా పెరిగింది. మంగళవారం రాత్రి 9 గంటలకు 11,58,927 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. నీటిమట్టం 13 అడుగులకు చేరింది. గోదావరి డెల్టాకు 3,900 క్యూసెక్కులు విడుదల చేస్తూ మిగిలిన 11,55,027 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు నీటిమట్టం 11.75 అడుగులు దాటడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేసిన అధికారులు దిగువన లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.
ఎగువ నుంచి భద్రాచలం వద్దకు మంగళవారం రాత్రి 7 గంటలకు 13,55,586 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండటంతో నీటిమట్టం 51.7 అడుగులకు చేరుకుంది. దీంతో రెండో ప్రమాద హెచ్చరికను జారీచేశారు. నీటిమట్టం 53 అడుగులను దాటితే మూడో ప్రమాద హెచ్చరికను జారీచేస్తారు. మంగళవారం వర్షాలు కొనసాగడంతో గోదావరి బేసిన్‌లో ఎగువన వరద స్థిరంగా కొనసాగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ నుంచి 9,89,625 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తుండగా దుమ్ముగూడెం సమీపంలోని సీతమ్మసాగర్ వద్దకు 13,11,731 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది.
సీతమ్మసాగర్ నుంచి వచ్చిన వరదను వచ్చినట్లు దిగువకు వదిలేస్తున్నారు. వాటికి వాగులు, వంకల వరద తోడవుతుండటంతో భద్రాచలం వద్దకు బుధవారం 17 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో పోలవరం వద్ద 24 గంటలు అప్రమత్తంగా ఉంటున్న అధికారులు వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తూ.. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.
పోలవరం వద్ద 33.380 మీటర్లకు నీటిమట్టం
పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద మంగళవారం సాయంత్రానికి గోదావరి నీటిమట్టం 33.380 మీటర్లకు చేరుకుంది. స్పిల్‌వే 48 గేట్ల నుంచి నీటిని దిగువకు వదిలేస్తున్నారు. ప్రాజెక్టు ప్రాంతానికి వెళ్లే ప్రధాన రోడ్డుమార్గంలోని కడెమ్మ వంతెనకు ఇరువైపులా వరదనీరు చేరింది. కాగా, గోదావరి ఉద్ధృతికి శబరి నది తోడవడంతో విలీన మండలాలు ముంపునకు గురయ్యాయి.
కూనవరంలో ఉదయ్‌భాస్కర్ కాలనీ, గిన్నెలబజారు మంగళవారం ముంపునకు గురయ్యాయి. ముందస్తు చర్యల్లో భాగంగా అధికార యంత్రాంగం సోమవారం అర్ధరాత్రే ఇళ్లను ఖాళీ చేయించి బాధితులను కోతులగుట్ట పునరావాస కాలనీకి తరలించింది. కూనవరం వద్ద గోదావరి మట్టం 48 అడుగులకు చేరింది.
చరిత్రలో ఏడో అతి పెద్ద వరద
ఈ ఏడాది జనవరి 1 నుంచి మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు 4,734 టీఎంసీల గోదావరి జలాలు బంగాళాఖాతంలో కలిశాయి. బంగాళాఖాతంలో ఈ ఏడాది ఇప్పటివరకు కలిసిన గోదావరి జలాలను పరిగణలోకి తీసుకుంటే.. ధవళేశ్వరం బ్యారేజ్ చరిత్రలో గోదావరికి ఈ ఏడాది వచ్చిన ప్రవాహం ఏడో అతిపెద్ద వరద ప్రవాహం.
ధవళేశ్వరం బ్యారేజ్ చరిత్రలో గరిష్టంగా 1990లో 7,092.285 టీఎంసీల గోదావరి జలాలు సముద్రంలో కలవగా.. ఆ తర్వాత 1994లో 5,959.228 టీఎంసీలు, 2013లో 5,921.9 టీఎంసీలు, 1984లో 4,879.693 టీఎంసీలు, 2006లో 4,841.84 టీఎంసీలు, 1988లో 4,800.839 టీఎంసీలు సముద్రంలో కలిశాయి. గోదావరికి 1986లో ఆగస్టు 16న గరిష్టంగా 36 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చినప్పుడు ఆ ఏడాదిలో ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 3,213.371 టీఎంసీలే సముద్రంలో కలవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment