‘వెలిగొండ’ మొదటి సొరంగం పూర్తి  | Veligonda Project first tunnel was completed | Sakshi
Sakshi News home page

‘వెలిగొండ’ మొదటి సొరంగం పూర్తి 

Published Thu, Jan 14 2021 3:50 AM | Last Updated on Thu, Jan 14 2021 4:16 AM

Veligonda Project first tunnel was completed - Sakshi

సాక్షి, అమరావతి: వెలిగొండ ప్రాజెక్ట్‌ మొదటి సొరంగాన్ని టీడీపీ హయాంలో 2014 జూన్‌ 8 నుంచి 2019 మే 29 వరకు కేవలం 600 మీటర్లు మాత్రమే తవ్వారు. రోజుకు సగటున 0.32 మీటర్ల మేర.. అంటే ఒక అడుగు మాత్రమే సొరంగాన్ని తవ్వారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చాక.. 2019 నవంబర్‌ నుంచి జనవరి 13, 2021 వరకూ మొదటి సొరంగంలో 3.6 కి.మీ. తవ్వి పనులను పూర్తి చేశారు. మార్చి 2020 నుంచి జూలై 2020 వరకూ లాక్‌డౌన్‌ కొనసాగింది. జూన్‌ నుంచి నవంబర్‌ వరకూ నల్లమల అడవుల్లో భారీ వర్షాలు కురవడంతో సొరంగం తవ్వకానికి ఆటంకం కలిగింది. ఇన్ని అడ్డంకుల్లోనూ రోజుకు సగటున 9.23 మీటర్ల చొప్పున తవ్వుతూ సొరంగాన్ని పూర్తి చేశారు. ప్రాజెక్ట్‌ను 2016 నాటికే పూర్తి చేస్తామని చెప్పిన టీడీపీ ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా టన్నెల్‌ బోరింగ్‌ మెషిన్ల మరమ్మతుల పేరుతో కాంట్రాక్టర్లకు రూ.66.44 కోట్లను దోచిపెట్టిన టీడీపీ సర్కారు కమీషన్లు వసూలు చేసుకుంటే.. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా రూ.61.76 కోట్లను ఆదా చేసిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రికార్డు సమయంలో మొదటి సొరంగాన్ని పూర్తి చేయడం గమనార్హం.  

వేగం పుంజుకున్న రెండో సొరంగం పనులు 
ఇదే ప్రాజెక్ట్‌లో భాగమైన రెండో సొరంగం పనులను వేగవంతం చేశారు. నల్లమల సాగర్‌ పనులను ఇప్పటికే పూర్తి చేశారు. నల్లమల సాగర్‌లో ముంపునకు గురయ్యే 11 గ్రామాలకు చెందిన 7,555 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించేందుకు రూ.1,411.56 కోట్లను జూన్‌ 24న మంజూరు చేశారు. పునరావాస కాలనీల నిర్మాణాన్ని వేగవంతం చేశారు. శ్రీశైలానికి వరద వచ్చేలోగా నల్లమల సాగర్‌ నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఆ మేరకు పనులు వేగం పుంజుకున్నాయి. 

అధికారులను అభినందించిన మంత్రి అనిల్‌ 
సొరంగం పనులను రికార్డు సమయంలో పూర్తి చేసిన జల వనరుల శాఖ అధికారులు, కాంట్రాక్ట్‌ సంస్థ మేఘాను మంత్రి పి.అనిల్‌కుమార్‌ యాదవ్‌ అభినందించారు. జల వనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, సీఈ జలంధర్‌లకు బుధవారం రాత్రి ఫోన్‌ చేసిన మంత్రి  గడువులోగా పనులు పూర్తి చేశారని అభినందించారు. రెండో సొరంగం పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు.   

మాట నిలబెట్టుకున్న సీఎం
ప్రాజెక్ట్‌ మొదటి సొరంగం పనులు బుధవారం రాత్రి పూర్తయ్యాయి. ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేసేందుకు దీనిని ప్రాధాన్యత ప్రాజెక్ట్‌గా ప్రకటించిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తొలి దశ పనులను పూర్తి చేసి వచ్చే సీజన్‌లో నల్లమల సాగర్‌కు శ్రీశైలం నుంచి కృష్ణా జలాలను తరలిస్తామని గత ఏడాది ఫిబ్రవరి 20న ప్రకటించారు. ఆ మేరకు పనులు పూర్తి చేయించి మాట నిలబెట్టుకున్నారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement