సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు 2017–18 ధరల ప్రకారం రెండోసారి సవరించిన అంచనా వ్యయం మేరకు నిధులు విడుదల చేస్తేనే ప్రాజెక్టును పూర్తి చేయడం సాధ్యమవుతుందన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనతో పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) ఏకీభవించింది. 2013–14 ధరల ప్రకారం ప్రాజెక్టును పూర్తి చేయడం సాధ్యం కాదని కేంద్రానికి వివరిస్తామని తెలిపింది. 2017–18 ధరల ప్రకారం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాల్సిందిగా కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతామని పేర్కొంది. ఇతర జాతీయ ప్రాజెక్టులకు ఇచ్చిన తరహాలోనే పోలవరం ప్రాజెక్టుకు కూడా నీటిపారుదల విభాగం వ్యయాన్ని విడుదల చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తామని హామీ ఇచ్చింది. ప్రాజెక్టు పనులకు 2014 ఏప్రిల్ 1కి ముందు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.4,730.71 కోట్లకు ఆమోదం తెలిపింది.
రాష్ట్ర ప్రభుత్వం వ్యయం చేసిన నిధులను ఎప్పటికప్పుడు రీయింబర్స్ చేయడం.. ప్రాజెక్టు వేగంగా పూర్తి కావడానికి దోహదపడుతుందనే విషయం కూడా కేంద్రానికి సూచిస్తామని తెలిపింది. పోలవరం ప్రాజెక్టు నీటిపారుదల విభాగం వ్యయాన్ని 2013–14 ధరల ప్రకారం రూ.20,398.61 కోట్లుగా నిర్ధారించి, ఆమోదించాలని కోరుతూ అక్టోబర్ 12న కేంద్ర జల్ శక్తి శాఖకు కేంద్ర ఆర్థిక శాఖ వ్యయ విభాగం డిప్యూటీ సెక్రటరీ ఎల్కే త్రివేది లేఖ రాశారు. ఈ ప్రతిపాదనపై చర్చించేందుకు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన సోమవారం హైదరాబాద్‌లో పీపీఏ సర్వ సభ్య సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీ నుంచి కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) డబ్ల్యూపీ అండ్ పీ విభాగం చీఫ్ హెచ్‌కే హల్దార్ తదితరులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.
ఆ వ్యయమంతా సక్రమమే
పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించక ముందు అంటే 2014 ఏప్రిల్ 1కి ముందు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంపై పీపీఏ తొలుత చర్చించింది. రూ.4,730.71 కోట్లను వ్యయం చేశారని, ఆ వ్యయమంతా సక్రమమేనంటూ కాగ్ ఇచ్చిన ఆడిటెడ్ స్టేట్‌మెంట్‌ను ఆదిత్యనాథ్ దాస్ పీపీఏకు ఇచ్చారు. దానిని పరిశీలించిన పీపీఏ.. ఆ వ్యయాన్ని నిర్ధారించి ఆమోదించింది.
రూ.20,398.61 కోట్లతో ప్రాజెక్టు పూర్తి అసాధ్యం
తర్వాత 2013–14 ధరల మేరకు ప్రాజెక్టు నీటిపారుదల విభాగం వ్యయాన్ని రూ.20,398.61 కోట్లుగా నిర్ధారించడంపై పీపీఏ చర్చించింది. ఆదిత్యనాథ్ దాస్ మాట్లాడుతూ రూ.20,398.61 కోట్లతో ప్రాజెక్టును పూర్తి చేయడం ఎలా సాధ్యమవుతుందని ఆదిత్యనాథ్ దాస్ ప్రశ్నించారు. ప్రాజెక్టు కోసం సేకరించే భూమికి 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాల్సి ఉంటుందని, అలాగే నిర్వాసితులకు పునరావాసం కల్పించాల్సి ఉంటుందని.. కేవలం వీటికే రూ.28,191.03 కోట్లు అవసరమని ఆర్‌సీసీనే తేల్చిన అంశాన్ని గుర్తుచేశారు. మరోవైపు పీపీఏ, సీడబ్ల్యూసీ, టీఏసీలు 2017–18 ధరల ప్రకారం రూ.55,548.87 కోట్ల అంచనా వ్యయాన్ని ఆమోదించాయని, ఆర్‌సీసీ రూ.47,725.74 కోట్లతో అంచనా వ్యయాన్ని ఖరారు చేసిందని, ఇప్పుడు 2013–14 ధరలను ప్రస్తావించడం ఎంతవరకు సబబని నిలదీశారు. 2017–18 ధరల ఆధారంగా పీపీఏ, సీడబ్ల్యూసీ, టీఏసీ, ఆర్‌సీసీ ఆమోదించిన రెండోసారి సవరించిన వ్యయం మేరకు నిధులు విడుదల చేస్తేనే ప్రాజెక్టును పూర్తి చేయడం సాధ్యమవుతుందని తేల్చిచెప్పారు. ఈ వాదనతో ఏకీభవించిన పీపీఏ.. 2013–14 ధరలతో ప్రాజెక్టును పూర్తి చేయడం సాధ్యం కాదని పీపీఏ పేర్కొంది. 2017–18 ధరల ప్రకారం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయాల్సిందిగా కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతామని హామీ ఇచ్చింది.
నీటి పారుదల విభాగంతో కలిపే నీటి సరఫరా వ్యయం
దేశంలో 16 జాతీయ ప్రాజెక్టులు ఉంటే.. పోలవరం మినహా మిగిలిన ప్రాజెక్టులకు నీటిపారుదల, నీటి సరఫరా విభాగాన్ని ఒకటిగానే లెక్కించి నిధులు ఇస్తున్నారని.. పోలవరం విషయంలో మాత్రం నీటిపారుదల విభాగం వ్యయం నుంచి నీటి సరఫరా విభాగం వ్యయాన్ని ఎలా తొలగిస్తారని ఆదిత్యనాథ్ దాస్ గట్టిగా నిలదీశారు. ఈ అంశంపై సీడబ్ల్యూసీ అధికారులు హెచ్‌కే హల్దార్, ఆర్కే పచౌరి, అశోక్ ఎస్ గోయల్‌ల అభిప్రాయాన్ని పీపీఏ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ కోరారు. వారు ముగ్గురూ నీటిపారుదల విభాగం నుంచి నీటి సరఫరా విభాగాన్ని తొలగించకూడదన్న ఏపీ ప్రభుత్వ వాదనతో ఏకీభవించారు. దాంతో ఇతర జాతీయ ప్రాజెక్టులకు ఇచ్చినట్లుగానే పోలవరం ప్రాజెక్టుకు నీటి పారుదల విభాగం వ్యయాన్ని విడుదల చేయాల్సిందిగా కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతామని పీపీఏ స్పష్టం చేసింది. అలాగే నిధుల విడుదల జాప్యం చేయకుండా చూడాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తామని కూడా పీపీఏ చైర్మన్ హామీ ఇచ్చారు.
ఏపీ వాదనకు పీపీఏ మద్దతు
Published Tue, Nov 3 2020 2:45 AM | Last Updated on Tue, Nov 3 2020 7:35 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment