ఏది నిజం?: ‘అన్నమయ్య’పై అన్ని అబద్ధాలా?  | Eenadu Ramoji Rao Fake News On Annamayya Project | Sakshi
Sakshi News home page

ఏది నిజం?: ‘అన్నమయ్య’పై అన్ని అబద్ధాలా? 

Published Sun, May 21 2023 4:50 AM | Last Updated on Sun, May 21 2023 3:00 PM

Eenadu Ramoji Rao Fake News On Annamayya Project - Sakshi

పులపత్తూరు గ్రామంలో వివిధ దశల్లో ఉన్న గృహాల నిర్మాణాల పనులు, కొనసాగుతున్న పింఛా ప్రాజెక్టు పనులు.. వరద బాధిత గ్రామాల ప్రజలతో మాట్లాడుతున్న కలెక్టర్, ఇతర అధికారులు

గ్లాసులో 80 శాతం నిండుగా ఉన్నా...పైనున్న ఆ 20 శాతం ఖాళీని చూపిస్తూ...‘ఖాళీ గ్లాసు’ అని ప్రచారం చేసే వాళ్లను ఏమనుకోవాలి? ఇచ్చిన మాట ప్రకారం అన్నీ చేసినా... కొనసాగుతున్న ఒకటి రెండు పనులను చూపించి ఇంకా ఏమీ కాలేదంటూ విషం చిమ్మే మాయావులను ఏమనుకోవాలి?  

సమాధానం ఒక్కటే!. దాన్ని ‘ఈనాడు’ పత్రిక అనుకోవాలి. అంతే!!. శనివారంనాడు ‘‘హామీల గట్టుపై కన్నీటి వేదన..’’ అంటూ ఈనాడు రాసిన ‘కథనం’ ఇలాంటిదే. శవాల గుట్టపై సంపద వెతుక్కునే రామోజీరావు తత్వానికి మచ్చుతునక ఈ కథనం. ఊహించని విపత్తులో నష్టపోయిన జనాన్ని సర్కారు అడుగడుగునా ఆదుకుంది. మృతుల కుటుంబాలకు తక్షణం రూ.5 లక్షల చొప్పున అందజేసింది.

క్షతగాత్రులకూ పరిహారం చెల్లించింది. ఇక అర్హులైన వారికి ఉద్యోగ మేళాలు నిర్వహించి ఉద్యోగాలు కల్పించటమే కాక నగదు సాయమూ అందించింది. పొలాల్లోని ఇసుక మేటలు తానే తొలగించింది. ఒకవేళ రైతులు తొలగించుకున్న పక్షంలో హెక్టారుకు రూ.12,500 చొప్పున చెల్లిస్తామని చెప్పి... చెల్లించింది. 

నష్టానికి తక్షణ పరిహారం చెల్లించటమే కాక... బాధితులకు ఇళ్లు, ఇళ్ల స్థలాలు మంజూరు చేసింది. అర్హుల కోసం 412 ఇళ్ల నిర్మాణమూ మొదలు పెట్టింది. మరో నెల రోజుల్లో 140 ఇళ్లు పూర్తికానున్నాయి. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. ఇవీ.. కడప జిల్లా అన్నమయ్య ప్రాజెక్టు వరద బాధితుల సహాయానికి సంబంధించిన వాస్తవాలు. కానీ రామోజీరావు రాసిన కథనంలో ఈ వాస్తవం ఒక్కటీ లేదు. ప్రతి అంశానికీ తనదైన రంగేసి మరీ విషం చిమ్మారు. 

ఈ రాతల్లోని నిజానిజాలివిగో... 
ఏడాదిన్నర కిందట 2021 నవంబర్లో కడప జిల్లాలోని అన్నమయ్య ప్రాజెక్టులోకి ఊహించని వరద పోటెత్తింది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు ఉవ్వెత్తున వరద నీరు తరలివచ్చింది. ఎగువనున్న పింఛా ప్రాజెక్టు మట్టి కట్టలు తెగిపోయాయి. ఆ వరద ప్రభావం అన్నమయ్య ప్రాజెక్టుపై పడింది. అప్పటికే నిండు కుండలా ఉన్న ప్రాజెక్టుకు అదనపు నీరు ఉవ్వెత్తున చేరటంతో అన్నమయ్య ప్రాజెక్టు కరకట్టలు తెగిపోయి ఒక్కమారుగా ఉపద్రవం ముంచెత్తింది.

వరదనీరు బీభత్సం సృష్టించింది. ఆ రోజు 2021 నవంబరు 19న కార్తీక పౌర్ణమి కావడంతో.. ఉదయాన్నే అక్కడి శివాలయానికి వెళ్లిన గ్రామీణులను వరద చుట్టుముట్టింది. నీటి ఉధృతిలో కొందరు కొట్టుక పోయారు. మూగ జీవాలు మరణించాయి. ఊళ్లు మునిగిపోయాయి. యావత్తు జిల్లా అదిరిపడిన ఇంతటి తీవ్ర విపత్తును... ప్రభుత్వం తక్షణం స్పందించి సమర్థంగా ఎదుర్కొంది. 

యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు... 
వరద నీటిలో చిక్కుకొని సర్వస్వం కోల్పోయిన బాధితులకు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు అందాయి. వరద బాధిత గ్రామాల్లో సహాయక చర్యలకు ఆటంకం కలగకూడదని భావించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి... 10 రోజల తరవాత డిసెంబర్‌ 2న వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. మందపల్లె, పులపత్తూరు గ్రామాల్లో వరద బాధితులను స్వయంగా కలిశారు. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున 33 మందికి రూ.1.65 కోట్లు పరిహారం చెల్లించారు. కొద్దిరోజుల్లోనే ఈ చెల్లింపులూ పూర్తయ్యాయి.

వరదలు కారణంగా ఇళ్లు కోల్పోయిన వారికి ఒక్కొక్క ఇంటికి రూ.95,100 చొప్పున 453 ఇళ్లకు రూ.4.30 కోట్లు వెంటనే చెల్లించారు. పాక్షికంగా దెబ్బతిన్న 601 ఇళ్లకు రూ.5,200 చొప్పున నష్టపరిహారం అందించారు. అది కూడా అందరికీ అందింది. ఇక మందపల్లె, పులపత్తూరు, తొగురుపేట, శేషమాంబపురం, గుండ్లూరు గ్రామాల్లో దాదాపు 376 పశువులు చనిపోయాయి. వాటికి రూ.1.41 కోట్ల పరిహారం చెల్లించారు. హార్టికల్చర్, అగ్రికల్చర్‌ పంటలు నష్టపోయిన 2,196 మంది రైతులకు రూ. 3.05 కోట్లు పరిహారం దక్కింది. 21రోజులు పాటు 9 క్యాంపుల ద్వారా 5వేల మందికి పునరావాసం కల్పించారు. వీటిలో ఏ ఒక్కటీ జాప్యం కాలేదు. అన్ని చెల్లింపులూ కొద్దిరోజుల్లోనే పూర్తయ్యాయి. 

పులపత్తూరు లేఅవుట్‌లో 412 ఇళ్లు మంజూరు.... 
వరద బాధితులకు పటిష్టమైన ఇళ్లు నిర్మించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం 412 మంది అర్హులకు ఇళ్లను మంజూరు చేసింది. వాటన్నిటికీ మ్యాపింగ్, జియోట్యాగింగ్, రిజిస్ట్రేషన్‌ పూర్తయ్యాయి. వాటిలో 107 ఇళ్లు రూఫ్‌ లెవెల్‌ పూర్తి చేసుకున్నాయి. మరో 32 ఇళ్లు ఆర్సీ లెవెల్‌ చేరాయి. త్వరలో శ్లాబ్‌లు ఏర్పాటు చేసేందుకు యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇవన్నీ ఒకటి రెండు నెలల్లో పూర్తికాబోతున్నాయి. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. వీలైనంత త్వరగా వాటిని కూడా పూర్తి చేస్తామని, అర్హులందరికీ వీలైనంత వేగంగా ఇళ్లు అందిస్తామని కలెక్టర్‌ గిరీషా బాధితులకు స్పష్టం చేశారు కూడా. 

డ్వాక్రా గ్రూపులకు రూ. 8.98 కోట్ల రుణమాఫీ... 
వరద ప్రభావిత గ్రామాల్లో డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. పొలాల్లో ఉన్న ఇసుక మేటలు తొలగిస్తామని చెప్పారు. అర్హులకు ఇళ్లు, ఉచిత పట్టాలు ఇస్తామన్నారు. అలాగే మృతి చెందిన వారి కుటుంబాలకు వారం, పది రోజుల్లోనే 33 మందికి సంబంధించి ఒక్కొక్కరికి రూ.5 లక్షలు చొప్పున రూ.1.65 కోట్లు పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు.

ఇవన్నీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నెరవేర్చారు. అలాగే డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేశారు. 189 గ్రూపుల సభ్యులకు రూ.8.98 కోట్ల రుణాలను మాఫీ చేశారు. సమీపంలోని పాలేశ్వరస్వామి ఆలయం (శివాలయం) నిర్మాణం కూడా టీటీడీ ద్వారా దాదాపు పూర్తయ్యింది. 

అన్నమయ్య, పింఛా ప్రాజెక్టులకు కొత్త రూపు... 
అన్నమయ్య, పింఛా ప్రాజెక్టులకు పూర్తిస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త రూపు తీసుకువస్తోంది. పటిష్టమైన సిమెంట్‌ ప్రొటెక్షన్‌ వాల్స్‌ ఏర్పాటుతో పాటు ఏకకాలంలో అన్నమయ్య నుంచి 5.60 లక్షల క్యూసెక్కులు నీరు డిశ్చార్జి చేసేలా రూపొందించారు. ఇదివరకూ 5 గేట్లు మాత్రమే ఉన్నాయి. వాటి ద్వారా 2.17 లక్షల క్యూసెక్కులు మాత్రమే విడుదల చేసే వెసులుబాటు ఉండేది. వాటి స్థానంలో 25 గేట్లు ఏర్పాటు చేసి 5.6 లక్షల క్యూసెక్కుల నీరు డిశ్చార్జి చేసేలా విస్తారమైన స్పిల్‌వే ఏర్పాటు చేస్తున్నారు.

ఆ మేరకు రూ. 660 కోట్లుతో పనులు చేసేందుకు టెండర్లు ఖరారయ్యాయి కూడా. టెండరు దక్కించుకున్న కంపెనీతో నెలన్నర కిందట అగ్రిమెంటు కూడా పూర్తయింది. ఆ మేరకు కాంట్రాక్టు సంస్థ డిజైన్‌ రూపొందించాల్సి ఉంది. పింఛా ప్రాజెక్టుకు సైతం రూ.68 కోట్లుతో టెండర్లు పూర్తయ్యాయి. ఈ సంస్థతోనూ నెలన్నర కిందట అగ్రిమెంటు పూర్తి కాగా... పనులు మొదలై దాదాపు 20 శాతం అయ్యాయి కూడా. ఇవన్నీ క్షేత్రస్థాయిలో కనిపిస్తున్న వాస్తవాలు. కానీ వీటితో పనిలేని ‘ఈనాడు’ మాత్రం యథాప్రకారం బురద జల్లటానికే ప్రాధాన్యమిచ్చింది. 

హవ్వా...రక్షణ గోడలో అవినీతా? ఇదెక్కడి నీతి? 
రూ.3 కోట్లతో రక్షణ గోడ నిర్మించారని, అందులో వైఎస్సార్‌సీపీ నేతలు అవినీతికి పాల్పడి నాసిరకం నిర్మాణాలు చేపట్టారని రామోజీరావు రాసి పారేశారు. నిజానికి ‘ఈనాడు’కు గానీ, రామోజీరావుకు గానీ వాస్తవాలతోను, క్షేత్రస్థాయి అంశాలతోను సంబంధం లేదు కాబట్టి ఏదైనా రాసేస్తారు. ఎందుకంటే వాస్తవానికి అక్కడ రక్షణ గోడలే ఏర్పాటు చేయలేదు. గ్రామాల్లో తెగిపోయిన ప్రొటెక్షన్‌ వాల్‌ మరమత్తులు మాత్రం చేశారు. కానీ చేయని పనిని చేసినట్లు, అందులో అవినీతికి పాల్పడినట్లు రాయటమేంటని ఇరిగేషన్‌ ఈఈ వెంకట్రామయ్య తీవ్రంగా విమర్శించారు. 

ఇసుక మేటలు తొలగింపు... 
వరద ప్రభావిత ప్రాంతాల్లోని పొలాల్లో ఇసుకమేటలు తామే తొలగిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఆ మేరకు తొలగించారు కూడా. రైతుల పొలాల్లో పూర్తిగా తొలగించగా... 20 శాతం పోరంబోకు, ప్రభుత్వ భూముల్లో ఇసుక మేటలున్నాయి. వాటిలో ఉన్న ఇసుకను కావాల్సిన రైతులు ఎగువ ప్రాంతంలో ఉన్న తమ పొలాలకు తరలించుకుంటున్నారు. కానీ రామోజీ మాత్రం ఇసుక మేటలు తొలగించనట్లే వండేశారు. 

ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా ఆదుకున్నాం 
అన్నమయ్య, పింఛా డ్యాములు తెగిపోయి వరద తాకిడికి గురైన గ్రామాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంది. విపత్తు తలెత్తిన మర్నాటి నుంచే యంత్రాంగం యావత్తూ అక్కడే ఉండి ఆర్థికసాయం మొదలు అన్ని సహాయక చర్యలూ చేపట్టింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలన్నింటినీ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేసింది. మందపల్లె, పులపత్తూరు, తొగురుపేట, గుండ్లూరు గ్రామాలకు సంబంధించి 186 మంది ఇల్లు కట్టించాలని కోరారు. వారికి పూర్తి స్థాయిలో కట్టిస్తున్నాం. ఇప్పటికే 140 మంది గృహాలు రూఫ్‌ లెవల్‌కు వచ్చాయి.

మరో నెలరోజుల్లోపు అందరి గృహాలు పూర్తవుతాయి. 42 మంది తాత్కాలికంగా గుడారాల్లో ఉంటున్నారు. వారిక్కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వమే సౌకర్యాలు కల్పించింది. ఇప్పటివరకు వరద తాకిడికి మృతి చెందిన వారికి పరిహారం, మూగజీవాల మృతి, ఇసుక మేటల తరలింపు, ఇతరత్రా సదుపాయాల కల్పనకు రూ. 22 కోట్ల మేరకు ఖర్చు చేశాం. జాబ్‌మేళాల ద్వారా 325 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాం. అందులో కొందరు వెళ్లారు... మరికొందరు వెళ్లలేదు.

వరదతో మృతి చెందిన వారి కుటుంబాల్లో తొమ్మిది మందికి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలు ఇచ్చాం. 80 శాతం పొలాల్లో ఇసుక మేటలను ప్రభుత్వమే తొలగించింది. సాగుకు అనుకూలంగా మార్చింది. మరో 20 శాతం ప్రభుత్వ పోరంబోకు భూములు, ఇతర భూములు కలిగిన వారు మేమే తొలగించుకుంటామని చెబితే వారికి అవకాశమిచ్చాం. పలుమార్లు నేనే వెళ్లి పరిశీలిస్తూ బాధితులకు సమస్యలు రాకుండా చూశా. అన్నమయ్య, పింఛా ప్రాజెక్టుల నూతన నిర్మాణాలకు వేగంగా చర్యలు చేపడుతున్నాం. 
– పీఎస్‌ గిరీషా, జిల్లా కలెక్టర్, అన్నమయ్య జిల్లా 

రోడ్లు పూర్తయ్యాయి.. ఇళ్లు అవుతున్నాయి.. 
పులపత్తూరు గ్రామంలో అన్ని సౌకర్యాలు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రూ.50 లక్షలతో పొలాలను కనెక్ట్‌ చేయటానికి రోడ్లు వేశారు. విద్యుత్‌ కనెక్షన్లు ఇస్తున్నారు. కొంతమంది లబ్ధిదారులు సొంతంగా ఇళ్లు నిర్మించుకుంటున్నారు. మరికొందరికి కాంట్రాక్టు పద్ధతిలో ఇళ్లు నిర్మాణం చేపడుతున్నారు. దాదాపు లేఅవుట్స్‌లో అన్ని మౌలిక సదుపాయాలనూ కల్పిస్తున్నారు. నాలుగు నెలల్లో ఇవన్నీ పూర్తి స్ధాయిలో అందుబాటులోకి వస్తాయి. గుడారాల్లో ఉన్న వారికోసం కడుతున్న ఇళ్లు నెలలో శ్లాబ్‌ పూర్తి చేసుకుంటాయి. త్వరలో గృహప్రవేశాలు జరుగుతాయి.     
– జగన్, గ్రామప్రతినిధి, పులపుత్తూరు 

నాకు ఏపీఎండీసీలో ఉద్యోగం వచ్చింది 
వరదలకు సర్వం కోల్పోయిన మా గ్రామానికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వచ్చినప్పుడు ఆదుకోవాలని కోరాను. వరదనీటిలో మా అమ్మ శంకరమ్మ కొట్టుకుపోయింది. కుటుంబమంతా ఆర్థికంగా నష్టపోయింది. నిలదొక్కుకోలేకపోయాము. మా గోడు ముఖ్యమంత్రికి చెప్పుకున్నాం. ఆదుకుంటానని హామీ ఇచ్చారు. ఆయన దయతో నాకు ఏపీఎండీసీలో ఉదోగ్యం వచ్చింది. సంతోషంగా ఉంది. ఇప్పుడు పనిచేసి కుటుంబానికి ఆధారంగా నిలబడుతున్నా. 
– చలిమెల్ల, వెంకటసుబ్బరాజు, పులపత్తూరు  

పక్కా ఇంటిలో నివాసం 
ప్రభుత్వం నిర్మించిన పక్కా ఇంట్లో నివాసం ఉంటున్నాం. గుడారాల్లో ఉండకుండా జగనన్న కాలనీలోని ఇంటిలోకి చేరుకున్నాం. ఓ వైపు ఇంటి నిర్మాణం ఇంకా కొంత జరుగుతోంది. ప్రభుత్వం కల్పించిన నీడ వల్ల తలదాచుకుంటున్నాం. ఇంటి నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి.  
– ఈశ్వరయ్య కుటుంబం , పులపత్తూరు 

మాకు రూ.6.78 లక్షల రుణం మాఫీ అయింది... 
ప్రభుత్వం అందిస్తున్న రుణ మాఫీ సాయం మామూలుది కాదు. ఇది స్వయం సహాయక సంఘాల మహిళ కుటుంబాల్లో ఆర్ధికభారాన్ని తీర్చింది. మా అందరిలో మనో ధైర్యాన్ని పెంచింది. సర్వం కోల్పోయిన మమ్మల్ని ప్రభుత్వం అన్ని రకాలుగా అదుకుంది. మా సంఘాల రుణాలు మాఫీ చేయటం వల్ల నా కుటుంబానికి రూ.6.78లక్షల మాఫీ అయింది. 
– టి.సుబ్బలక్షమ్మ, మారమ్మ ఎస్‌హెచ్‌జీ, పులపుత్తూరు  
 
ఈనాడు ఎందుకు అలా రాసిందో..
ఫోటోలు తీసుకెళ్లి రాశారు... 
ప్రభుత్వం తరఫున ఇల్లు మంజూరయింది. ఇంటి నిర్మాణం జరుగుతోంది. పూర్తవతానే అందులోకి వెళతాము. ప్రభుత్వం అన్ని సౌకర్యాలను కల్పిస్తానంటోంది. ఇటీవల ఫోటోలు తీసుకుని వెళ్లారు. మేం ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పినట్లు రాశారు. మాకేమీ తెలీదు. మేమేం చెప్పలేదు. 
    – గీత, పులపత్తూరు 

అనలేని మాటల్ని రాశారు... 
పక్కా ఇళ్ల కోసం ప్రభుత్వం సాయం చేస్తోంది. సొంతంగా ఇంటి నిర్మాణం చేపట్టలేకపోతే, తామే కట్టిస్తామని ముందుకొచ్చింది. మా ఇల్లు కూడా అలాగే కడుతున్నారు. ముఖ్యమంత్రి మా గ్రామానికి వచ్చి ఏవైతే చెప్పారో అవన్నీ జరుగుతున్నాయి. ఆయన మాట నిలబెట్టుకోలేదని నేను అననే లేదు. కానీ ‘ఈనాడు’లో తప్పు రాశారు. 
–  రవి, పులపత్తూరు  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement