అన్నమయ్య ప్రాజెక్టు ఎందుకు తెగింది.. ఎలా రక్షించారు | Kadapa Collector Gave Details To YS Jagan About Annamayya Dam Breaks | Sakshi
Sakshi News home page

అన్నమయ్య ప్రాజెక్టు ఎందుకు తెగింది.. ఎలా రక్షించారు

Published Wed, Nov 24 2021 5:44 PM | Last Updated on Wed, Nov 24 2021 9:21 PM

Kadapa Collector Gave Details To YS Jagan About Annamayya Dam Breaks - Sakshi

సాక్షి, అమరావతి: అన్నమయ్య ప్రాజెక్టు ఎందుకు తెగింది.. జలప్రళయం నుంచి ఎలా రక్షించారు వంటి తదితర వివరాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి తెలిపారు కడప జిల్లా కలెక్టర్‌ వి.విజయరామరాజు. పింఛా, అన్నమయ్య ప్రాజెక్టుల్లో వరద, అనంతరం తీసుకున్న చర్యలను వీడియో కాన్ఫరెన్స్‌ సందర్భంగా సమగ్రంగా ముఖ్యమంత్రికి వివరించారు కలెక్టర్‌. ఆయన అందించిన వివరాలు ప్రకారం....

కడపజిల్లాలో భారీవర్షాలు, వరదలకు దారితీసిన పరిస్థితులు చాలా అనూహ్యమైనవి.
చరిత్రలో ఎప్పుడూ చూడని రీతిలో ఏకకాలంలో అతిభారీ వర్షాలు కురిశాయి.
జిల్లాలో ఒక ప్రాంతంలోనే కాదు, జిల్లావ్యాప్తంగా ఏక కాలంలో, అతి తక్కువ సమయంలో భారీ వర్షపాతం నమోదయ్యింది. 
నవంబర్‌  18వ తేదీ, గురువారం ఉదయం 8:30 గంటలకు పింఛ ప్రాజెక్టు ఇన్‌ఫ్లో కేవలం 3,845 క్యూసెక్కులు మాత్రమే.
కాని అదే రోజు సాయంత్రం 6 నుంచి 8:30 గంటల ప్రాంతంలో ఇన్‌ఫ్లో ఒకేసారి 90,464 క్యూసెక్కులకు చేరింది.
గురువారం ఉదయం 8 గంటలనుంచి శుక్రవారం ఉదయం వరకూ కడప జిల్లాలోని మొత్తం 50 మండలాల్లో కూడా సగటున 10.7  పెం.మీ వర్షపాతం కురిసిందంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థంచేసుకోవచ్చు.
దీనికితోడు తిరుపతి సహా చిత్తూరు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో... శేషాచల పర్వతశ్రేణికి వెనకవైపున కురిసిన భారీ వర్షాలు, వాటి వరదనీరు అంతా చెయ్యేరు పరీవాహక ప్రాంతానికి చేరుకుంది. 
మరోవైపు పీలేరులో, రాయచోటిలో కూడా అధిక వర్షం కురిసింది. ఇదంతా ఏకకాలంలో జరిగింది.
జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులు అయిన అన్నమయ్య, బుగ్గవంక, వెలిగల్లు, చిత్రావతి, మైలవరం, గండికోటలకు భారీగా నీరు వచ్చి చేరింది. 

గంటల వ్యవధిలోనే ఈపరిస్థితి తలెత్తింది
చెయ్యేరు నదిపై మొదట పింఛా ప్రాజెక్టు, దానికింద అన్నమయ్య ప్రాజెక్టు ఉంది. 
పింఛా డ్యాం విడుదల సామర్థ్యం కేవలం 48వేల క్యూసెక్కులు.
నవంబర్‌ 18వ తేదీ, గురువారం సాయంత్రం పింఛాకు 50వేల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉంది. అన్నమయ్య ప్రాజెక్టుకూ ఇదే స్థాయిలో ఇన్‌ఫ్లో కూడా ఉంది. 
ఇలాంటిది.. 18వ తేదీ అర్థకాత్రి పింఛా ప్రాజెక్టులో 1.17 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చింది. విడుదల సామర్థ్యం కన్నా రెండున్నర రెట్లు ఎక్కువ వరద నీరు వచ్చింది.
రింగ్‌బండ్‌ను ప్రొటెక్ట్‌చేసినా.. ఈ నీటిని అడ్డుకోలేని పరిస్థితి ఏర్పడింది. 
అదే రోజు రాత్రి 1 గంట సమయానికి అన్నమయ్యలో ఇన్‌ఫ్లో 2.3 లక్షలకు చేరుకుంది.
నవంబర్‌ 19, శుక్రవారం అన్నమయ్య ప్రాజెక్టులో ఇన్‌ఫ్లో ఉదయం 5:30 గంటలకు 3.2 లక్షలు దాటింది. 
పింఛా తెగిపోయి మొత్తం నీరంతా ఒకేసారి అన్నమయ్యకు రాడంతో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారింది.
అన్నమయ్య ప్రాజెక్టు విడుదల సామర్థ్యం 2.17 లక్షల క్యూసెక్కులు అయితే, 19వ తేదీ ఉదయం 3.2 లక్షలు దాటింది.  
అన్నమయ్య ప్రాజెక్టు కట్టిన 50 సంవత్సరాల తర్వాత ఇంత నీరు ఎప్పుడూ రాలేదు. 
కొన్ని గంటల వ్యవధిలోనే ఈపరిస్థితి తలెత్తింది. 

19 వ తేదీ ఉదయం 6:30 గంటల ప్రాంతంలో డ్యాం తెగిపోయింది
అధికారులు ముందస్తుగానే, 18వ తేదీ సాయంత్రం 6 గంటలకే మొత్తం జిల్లా యంత్రాంగం అంతా అప్రమత్తమయ్యింది. వాలంటీర్, వీఆర్వోలనుంచి మొత్తం అందర్నీ అలర్ట్‌ చేశారు. 
అన్నమయ్య కింద కుడి వైపు ఉన్న పుల్లపొత్తూరు, దిగుమందూరు, కేశాంబవరం, గండ్లూరు, హేమాద్రిపురం తదితర గ్రామాల ప్రజలకు ముందుగానే సమాచారం అందించారు. వీఆర్వోల ద్వారా, సర్పంచుల ద్వారా అక్కడున్నవారందర్నీ అప్రమత్తం చేశారు.
సుమారు 1250 కుటుంబాల్లోని ముంపు ప్రాంతాల్లో ఉన్నవారిని.. అప్రమత్తంచేశారు. 
లోతట్టులో ఉన్న సుమారు 400 కుటుంబాలను ఎత్తైనప్రాంతాలకు తరలించారు.
19 వ తేదీ ఉదయం 6:30 గంటల ప్రాంతంలో డ్యాం తెగిపోయింది.
18వ తేదీ సాయంత్రం నుంచి యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తూ ప్రజలను అప్రమత్తం చేసి, వందలమంది ప్రాణాలను కాపాడింది.

ఆ రెండు ఘటనల్లో సుమారు 20 మంది వరకూ మృతి, గల్లంతు
నందులూరు వద్ద బ్రిడ్జి పైనుంచి వెళ్తున్న 4 బస్సులు ముంపునకు గురయ్యాయి. వీటిలో ఒక బస్సు 20 మీటర్లు కింద పడింది. 10 మంది మృత్యువాత పడ్డారు. మిగిలిన బస్సుల్లో ఉన్న 45 మందిని ఎస్డీఆర్‌ఎఫ్‌ టీం కాపాడింది. 
అన్నమయ్య ప్రాజెక్టు దిగువన ఉన్న గ్రామంలో నది తీర ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న శివాలయంలో కొంతమంది పూజలు చేస్తూ పూజారి కుటుంబం ప్రమాదానికి గురయ్యింది. 
ఈ రెండు ఘటనల్లోనే సుమారు 20 మంది వరకూ మరణించడం, గల్లంతు కావడం జరిగింది. 
అధికార యంత్రాంగం అప్రమత్తత వల్లే వందలమంది ప్రాణాలు కాపాడగలిగారు.
అధికార యంత్రాంగం ముందస్తుగానే ప్రయత్నాలు చేయడంతో శుక్రవారం సాయంత్రానికల్లా హెలికాప్టర్లు చేరుకున్నాయి.
శనివారం ఉదయం నుంచి ముంపు గ్రామాలకు, తాగునీరు, ఆహారం అందించాం.

జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి తలెత్తింది. ఏకకాలంలో బుగ్గవంక, గండికోట, మైలవరం అన్నీ పూర్తిస్థాయిలో నీళ్లు వచ్చాయి.
ఒక్క బుగ్గ వంకనుంచే 30 వేల క్యూసెక్కుల నీరు వచ్చింది.
వెలిగల్లు నుంచి... పాపాఘ్నిలోకి 90 వేల క్యూసెక్కలు నీరు వచ్చింది.
అనంతపురం నుంచి చిత్రావతిద్వారా 80వేల క్యూసెక్కులకు వచ్చింది.
మైలవరం నుంచి 1.5 లక్షక్యూసెక్కుల నీరు వచ్చింది.
మొత్తం ఈ నీరంతా పెన్నాలోకి వచ్చింది.

సహాయక చర్యలు ఇలా సాగాయి
జిల్లాలో ఇతర ప్రాంతాల్లో వరద సహాయక చర్యలను చేపడుతూనే అన్నమయ్య ప్రాజెక్టు కింద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలను తీవ్రం చేశారు.
అన్నమయ్య డ్యాం తెగిన సుమారు 24 గంటల తర్వాత నీటి మట్టం తగ్గలేదు. 
ఈలోగా నేవీ, ఎయిర్‌ఫోర్స్‌ నుంచి హెలికాప్టర్లు తెప్పించుకున్నారు.
హెలికాప్టర్లు..., బోట్ల ద్వారా తాగునీరు, ఆహారాన్ని అందించారు. 
ఆవెంటనే వాలంటీర్లు నదీతీర ప్రాంతాల్లో ప్రతి ఇంటినీ పరిశీలించారు.
బాధిత కుటుంబాల్లో ఇంటికి చేరగానే.. ప్రతి ఒక్కరి వివరాలూ నమోదు చేసుకున్నారు. 
ఆవివరాలను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు అందించారు. 
అన్నమయ్య ప్రాజెక్టు కింద ప్రతిగ్రామానికీ ఒక డిప్యూటీ కలెక్టర్, ఇద్దరు తహశీల్దార్లు, ఇంజినీర్లు, ఇతర అధికారుల బృందాన్ని నియమించారు. 
జేసీబీలు, ఇతర యంత్రాలతో పారిశుద్ధ్యంతోపాటు, ఇతర పనులను చేపట్టి ఈ గ్రామాలలో సాధారణ స్థితిని తీసుకురాగలిగారు. 
మృతదేహాలు దొరికిన వారికి వెంటనే రూ.5 లక్షల పరిహారం ఇచ్చాం. రేషన్‌ సరుకులను, ముంపునకు గురైన కుటుంబాలకు రూ.2వేల చొప్పున అదనపు సహాయం అందించాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement