వరద బీభత్సం.. ఊరికి అండగా నిలబడిన సాహస వీరులు | Heavy Rains And Floods At Kadapa Some People Help Other | Sakshi
Sakshi News home page

వరద బీభత్సం.. ఊరికి అండగా నిలబడిన సాహస వీరులు

Published Tue, Dec 7 2021 11:05 AM | Last Updated on Tue, Dec 7 2021 4:25 PM

Heavy Rains And Floods At Kadapa Some People Help Other - Sakshi

సాక్షి, కడప: రాజంపేట నియోజకవర్గంలో అన్నమయ్య డ్యాం తెగి వరద సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు.. ఊళ్లకు ఊళ్లు కొట్టుకుపోయాయి.. పదుల సంఖ్యలో ప్రాణాలు నీళ్లలో కలిసిపోయాయి. ఆస్తులు కుప్పకూలాయి. ఆప్తులు చెల్లాచెదురయ్యారు..ఆ దృశ్యాన్ని తలుచుకుని గజగజ వణికిపోతున్నారు అక్కడి పల్లెజనం. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ కొందరు యువకులు తాము బతికి బయటపడితే చాలు అనుకోకుండా తెగువ చూపారు. నీళ్లలో చిక్కుకుని మృత్యుఒడికి చేరువయ్యే స్థితిలో ఉన్న వారిని సైతం కాపాడి ప్రాణం నిలిపారు. నవంబరు 19వ తేదీ ఉదయం 6.30 గంటల ప్రాంతంలో చెయ్యేరు వరద ఊరిపై పడి ఉరకలెత్తుతున్న సమయంలో రక్షణలో ఊరికి అండగా నిలబడిన సాహస వీరులను పలువురు అభినందిస్తున్నారు. 

ప్రాణాల మీద ఆశ వదలుకున్నా 
నా పేరు ఈశ్వరయ్య. మందపల్లె గ్రామం. వరద వచ్చిన రోజు  కార్తీక పౌర్ణమి కావడంతో దీపం వెలిగిద్దామని నా భార్య చెప్పడంతో పులపత్తూరు శివాలయానికి నేను, నా భార్య, నా తల్లి వెళ్లాము. అక్కడికి వెళ్లిన కొద్దిసేపటికే వరద ముంచెత్తింది. వెంటనే అక్కడున్న కల్యాణ మండపం పైకి పూజారి కుటుంబంతోపాటు మేము ఎక్కాం. ఆ వరద ఉధృతికి కల్యాణ మండపం కొట్టుకుపోవడంతో మేము నీటిలో చిక్కుకున్నాం. ఈ సమయంలో లోపల నీటిలో రాళ్లు, ఇంకా చెట్టు, ఏవేవో కాళ్లకు కోసుకుపోయాయి.

నాకు ఈత రావడంతో అలలతోపాటు కొట్టుకుపోతూ ఈదుతూ వచ్చాను. ఒక్కసారి అల ఎంతో ఎత్తుకు లేపి అలా ముంచేసింది. ఇక బతకను అనుకున్నా...కొంతదూరం వెళ్లాక అలలు తగ్గి ముఖం బయటికి రావడంతో నాకు ధైర్యం వచ్చింది. అప్పుడు ఈత కొట్టేశక్తి కూడా లేదు. చేతులు ఆడిస్తుండగా సమీపంలో మందపల్లె కనిపించడంతో ధైర్యం వచ్చింది. చిన్నగా మొద్దును పట్టుకుని ప్రాణాలతో బయటపడ్డాను. బతికినప్పటికీ కాళ్లకు బలమైన రాళ్ల దెబ్బలు తగలడంతో నరకం అనుభవిస్తున్నాను. నా కళ్ల ముందే నా భార్య, మా అమ్మ, పూజారి కుటుంబం కూడా కొట్టుకుపోవడం కళ్లలో మెదలుతోంది. సంఘటన తలుచుకుంటే నిద్ర పట్టడం లేదు...ఆహారం లోపలికి పోవడం లేదు. 

అందరినీ అప్రమత్తం చేస్తూ..  
పులపత్తూరు సర్పంచ్‌ శ్రీదేవమ్మ కుమారుడు బి.జగన్‌మోహన్‌రెడ్డి సరిగ్గా ఆరోజు ఉదయాన్నే పని నిమిత్తం రాజంపేటలో ఉన్నారు. అంతలోపే కట్ట తెగిందని ఫోన్‌ రావడంతో నేరుగా ఊరికి చేరుకున్న జగన్‌ ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా దళితవాడకు వెళ్లాడు. చెయ్యేరు నదికి ఆనుకుని గట్టున ఉన్న కాలనీలంతా ఒక్క ఉదుటున ఖాళీ చేయించాడు. ఇంతలో చెయ్యేరు ఉపద్రవం ఆయన్ను చుట్టుముట్టింది. పరుగెత్తి ఓ ఇంటి వద్ద రక్షణ పొందాడు. ఇంతలోనే వరద జగన్‌ కుటుంబ సభ్యుల్లో ముగ్గురిని పొట్టన పెట్టుకుంది. ఊరందరినీ రక్షించినా తన కుటుంబ సభ్యులు వరదలో కొట్టుకుపోవడంతో జగన్‌ కుటుంబంలో విషాదం నెలకొంది. ఆపద సమయంలో గ్రామ ప్రజలను అప్రమత్తం చేసి  రక్షించిన జగన్‌ను సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, అధికారులు అభినందించారు. 

పండుటాకును రక్షించేందుకు వెళ్లి..  
ఈ ఫొటోలో కనిపిస్తున్న యువకుల పేర్లు రామకృష్ణ, కార్తీక్, బి.శివకుమార్‌. ముగ్గురూ పులపత్తూరు గ్రామానికి చెందిన వారు. వరద ముంచెత్తిన సమయంలో చెయ్యేరు నదికి ఆనుకుని ఇంటిలో చిక్కుకున్న పండుటాకు సావిత్రమ్మను కాపాడేందుకు వెళ్లిన వీరు వరదలో చిక్కుకున్నారు. సావిత్రమ్మను అతికష్టంపై బయటికి తీసుకు వచ్చి ఒక ఇంటిలోకి పంపిస్తుండగా వరద పెరిగింది. అంతే...కార్తీక్‌ విద్యుత్‌ స్తంభం పైకి ఎక్కగా, రామకృష్ణ చెట్టుపైకి, శివకుమార్‌ ఇంటిపైకి ఎక్కాడు. అయితే విద్యుత్‌ స్తంభం మీద ఉన్న కార్తీక్‌ పట్టుతప్పితే నీటిలో పడిపోవడం ఖాయం. ఒక పక్క స్తంభం ఊగుతుంటే ఆ క్షణాల్లో అతను అనుభవించిన నరకం మాటల్లో చెప్పలేనిది. అలాగే రామకృష్ణ కూడా చెట్టుపైనే భయంభయంగా గడిపాడు. 

కొద్దిసేపటి తర్వాత వరద నీరు కొంచెం తగ్గగానే బయటపడ్డారు. అయితే అంతలోనే మరోసారి వచ్చిన అల ధాటికి కార్తీక్‌ ఎక్కిన విద్యుత్‌ స్తంభం పడిపోయింది. ఇలా వరద సమయంలో తమ ప్రాణాలు లెక్కచేయకుండా పండుటాకులను యువకులు కాపాడారు. రాజంపేట నియోజకవర్గంలో అన్నమయ్య డ్యాం తెగి వరద సృష్టించిన సునామీ అంతా ఇంతా కాదు.. ఊళ్లకు ఊళ్లు కొట్టుకుపోయాయి.. పదుల సంఖ్యలో ప్రాణాలు నీళ్లలో కలిసిపోయాయి. ఆస్తులు కుప్పకూలాయి. ఆప్తులు చెల్లాచెదురయ్యారు..ఆ దృశ్యాన్ని తలుచుకుని గజగజ వణికిపోతున్నారు అక్కడి పల్లెజనం. 

ఉప్పెనను ఎదిరించిన చిన్నోడు 
మందపల్లె గ్రామానికి చెందిన పూజారి కుటుంబంతోపాటు పులపత్తూరు గ్రామ శివాలయానికి వెళ్లిన వారిలో 15 ఏళ్ల చిన్నోడూ ఉన్నాడు. దిగువ మందపల్లెలో 10వ తరగతి చదువుతున్న కొర్రపాటి హేమంత్‌కుమార్, తండ్రి మల్లికార్జునతోపాటు 11 మంది నవంబరు 19న కార్తీక పౌర్ణమి సందర్భంగా శివాలయానికి వెళ్లారు. అయితే పూజలు నిర్వహిస్తుండగా వరద ఉప్పొంగి వస్తున్న  తీరును చూసి కుటుంబ సభ్యులంతా  కల్యాణ మండపం పైకి ఎక్కారు. తాను మాత్రం శివాలయం పైకి చేరుకున్నాడు. ఒక్కసారిగా ఎర్రటి నీటితో కూడిన అల ఉధృతంగా రావడంతో శివాలయం స్తంభాలు కూలిపోయాయి. అంతే అందరూ కొట్టుకుపోయారు. 

ఆ క్షణం అనుభవం ఆ చిన్నోడి మాటల్లోనే.. ‘మా నాన్న గట్టువైపు ముందుగానే బయటికి వెళ్లడంతో సేఫ్‌ అయ్యారు. నేను నీళ్లలో పడిపోయాను. చెయ్యేరు మధ్యలో 20 అడుగుల అల ఒక్కసారిగా పైకి లేపి లోపల ముంచేసింది. తర్వాత భయంభయంగా రెండు కిలోమీటర్లు నదిలోనే వెళ్లాను. పులపత్తూరు నుంచి మందపల్లెకు వెళ్లేటప్పుడు నది వరదలో నుంచి మిద్దెపైనున్న మా తాతయ్యను చూసి అరుస్తున్నా.. కానీ అందరూ ఉన్నా ఎవరికీ వినబడటం లేదు.

అక్కడి నుంచి ఒక కిలోమీటరు నదిలోనే కొట్టుకుపోయాను. పాపిరాజుపల్లె వద్ద ఒక మొద్దు దొరికింది. దాన్ని పట్టుకుని మరో కిలోమీటరు వెళ్లిన తర్వాత వరద మొద్దును తోసేసింది. దీంతో మొద్దుతోపాటు నేను ఒక చెరువులోకి వరద నీటిలో పోయాం. చెరువును చూడటానికి వచ్చిన గ్రామస్తులు నన్ను చూసి చిన్నగా తాళ్లువేసి బయటికి తీసుకు వచ్చారు’. 

ఉప్పెన విషయాన్ని ఊరూరా చెప్పిన రామయ్య 
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితోపాటు అన్నమయ్య కట్ట తెగుతుండడంతో రామయ్య ఊరూరికి ఫోన్‌ చేసి అప్రమత్తం చేశారు. 18వ తేదీ అర్ధరాత్రి ఒంటి గంట నుంచి 19వ తేదీ ఉదయం 7.00 గంటల వరకు పల్లెలకు ఫోన్‌ చేస్తూనే ఉన్నారు. అన్నమయ్య డ్యాం కింది భాగంలో రామయ్య నివసిస్తున్నారు. అంతకుమునుపు లస్కర్‌గా పనిచేస్తూ ఇటీవలి జూన్‌లో ఉద్యోగ విరమణ చేశారు.

కట్ట తెగే ప్రమాదముందని అర్ధరాత్రి చెప్పిన రామయ్య...తెల్లవారిన తర్వాత కట్ట తెగిందని, ఉధృతంగా వరద వస్తోందని,ఊరు విడిచి వెళ్లాలంటూ చాలామందికి ఫోన్‌ చేశాడు. తెలిసిన వారికి, బంధువులకు, పల్లె జనాలకు చెప్పాలని ప్రయతి్నంచాడు.  చాలామందికి ఫోన్‌ చేసి ఆపద విషయం తెలియజేయడంతో రామయ్య మాట  వారికి దేవుడి మాటగా మారింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement