అభినవ అన్నమయ్య పద్మశ్రీ ‘శోభారాజు’ 40 ఏళ్ల సంకీర్తనా ప్రయాణం  | Padma Shri Dr Shobha Raju Annamacharya Keerthanalu 40 Years Journey | Sakshi
Sakshi News home page

అభినవ అన్నమయ్య పద్మశ్రీ ‘శోభారాజు’ 40 ఏళ్ల సంకీర్తనా ప్రయాణం 

Published Tue, Nov 29 2022 4:25 PM | Last Updated on Tue, Nov 29 2022 4:25 PM

Padma Shri Dr Shobha Raju Annamacharya Keerthanalu 40 Years Journey - Sakshi

సాక్షి, హైదరాబాద్: తిరుపతి వేదికగా 1978లో ఒక గొంతుక ‘అదివో అల్లదిహో’ అనే పాటను తొలి సారిగా ఆలపించింది. ఆ గానంతో యావత్‌ తెలుగు జాతి అంతా ఒక్క సారిగా అన్నమయ్య సంకీర్తనల పై దృష్టిసారించింది. తెలుగు ప్రజలు ‘అభినవ అన్నమయ్య’గా పిలుచుకునే శోభారాజుది ఆ స్వరం. అన్నమయ్య సంకీర్తనలను విశ్వవ్యాప్తం చేయడానికి తన జీవితాన్నే అంకితం చేసి, భక్తి సంగీతం ద్వారా భావ కాలుష్య నివారణ అనే ధ్యేయంతో 1983లో ‘అన్నమాచార్య భావనా వాహిని’ స్థాపించింది. మాదాపూర్‌ వేదికగా ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం కొంత స్థలాన్ని కేటాయించగా అక్కడ అన్నమయ్యపురాన్ని నిర్మించి సంకీర్తన, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆమె నిబద్ధత, కృషికి ఫలితంగా భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. ఇలాంటి విశేష సేవలందిస్తున్న ‘అన్నమాచార్య భావనా వాహిని’ ఈ నెల 30న 40 వసంతాలకు చేరువ కానుంది. 

అన్నమయ్య సంకీర్తనా ప్రచారానికి తొలి కళాకారిణిగా.. 
సినిమాలకు పాటలు పాడాలనే కలలు కన్న శోభారా జు భవిష్యత్‌ కాలంలో అన్నమయ్య సంకీర్తనలకు ముగ్దురాలై, కేవలం అన్నమయ్య రచనలు, సంకీర్తనల ను తెలుగు ప్రజలకు దగ్గర చేయడమే లక్ష్యంగా మా ర్చుకుంది. నేదునూరి కృష్ణమూర్తి తదితర మహా విద్వాంసుల వద్ద శాస్త్రీయ సంగీతంలో ప్రావీణ్యం సాధించి, 1976లో తిరుమల తిరుపతి దేవస్థాన ‘అన్నమాచార్య ప్రాజెక్ట్‌’లో తొలి కళాకారిణిగా స్కాల ర్‌ షిప్‌ అందుకున్నారు. ఆమె  అంకితభావమే తిరుమ ల తిరుపతి క్షేత్రంగా అన్నమయ్య సంకీర్తనా ప్రచారానికి శోభారాజును తొలి కళాకారిణిగా నియమించేలా చేసింది. 

1978లో టీటీడీ తొలి సారిగా నిర్వహించిన అన్నమయ్య జయంతి ఉత్సవంలో శోభారాజు స్వయంగా తాను రూపొందించిన ‘అన్నమయ్య కథ’ అనే  సంగీత రూపకాన్ని అన్నమయ్యకు తొలి కానుకగా సమర్పించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్నమయ్యకు సంబంధించి ఏ విషయం కావాలన్నా తన కళా రూపమే మాతృకగా నిలుస్తుంది. ఆమె ఆలపించిన ‘కొండలలో నెలకొన్న’, ‘చాలదా హరినామ సౌఖ్యామృతము’, ‘గోవిందాశ్రిత గోకులబృంద’, ‘ఏమొకో చిగురటధరమున’, ‘శిరుత నవ్వులవాడు శినెక’, ‘కులుకక నడువరో’ తదితర సంకీర్తనల ఆల్బమ్‌లు ప్రతి తెలుగు ఇంటా మారు మోగాయి.  

జీవితమంతా సంకీర్తనం... 
1983 నుంచి హైదరాబాద్‌ వేదికగా తను నిర్వహించిన కార్యక్రమాలు తన జీవితానికి పరమార్థంగా నిలిచాయని ఆమె తెలిపారు. దేశ విదేశాల్లో ఇప్పటి వరకు 20 వేలకు పైగా ఔత్సాహికులకు అన్నమయ్య సంకీర్తనలు నేర్పారని, ఆరు వేలకు పైగా సంకీర్తనా కచ్చేరీలు ఏర్పాటు చేశానని అన్నారు. మానసికంగా సాంత్వన చేకూర్చాలనే లక్ష్యంతో ‘ఉపశమన సంకీర్తన’ కార్యక్రమాన్ని ప్రారంభించి చంచల్‌ గూడ జైల్లో 1200 ఖైదీలకు సంకీర్తనా సేవలందించినట్లు తెలిపారు. అనారోగ్య సమయంలో సంగీతం, సాహిత్యం కోలుకునేలా చేస్తుందని నిజామ్స్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ ఆసుపత్రిలో ‘సంకీర్తనౌషధం’ పేర నాద చికిత్సా కార్యక్రమాన్ని, ఏటా ‘నాద బ్రహోత్సవ్‌’ పేర నవరాత్రులలో కళాకారులతో అనేక కార్యక్రమాలను నిర్వహించి కళలను ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. 

అన్నమయ్య కృషిని భారత ప్రభుత్వానికి తెలియజేసి 2004లో అన్నమయ్య తపాలా బిళ్లను విడుదలయ్యేలా చేశానన్నారు. అన్నమయ్య పైన తన పరిశోధనలో భాగంగా ఇప్పటి వరకు చాలా మందికి తెలియని 39 అన్నమయ్య సంకీర్తనలను తంజావూరు సరస్వతీ మహల్‌ లైబ్రరీ నుంచి సేకరించి ‘అన్నమయ్య గుప్త సంకీర్తనాధనం’ అనే పుస్తకంగా ప్రచురించాం. దూరదర్శన్‌ సహకారంతో రచన, స్క్రీన్‌ ప్లే, సంభాషణలు, సంగీతం సమకూర్చి దర్శకత్వం వహించిన ‘శ్రీ అన్నమాచార్య’ టెలీ సీరియల్‌ను కూడా రూపొందించామన్నారు. తమ క్షేత్రంలో అన్నమయ్య జయంతి, వర్థంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. అన్నమయ్య, వేంకటేశ్వర స్వామి ఇద్దరికి కలిపి ఒకే ఆలయాన్ని నిర్మించి అన్నమయ్య పురంగా తయారు చేశానని, దేశ ప్రధాన మంత్రులు పీవీ, వాజ్‌ పాయి, ముఖ్యమంత్రులు నీలం సంజీవరెడ్డి, రామారావు, రాజశేఖర్‌ రెడ్డితో పాటు ఎంఎస్‌ సుబ్బు లక్ష్మి , ఏఎన్నార్‌ తదితర ప్రముఖులు సందర్శించారన్నారు.  

వైఎస్‌ది కళా హృదయం.. 
తన కృషికి గుర్తించిన స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి తనకు తెలియకుండానే రాష్ట్రం నుంచి పద్మశ్రీ అవార్డుకు సిఫారసు చేశారని తెలిపారు. కళలకు, కళాకారులకు వైఎస్‌ అందించిన గౌరవం ప్రత్యేకమైనదని ఆమె కొనియాడారు. అమెరికా, కెన్యా, మలేషియా తదితర దేశాల్లో నిర్వహించిన సంకీర్తనా కార్యక్రమాలకు గాను ఎన్నో అవార్డు, డాక్టరేట్‌లు, బిరుదులు పాందానని, తానా ఆధ్వర్యంలో అన్నమయ్య పదకోకిల బిరుదు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్‌ అందుకున్నట్లు ఆమె వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement