annamacharya
-
అభినవ అన్నమయ్య పద్మశ్రీ ‘శోభారాజు’ 40 ఏళ్ల సంకీర్తనా ప్రయాణం
సాక్షి, హైదరాబాద్: తిరుపతి వేదికగా 1978లో ఒక గొంతుక ‘అదివో అల్లదిహో’ అనే పాటను తొలి సారిగా ఆలపించింది. ఆ గానంతో యావత్ తెలుగు జాతి అంతా ఒక్క సారిగా అన్నమయ్య సంకీర్తనల పై దృష్టిసారించింది. తెలుగు ప్రజలు ‘అభినవ అన్నమయ్య’గా పిలుచుకునే శోభారాజుది ఆ స్వరం. అన్నమయ్య సంకీర్తనలను విశ్వవ్యాప్తం చేయడానికి తన జీవితాన్నే అంకితం చేసి, భక్తి సంగీతం ద్వారా భావ కాలుష్య నివారణ అనే ధ్యేయంతో 1983లో ‘అన్నమాచార్య భావనా వాహిని’ స్థాపించింది. మాదాపూర్ వేదికగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కొంత స్థలాన్ని కేటాయించగా అక్కడ అన్నమయ్యపురాన్ని నిర్మించి సంకీర్తన, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆమె నిబద్ధత, కృషికి ఫలితంగా భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. ఇలాంటి విశేష సేవలందిస్తున్న ‘అన్నమాచార్య భావనా వాహిని’ ఈ నెల 30న 40 వసంతాలకు చేరువ కానుంది. అన్నమయ్య సంకీర్తనా ప్రచారానికి తొలి కళాకారిణిగా.. సినిమాలకు పాటలు పాడాలనే కలలు కన్న శోభారా జు భవిష్యత్ కాలంలో అన్నమయ్య సంకీర్తనలకు ముగ్దురాలై, కేవలం అన్నమయ్య రచనలు, సంకీర్తనల ను తెలుగు ప్రజలకు దగ్గర చేయడమే లక్ష్యంగా మా ర్చుకుంది. నేదునూరి కృష్ణమూర్తి తదితర మహా విద్వాంసుల వద్ద శాస్త్రీయ సంగీతంలో ప్రావీణ్యం సాధించి, 1976లో తిరుమల తిరుపతి దేవస్థాన ‘అన్నమాచార్య ప్రాజెక్ట్’లో తొలి కళాకారిణిగా స్కాల ర్ షిప్ అందుకున్నారు. ఆమె అంకితభావమే తిరుమ ల తిరుపతి క్షేత్రంగా అన్నమయ్య సంకీర్తనా ప్రచారానికి శోభారాజును తొలి కళాకారిణిగా నియమించేలా చేసింది. 1978లో టీటీడీ తొలి సారిగా నిర్వహించిన అన్నమయ్య జయంతి ఉత్సవంలో శోభారాజు స్వయంగా తాను రూపొందించిన ‘అన్నమయ్య కథ’ అనే సంగీత రూపకాన్ని అన్నమయ్యకు తొలి కానుకగా సమర్పించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అన్నమయ్యకు సంబంధించి ఏ విషయం కావాలన్నా తన కళా రూపమే మాతృకగా నిలుస్తుంది. ఆమె ఆలపించిన ‘కొండలలో నెలకొన్న’, ‘చాలదా హరినామ సౌఖ్యామృతము’, ‘గోవిందాశ్రిత గోకులబృంద’, ‘ఏమొకో చిగురటధరమున’, ‘శిరుత నవ్వులవాడు శినెక’, ‘కులుకక నడువరో’ తదితర సంకీర్తనల ఆల్బమ్‌లు ప్రతి తెలుగు ఇంటా మారు మోగాయి. జీవితమంతా సంకీర్తనం... 1983 నుంచి హైదరాబాద్ వేదికగా తను నిర్వహించిన కార్యక్రమాలు తన జీవితానికి పరమార్థంగా నిలిచాయని ఆమె తెలిపారు. దేశ విదేశాల్లో ఇప్పటి వరకు 20 వేలకు పైగా ఔత్సాహికులకు అన్నమయ్య సంకీర్తనలు నేర్పారని, ఆరు వేలకు పైగా సంకీర్తనా కచ్చేరీలు ఏర్పాటు చేశానని అన్నారు. మానసికంగా సాంత్వన చేకూర్చాలనే లక్ష్యంతో ‘ఉపశమన సంకీర్తన’ కార్యక్రమాన్ని ప్రారంభించి చంచల్ గూడ జైల్లో 1200 ఖైదీలకు సంకీర్తనా సేవలందించినట్లు తెలిపారు. అనారోగ్య సమయంలో సంగీతం, సాహిత్యం కోలుకునేలా చేస్తుందని నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలో ‘సంకీర్తనౌషధం’ పేర నాద చికిత్సా కార్యక్రమాన్ని, ఏటా ‘నాద బ్రహోత్సవ్’ పేర నవరాత్రులలో కళాకారులతో అనేక కార్యక్రమాలను నిర్వహించి కళలను ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. అన్నమయ్య కృషిని భారత ప్రభుత్వానికి తెలియజేసి 2004లో అన్నమయ్య తపాలా బిళ్లను విడుదలయ్యేలా చేశానన్నారు. అన్నమయ్య పైన తన పరిశోధనలో భాగంగా ఇప్పటి వరకు చాలా మందికి తెలియని 39 అన్నమయ్య సంకీర్తనలను తంజావూరు సరస్వతీ మహల్ లైబ్రరీ నుంచి సేకరించి ‘అన్నమయ్య గుప్త సంకీర్తనాధనం’ అనే పుస్తకంగా ప్రచురించాం. దూరదర్శన్ సహకారంతో రచన, స్క్రీన్ ప్లే, సంభాషణలు, సంగీతం సమకూర్చి దర్శకత్వం వహించిన ‘శ్రీ అన్నమాచార్య’ టెలీ సీరియల్‌ను కూడా రూపొందించామన్నారు. తమ క్షేత్రంలో అన్నమయ్య జయంతి, వర్థంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని అన్నారు. అన్నమయ్య, వేంకటేశ్వర స్వామి ఇద్దరికి కలిపి ఒకే ఆలయాన్ని నిర్మించి అన్నమయ్య పురంగా తయారు చేశానని, దేశ ప్రధాన మంత్రులు పీవీ, వాజ్ పాయి, ముఖ్యమంత్రులు నీలం సంజీవరెడ్డి, రామారావు, రాజశేఖర్ రెడ్డితో పాటు ఎంఎస్ సుబ్బు లక్ష్మి , ఏఎన్నార్ తదితర ప్రముఖులు సందర్శించారన్నారు. వైఎస్‌ది కళా హృదయం.. తన కృషికి గుర్తించిన స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనకు తెలియకుండానే రాష్ట్రం నుంచి పద్మశ్రీ అవార్డుకు సిఫారసు చేశారని తెలిపారు. కళలకు, కళాకారులకు వైఎస్ అందించిన గౌరవం ప్రత్యేకమైనదని ఆమె కొనియాడారు. అమెరికా, కెన్యా, మలేషియా తదితర దేశాల్లో నిర్వహించిన సంకీర్తనా కార్యక్రమాలకు గాను ఎన్నో అవార్డు, డాక్టరేట్లు, బిరుదులు పాందానని, తానా ఆధ్వర్యంలో అన్నమయ్య పదకోకిల బిరుదు, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నట్లు ఆమె వివరించారు. -
అన్నమాచార్య ప్రాజెక్ట్ రూపకర్త కన్నుమూత
సాక్షి, వైఎస్సార్ జిల్లా: అన్నమాచార్య ప్రాజెక్టు వ్యవస్థాపక సంచాలకులు కామిశెట్టి శ్రీనివాసులు శనివారం కన్నుమూశారు. కడప జిల్లాకు చెందిన డాక్టర్ కామిశెట్టి శ్రీనివాసులు, అన్నమాచార్య కీర్తనలపై విశేష పరిశోధనలు చేశారు. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు తొలి సంచాలకులుగా కామిశెట్టి పని చేశారు. ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్ట్ తొలి డైరెక్టర్‌గా కూడా కామిశెట్టి సేవలంధించారు. ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారితో శ్రీ వెంకటేశ్వర పంచరత్న మాలికను కామిశెట్టి శ్రీనివాసులు రూపొందించారు. మరోవైపు అమెరికాలో అన్నమయ్య కీర్తనలకు విశేష ప్రాచుర్యాన్ని కల్పించడంలో కామిశెట్టి శ్రీనివాసులు ఎంతో కృషి చేశారు. -
నీ వెనుక రావడానికి ఆయనెప్పుడూ సిద్ధమే!
‘నీవు వటువువా! గృహస్థువా! సన్యాసివా! యతివా! ఎవరికి కావాలి ? నీ హృదయ పద్మాన్ని తీసి పరమేశ్వరుడి పాదాల దగ్గర పెట్టావా, లేదా! అలా పెడితే నీ వెంట పరిగెతి రావడానికి పరమేశ్వరుడు సిద్ధంగా ఉన్నాడు.’’ అంటారు శంకరాచార్యుల వారు శివానంద లహరిలో. అన్నమాచార్యుల వారు అదే భావనతో కీర్తన చేస్తూ..‘‘కుమ్మర దాసుడైన కురువరతినంబి రమ్మన్న చోటికి వచ్చి అంతగా కోర్కె తీర్చినవాడివే’’ అంటూ తరువాత చరణంలో ‘‘దొమ్ములు సేసినయట్టి తొండమాన్ చక్కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు’’ అంటారు. ఈ తొండమాన్ చక్రవర్తి ఎవరు ?పూర్వకాలంలో సుధర్మడునే రాజు ఉండేవాడు. ఆయన కపిలతీర్థం దగ్గరికి వచ్చారు. అక్కడ స్నానాలు చేస్తున్న సమయంలో పాతాళ లోకాన్ని పరిపాలించే ధనంజయుడనే నాగలోకపు ప్రభువు కుమార్తె అక్కడ జలకాలాడుతూ కనపడింది. ఆమె అంగీకారంతో ఆయన ఆమెను గాంధర్వ వివాహం చేసుకున్నాడు. వారు కొంతకాలం అక్కడ ఉన్న దొండపొదలలో విహరించారు. ఆమె గర్భందాల్చి పుట్టింటికి వెడుతుంటే..‘‘నీకు కుమారుడు కలిగి పెద్దయిన తరువాత వాడిని నా దగ్గరికి పంపేటప్పుడు నేను గుర్తుపట్టడానికి వీలుగా దొండ తీగలను నడుముకు చుట్టుకుని ఈ రాజముద్రికను వేలికి పెట్టుకుని రమ్మనమను. అలా వస్తే నేను సులభంగా గుర్తుపడతాను’’ అని ఉంగరం ఇచ్చి ఆమెకు అభయం ఇస్తాడు. ఆమె తరువాత అలాగే సుధర్ముడి వద్దకు పంపింది. నడుముకి దొండతీగలు చుట్టుకుని వచ్చాడు కనుక ఆయనకు తొండమాన్ అని పేరొచ్చింది. (తొండమాన్ తవ్వించిన చెరువు ఇప్పటికీ ఉంది. ఈయన వేంకటేశ్వరుడి మామగారయిన ఆకాశరాజుకు సోదరుడు. ఇద్దరికీ సమానమైన రాజ్యభాగం ఇచ్చారు). తొండమాన్ జీవితంలో ఒక పొరబాటు చేసాడు. ఒకరోజు కూర్ముడు అనే బ్రాహ్మణుడు ఆయన దగ్గరకు వచ్చి‘మా తండ్రిగారి అస్థికలు గంగలో నిమజ్జనం చేయడానికి కాలినడకన కాశీకి వెడుతున్నాను. నాభార్య గర్భిణి, కొడుకు ఐదేళ్ళవాడు, ఎక్కువ దూరం నడవలేడు. నేను తిరిగొచ్చేదాకా వారి ఆలనాపాలనా మీరు చూడాలి’ అని కోరగా సమ్మతించిన తొండమాన్ వారిని కట్టుదిట్టమైన ఏర్పాట్లతో ఒక భవంతిలో ఉంచి తదనంతరకాలంలో మర్చిపోయాడు. కొంతకాలానికి అక్కడ వారికి ఆహార పదార్థాలు అయిపోయాయి. మరికొంతకాలానికి కూర్ముడు తిరిగొచ్చి తన భార్యబిడ్డలని అప్పగించమని కోరతాడు. అప్పడు వారి విషయం గుర్తొచ్చి మొదట భయపడినా ‘‘వారు స్వామి దర్శనానికి వేంకటాచలం వెళ్ళారు. వచ్చేస్తారు. అప్పటిదాకా సత్రంలో ఉండండి భోజన సంభారాలు ఏర్పాటు చేయిస్తాను’ అని చెప్పి పంపుతాడు. తొండమాన్ వెంటనే తన కుమారుడిని పంపి వాళ్ళకోసం వాకబు చేయించాడు. వెళ్ళినవాడు తిరిగొచ్చి ‘‘ఆహారం లేక వారు మరణించారు. అక్కడ అస్థిపంజరాలు పడి ఉన్నాయి’’ అన్నాడు. భయపడిపోయిన తొండమాన్ ఆనంద నిలయానికి పరుగున వెళ్ళి స్వామి పాదాలను ఆశ్రయించాడు. తన భక్తుడివై, రాజువై ఉండి మాట ఇచ్చి తప్పి ఇంతటి ఘాతుకానికి కారణమయ్యావు. అయినా రక్షిస్తా. అస్థి తీర్థంలో(ఇప్పటికీ ఉంది) నేను మెడలోతు నీళ్ళలో మునిగి ఉంటా. వెంటనే వెళ్ళి అస్తికలు తెచ్చి ఒడ్డున పెట్టి ఆ తీర్థం నీళ్ళతో ప్రోక్షణ చెయ్యి.’’ అని ఆదేశించాడు. ఆ తరువాత వాళ్ళు బతికారు.అప్పటివరకు భక్తులతో మాట్లాడుతుండే స్వామివారు ‘ఈనాటినుంచి నేనిక మాట్లాడను. నేనేదయినా చెప్పవలసి వస్తే అర్చకులమీద ఆవహించికానీ, మరో రూపంలో కానీ నా మనోగతాన్ని తెలియచేస్తాను’ అని ప్రకటించారని చెబుతారు. -
పదివేల చేతుల పడగలమయం
‘కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు...’, ‘అదివో అల్లదివో శ్రీహరి వాసమూ...’ వంటి కీర్తనలు వినని తెలుగువారుండరు, అలాగే అన్నమయ్య పేరు కూడా. దేశంలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో, మరీ ముఖ్యంగా తెలుగునాట... జీవితంలో ఎవరికి ఏ కష్టమొచ్చినా ఏ దేవుడిని తలచుకుంటారో ఆయనతో జీవితమంతా పెనవేసుకుపోయిన వాడు పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమాచార్యులు. కడప జిల్లా, రాజంపేట తాలూకా, తాళ్ళపాక గ్రామవాసులయిన నారాయణ సూరి, లక్కమాంబల కుమారుడే అన్నమయ్య. తండ్రి మహాపండితుడు. దంపతులిద్దరూ చెన్నకేశవ స్వామి, వేంకటాచలపతి భక్తులు. నారాయణ సూరి భార్యను కూర్చోపెట్టుకుని కావ్యాలు చెబుతుండేవాడు. మహాభక్తుల స్థితి అలా ఉంటుంది. సమాజంలో సంస్కారం అనేది కుటుంబ యజమాని నుండే ప్రారంభం కావాలి. సుప్రసిద్ధ రచయిత వాకాటిపాండురంగారావు గారు గతంలో ‘దిక్సూచి’ అనే వ్యాసంలో– ‘‘సినిమాకు కుటుంబంతోసహా వెళ్ళడానికి త్వరపడుతున్న సమయంలో పిల్లవాడు వచ్చి తండ్రి చేయి పట్టుకుని నాన్నగారూ, ఇంద్ర ధనుస్సు అంటే ఏమిటండీ’ అని అడిగితే... పట్టించుకోకుండా సినిమాకు పరుగులు తీసే తండ్రి ఈ జాతికి పెద్ద బరువు’ అని రాసారు. అందుకే సంస్కారం అనేది ఇంటి యజమాని దగ్గర ప్రారంభం కావాలని అనేది. నారాయణ సూరి భార్యను కూర్చోబెట్టుకుని తనకి తెలిసున్నవి అన్నీ చెబుతుండేవాడు. దోగాడుతూ(పారాడుతూ) తిరిగే వయసులో అన్నమయ్యకి ఈ సంభాషణ ఎంతవరకు అర్థమయ్యేదో తెలియదు కానీ, అక్కడ చేరి ఊ కొడుతుండేవాడట. కొద్దిగా పెద్దవాడవుతున్నాడు అన్నమయ్య. పెద్దవాళ్ళు పసిపిల్లలని కూర్చోబెట్టుకుని రెండు చేతులెత్తించి ‘గోవిందా’ అంటూ ఆడిస్తుంటాం కదా. అన్నమయ్య తన తోటిపిల్లలతోకూడా చేతులెత్తించి గోవిందా అనిపిస్తూ, తాను స్వయంగా పాటలు పాడుతూ, వాటికి తగ్గట్టుగా అడుగులు వేస్తూ, తోచినట్లుగా నాట్యం చేస్తూ తిరుగుతూ ఉండేవాడట. వారిది ఉమ్మడి కుటుంబం. ఉమ్మడిగా ఉంటున్నప్పుడు సహజంగా ఏవో అప్పుడప్పుడు మాటలు, పట్టింపులు వస్తుంటాయి. ‘ఇలా గాలికి తిరుగుతున్నాడు, ఒక్కనాడూ ఏ ఒక్క పనీ చేయడు. దానికి తోడు చేతిలో ఆ తుంబుర ఒకటి....’ అంటూ పశువులకు మేతకోసం ఊరి బయటికి వెళ్ళి గడ్డికోసుకు వస్తుండమన్నారు. అలా వెళ్ళి గడ్డికోసే క్రమంలో ఓ రోజున కొడవలి తగిలి చిటికెన వేలు తెగింది. రక్తం కారుతోంది. ‘అమ్మా !..’ అని అరుస్తూ ఆ వేలు పట్టుకుని దిక్కులు చూస్తున్నాడు. అల్లంత దూరంలో భాగవతుల బృందం ఒకటి గోవింద నామస్మరణ చేస్తూ వెడుతున్నది.అన్నమయ్య ఒక్కసారి తన గ్రామం వంక చూసాడు. ఈ గడ్డికోయడానికి, ఈ పశువుల వెంట తిరగడానికా ఈ జన్మ?’ అనిపించిందేమో...అయినా వైరాగ్యం ఎంతలో రావాలి కనుక! ఆ గోవిందుడిని చేరుకోవడానికి ఆ బృందం వెంట వెళ్ళిపోయాడు. కొండ ఎక్కుతున్నాడు. చుట్టూ చాలా కొండలు... ‘శ్రీహరి వాసం, పదివేల చేతుల పడగలమయం’లా కనిపించింది. ఎక్కలేక సొమ్మసిల్లి పడిపోయాడు. పద్మావతీ దేవి ఒడిలో కూర్చోబెట్టుకుని సేదదీరుస్తున్నట్లు అనిపించసాగింది.‘ఈ చెట్లు, పుట్టలు, పొదలు ఎన్నో జన్మలు తపస్సు చేసిన మహర్షులవి, సిద్ద పురుషులవి. ఈ రాళ్ళన్నీ సాలగ్రామాలే...ఎటు చూసినా ఓం నమో నారాయణాయ.. అంటూ తపస్సు చేస్తున్నవారే...’’ అని తనకి చెబుతున్నట్లు అనిపించసాగింది. వెంటనే అప్రయత్నంగా అమ్మవారి మీద దండకం చెప్పేసాడు. -
ఆధ్యాత్మిక కీర్తనలతో దురాలోచనలు దూరం
అన్నమాచార్య భావనావాహిని వ్యవస్థాపకురాలు శోభారాజ్ ద్వారకాతిరుమల : ఆధ్యాత్మిక కీర్తనలు వినడం వల్ల దురాలోచనలు దరిచేరవని అన్నమాచార్య భావనావాహిని(ఏబీవీ) వ్యవస్థాపకురాలు, పద్మశ్రీ డాక్టర్ శోభారాజ్ అన్నారు. శ్రీవారి క్షేత్రంలో జరుగుతున్న అన్నమయ్య వార్షికోత్సవాల ముగింపు సందర్భంగా ఆమె భక్తులనుద్దేశించి మాట్లాడారు. తాను స్థాపించిన అన్నమాచార్య భావనావాహిని ముఖ్య ఉద్దేశం మానవుడిని దైవారాధన వైపు మళ్లించమేనని పేర్కొన్నారు. ఏబీవీ ద్వారా ఎంతో మందికి కీర్తనలతో పాటు యోగా, ధ్యానం, నేచ్యురోపతి, తత్వశాస్త్రం వంటి అంశాల్లో శిక్షణ ఇచ్చినట్టు వివరించారు. అనంతరం ఆమె ఆలయంలోని అన్నమాచార్యుని విగ్రహానికి ఆలయ చైర్మన్ ఎస్వీ.సుధాకరరావు, దాత పి.పి.రాజుతో కలసి పూలమాలలు వేశారు. అనంతరం కీర్తనలను ఆలపించారు. ఇవి భక్తులను పరవశింపజేశాయి. ఆకట్టుకున్న ’శృతి’ కీర్తనలు శ్రీనివాస కల్యాణాన్ని వివరిస్తూ న్యూస్ రీడర్, యాంకర్ శృతికీర్తి ఆలపించిన కీర్తనలు ఆద్యంతం భక్తులను ఆకట్టుకున్నాయి. అన్నమాచార్య వార్షికోత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం సాయంత్రం ఆమె శ్రీవారి క్షేత్రాన్ని సందర్శించారు. శ్రీహరి కళాతోరణ వేదికపై శ్రీనివాస కల్యాణాన్ని కీర్తనల రూపంలో ఆలపించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఎస్వీ సుధాకరరావు, డాక్టర్ శోభారాజ్, పి.పి.రాజు తదితరులు పాల్గొన్నారు.