ఆధ్యాత్మిక కీర్తనలతో దురాలోచనలు దూరం
అన్నమాచార్య భావనావాహిని వ్యవస్థాపకురాలు శోభారాజ్
ద్వారకాతిరుమల : ఆధ్యాత్మిక కీర్తనలు వినడం వల్ల దురాలోచనలు దరిచేరవని అన్నమాచార్య భావనావాహిని(ఏబీవీ) వ్యవస్థాపకురాలు, పద్మశ్రీ డాక్టర్ శోభారాజ్ అన్నారు. శ్రీవారి క్షేత్రంలో జరుగుతున్న అన్నమయ్య వార్షికోత్సవాల ముగింపు సందర్భంగా ఆమె భక్తులనుద్దేశించి మాట్లాడారు. తాను స్థాపించిన అన్నమాచార్య భావనావాహిని ముఖ్య ఉద్దేశం మానవుడిని దైవారాధన వైపు మళ్లించమేనని పేర్కొన్నారు. ఏబీవీ ద్వారా ఎంతో మందికి కీర్తనలతో పాటు యోగా, ధ్యానం, నేచ్యురోపతి, తత్వశాస్త్రం వంటి అంశాల్లో శిక్షణ ఇచ్చినట్టు వివరించారు. అనంతరం ఆమె ఆలయంలోని అన్నమాచార్యుని విగ్రహానికి ఆలయ చైర్మన్ ఎస్వీ.సుధాకరరావు, దాత పి.పి.రాజుతో కలసి పూలమాలలు వేశారు. అనంతరం కీర్తనలను ఆలపించారు. ఇవి భక్తులను పరవశింపజేశాయి.
ఆకట్టుకున్న ’శృతి’ కీర్తనలు
శ్రీనివాస కల్యాణాన్ని వివరిస్తూ న్యూస్ రీడర్, యాంకర్ శృతికీర్తి ఆలపించిన కీర్తనలు ఆద్యంతం భక్తులను ఆకట్టుకున్నాయి. అన్నమాచార్య వార్షికోత్సవాల ముగింపు సందర్భంగా ఆదివారం సాయంత్రం ఆమె శ్రీవారి క్షేత్రాన్ని సందర్శించారు. శ్రీహరి కళాతోరణ వేదికపై శ్రీనివాస కల్యాణాన్ని కీర్తనల రూపంలో ఆలపించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఎస్వీ సుధాకరరావు, డాక్టర్ శోభారాజ్, పి.పి.రాజు తదితరులు పాల్గొన్నారు.