ద్వారకాతిరుమల: పెద్ద పులి.. కొద్ది రోజులుగా తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో సంచరిస్తూ ప్రజలను భయకంపితులను చేస్తోంది. తాజాగా మంగళవారం తెల్లవారుజామున ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం రామసింగవరం పంచాయతీ, కొత్తగూడెంలోకి వచ్చిన పెద్ద పులి ఒక దూడను చంపి తినేసింది. వివరాల్లోకి వెళితే.. కొత్తగూడెం గ్రామానికి చెందిన రైతు ముక్కవల్లి బాలసుందరం గేదెల నుంచి పాలు తీసేందుకు తెల్లవారుజామున తన తోటలోకి వెళ్లాడు.
అక్కడ కట్టేసి ఉన్న గేదెలు, దూడలు బెదిరిపోయి అరుస్తుండడాన్ని గమనించాడు. వాటిలో ఒక గేదె దూడ లేకపోవడాన్ని గుర్తించాడు. దూడ కోసం వెతుకుతుండగా సమీప పొదల్లోంచి పులి గాండ్రింపులు వినబడడంతో వెంటనే అక్కడున్న జీడి మామిడి చెట్టెక్కి కూర్చున్నాడు. ఏం చేయాలో పాలుపోక తన వద్ద ఉన్న సెల్ ఫోన్ ద్వారా స్థానిక రైతులకు, గ్రామస్తులకు సమాచారం అందించాడు. ఆనోటా ఈనోటా చుట్టుపక్కల గ్రామాలకు సైతం ఈ వార్త దావానలంలా వ్యాపించడంతో పెద్ద ఎత్తున ప్రజలు అక్కడికి చేరుకున్నారు.
తూర్పుగోదావరి జిల్లా డీఎఫ్‌వో నాగరాజు, జంగారెడ్డిగూడెం సబ్ డీఎఫ్‌వో ఎ.వెంకట సుబ్బయ్య, ఏలూరు సబ్ డీఎఫ్‌వో ఆర్.శ్రీదేవి, ఏలూరు ఎఫ్‌ఆర్‌వో ఎస్‌వీకే కుమార్, నూజివీడు ఎఫ్‌ఆర్‌వో దావీదురాజు నాయుడు తదితరులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అక్కడ పులి జాడలు, దూడ రక్తం, ఎముకలు వారికి కనిపించాయి. పులి పరిసర ప్రాంతాల్లోనే ఉన్న ట్లు నిర్ధారించిన అధికారులు దాని కోసం గా లించారు. అవసరాన్ని బట్టి బోను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు. పలు ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలను అమర్చారు.
గ్రామస్తులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని కొత్తగూడెంలో టాంటాం వేయించారు. ఘటనపై రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటే‹Ùను ఆరా తీయగా, పులి రామసింగవరం అడవిలోకి వెళ్లిపోయిందని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment