‘కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు...’, ‘అదివో అల్లదివో శ్రీహరి వాసమూ...’ వంటి కీర్తనలు వినని తెలుగువారుండరు, అలాగే అన్నమయ్య పేరు కూడా. దేశంలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో, మరీ ముఖ్యంగా తెలుగునాట... జీవితంలో ఎవరికి ఏ కష్టమొచ్చినా ఏ దేవుడిని తలచుకుంటారో ఆయనతో జీవితమంతా పెనవేసుకుపోయిన వాడు పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమాచార్యులు. కడప జిల్లా, రాజంపేట తాలూకా, తాళ్ళపాక గ్రామవాసులయిన నారాయణ సూరి, లక్కమాంబల కుమారుడే అన్నమయ్య. తండ్రి మహాపండితుడు. దంపతులిద్దరూ చెన్నకేశవ స్వామి, వేంకటాచలపతి భక్తులు. నారాయణ సూరి భార్యను కూర్చోపెట్టుకుని కావ్యాలు చెబుతుండేవాడు. మహాభక్తుల స్థితి అలా ఉంటుంది. సమాజంలో సంస్కారం అనేది కుటుంబ యజమాని నుండే ప్రారంభం కావాలి.
సుప్రసిద్ధ రచయిత వాకాటిపాండురంగారావు గారు గతంలో ‘దిక్సూచి’ అనే వ్యాసంలో– ‘‘సినిమాకు కుటుంబంతోసహా వెళ్ళడానికి త్వరపడుతున్న సమయంలో పిల్లవాడు వచ్చి తండ్రి చేయి పట్టుకుని నాన్నగారూ, ఇంద్ర ధనుస్సు అంటే ఏమిటండీ’ అని అడిగితే... పట్టించుకోకుండా సినిమాకు పరుగులు తీసే తండ్రి ఈ జాతికి పెద్ద బరువు’ అని రాసారు. అందుకే సంస్కారం అనేది ఇంటి యజమాని దగ్గర ప్రారంభం కావాలని అనేది. నారాయణ సూరి భార్యను కూర్చోబెట్టుకుని తనకి తెలిసున్నవి అన్నీ చెబుతుండేవాడు. దోగాడుతూ(పారాడుతూ) తిరిగే వయసులో అన్నమయ్యకి ఈ సంభాషణ ఎంతవరకు అర్థమయ్యేదో తెలియదు కానీ, అక్కడ చేరి ఊ కొడుతుండేవాడట. కొద్దిగా పెద్దవాడవుతున్నాడు అన్నమయ్య. పెద్దవాళ్ళు పసిపిల్లలని కూర్చోబెట్టుకుని రెండు చేతులెత్తించి ‘గోవిందా’ అంటూ ఆడిస్తుంటాం కదా.
అన్నమయ్య తన తోటిపిల్లలతోకూడా చేతులెత్తించి గోవిందా అనిపిస్తూ, తాను స్వయంగా పాటలు పాడుతూ, వాటికి తగ్గట్టుగా అడుగులు వేస్తూ, తోచినట్లుగా నాట్యం చేస్తూ తిరుగుతూ ఉండేవాడట. వారిది ఉమ్మడి కుటుంబం. ఉమ్మడిగా ఉంటున్నప్పుడు సహజంగా ఏవో అప్పుడప్పుడు మాటలు, పట్టింపులు వస్తుంటాయి. ‘ఇలా గాలికి తిరుగుతున్నాడు, ఒక్కనాడూ ఏ ఒక్క పనీ చేయడు. దానికి తోడు చేతిలో ఆ తుంబుర ఒకటి....’ అంటూ పశువులకు మేతకోసం ఊరి బయటికి వెళ్ళి గడ్డికోసుకు వస్తుండమన్నారు. అలా వెళ్ళి గడ్డికోసే క్రమంలో ఓ రోజున కొడవలి తగిలి చిటికెన వేలు తెగింది. రక్తం కారుతోంది. ‘అమ్మా !..’ అని అరుస్తూ ఆ వేలు పట్టుకుని దిక్కులు చూస్తున్నాడు. అల్లంత దూరంలో భాగవతుల బృందం ఒకటి గోవింద నామస్మరణ చేస్తూ వెడుతున్నది.అన్నమయ్య ఒక్కసారి తన గ్రామం వంక చూసాడు.
ఈ గడ్డికోయడానికి, ఈ పశువుల వెంట తిరగడానికా ఈ జన్మ?’ అనిపించిందేమో...అయినా వైరాగ్యం ఎంతలో రావాలి కనుక! ఆ గోవిందుడిని చేరుకోవడానికి ఆ బృందం వెంట వెళ్ళిపోయాడు. కొండ ఎక్కుతున్నాడు. చుట్టూ చాలా కొండలు... ‘శ్రీహరి వాసం, పదివేల చేతుల పడగలమయం’లా కనిపించింది. ఎక్కలేక సొమ్మసిల్లి పడిపోయాడు. పద్మావతీ దేవి ఒడిలో కూర్చోబెట్టుకుని సేదదీరుస్తున్నట్లు అనిపించసాగింది.‘ఈ చెట్లు, పుట్టలు, పొదలు ఎన్నో జన్మలు తపస్సు చేసిన మహర్షులవి, సిద్ద పురుషులవి. ఈ రాళ్ళన్నీ సాలగ్రామాలే...ఎటు చూసినా ఓం నమో నారాయణాయ.. అంటూ తపస్సు చేస్తున్నవారే...’’ అని తనకి చెబుతున్నట్లు అనిపించసాగింది. వెంటనే అప్రయత్నంగా అమ్మవారి మీద దండకం చెప్పేసాడు.
Comments
Please login to add a commentAdd a comment