దేవుని దయ ఉంటే... కొండ భూమి కూడా సాగు భూమే! | It is good to have a smooth life without problems | Sakshi
Sakshi News home page

దేవుని దయ ఉంటే... కొండ భూమి కూడా సాగు భూమే!

Published Sun, Jun 9 2019 3:06 AM | Last Updated on Sun, Jun 9 2019 3:06 AM

It is good to have a smooth life without problems - Sakshi

జీవితంలో సవాళ్లు, భయాలు లేని వారెవరు? కాకపోతే వాటికి లోబడి జీవించడం మానేసి బతుకు వెళ్లదీస్తున్నవారు చాలామందైతే, వాటిని అధిగమించి నిర్దిష్ట లక్ష్యాలను చేరుతూ సాఫల్యంతో జీవించేవాళ్ళు మాత్రం చాలా కొద్దిమంది. యూదా గోత్రపు వాడైన కాలేబు ఆ రెండో కోవకు చెందినవాడు.  ‘నాకు కొండప్రాంతాన్ని ఇవ్వు, ఎంతో బలాఢ్యలైన అనాకీయులుండే ప్రాకారాల పట్టణాలక్కడ ఉన్నా, యెహోవా సాయంతో నేను అదంతా స్వాధీనం చేసుకుంటాను’ అని కాలేబు వాగ్దాన దేశంలో స్వాస్త్యాలను పంచుతున్న యెహోషువాను అడిగాడు .అప్పుడాయనకు 85 ఏళ్ళు! సారవంతమైన నేల, సులభంగా స్వాధీనం చేసుకోవడానికి వీలుగా బలహీనులుండే పట్టణాలివ్వమని అడగడం సాధారణంగా ‘తెలివైనవారు’ చేసేపని.

ఈ లోకం దష్టిలో ‘తెలివి’ అంటే దేన్నైనా సులభంగా, సునాయాసంగా వశం చేసుకోవడమే కదా? కానీ 85 ఏళ్ళ కాలేబు హృదయంలో అసాధారణమైన విశ్వాసానికే తప్ప అలాంటి చౌకబారు ఆలోచనలకు తావులేదు. ఇశ్రాయేలు దేశాన్ని వేగు చూడమని మోషే పంపిన 12 మందిలో కాలేబు, యెహోషువ అనే ఇద్దరు తప్ప మిగిలిన 10 మంది అక్కడి ప్రజలు, పట్టణాలను చూసి బెదిరిపోయి వెనక్కి తిరిగి ఐగుప్తుకెళ్లి బానిసలుగా బతకడమే  మేలని వాపోయారు.  కానీ దేవుడే మనతో ఉన్నాడు కాబట్టి ఆ దేశాన్ని చిటికెలో స్వాధీనం చేసుకోవచ్చునన్నారు కాలేబు, యెహోషువ.. ఇపుడు అదే కొండంత విశ్వాసం, చెట్టంత గుండెతో తనకు కొండ ప్రాంతాన్నివ్వాలంటున్నాడు. కాలేబు. పిరికితనం పుట్టుకతోనే వస్తుంది, ధైర్యం, తెగింపు మాత్రం దేవుని ఎరిగిన జ్ఞానంతో, దేవుడు నాతో ఉన్నాడన్న విశ్వాసంతో  సమకూరుతుంది.

సవాళ్లు, సమస్యలు లేని సాఫీ జీవితాన్ని కోరుకోవడం మంచిదే. కాకపోతే పుట్టడానికి గిట్టడానికి తప్ప మరెందుకూ పనికిరాని పుట్టలోని చెదలకు మనకు అపుడు తేడా ఉండదు. సామాజిక బాధ్యతల నెరవేర్పు కోసం అత్యంత ఉదాత్తమైన ఆశయాలతో నిర్మించబడిన మనిషి ‘నేను, నా కుటుంబం’ అనే గిరి దాటకుండా బతకాలనుకుంటే, దేవుడు కాదనడు. కానీ మనిషి తనను తాను అలా నియంత్రించుకోవడం చూసి దేవుడు తప్పకుండా నొచ్చుకుంటాడు. మరయంత్రాన్ని, ఎలక్ట్రిసిటీని, టెలిఫోన్‌ ను, రేడియోను, విమానాలను, కంప్యూటర్లను ఇలా ఎన్నింటినో కనుగొని మన సామాజిక జీవనాన్ని సులభతరం చేసిన వారంతా అనేక సవాళ్లనెదుర్కొని, అడుగడుగునా కష్టాలపాలై జీవించినవాళ్ళే.

అయితే  తమ కృషి, పట్టుదల ద్వారా తమ ప్రత్యేకతను చాటుకొని వాళ్ళు సమాజానికి దిశా నిర్దేశం చేశారు. ఆయుష్షును నిస్పృహతో అరవై, డెబ్భై అంటూ నంబర్లతో నిర్వచించే వాళ్లకు జీవితం విలువ, జీవితాన్ని నడిపే దేవుని విలువ తెలియదు. తన 85 ఏళ్ళ జీవితంలో 45 ఏళ్ళు కాలేబు ఐగుప్తులో ఫరో బానిసగా  దుర్భరంగా బతికాడు, ఆ తర్వాత 40 ఏళ్ళు అరణ్యంలో ఒక లక్ష్యం అంటూ లేకుండా  అందరితో కలిసి బతకాల్సి వచ్చింది. ఇపుడు వాగ్దానదేశంలో. సమాధికి సిద్ధంగా ఉన్నామని అంతా భావించే 85 ఏళ్ళ వయసులో, కొండప్రాంతాన్ని తనకిస్తే కొట్లాడి దాన్ని స్వాధీనం చేసుకొంటానని ప్రకటిస్తున్నాడు.

అదే చేశాడు కూడా. దేవుణ్ణి ప్రసన్నుని చెయ్యడమే కాదు, ఆయన్ను ఆశ్చర్యపరిచే విశ్వాసం ఇది. దేవుడు తమతో ఉన్నాడని నమ్మేవాళ్ళెపుడూ ఆయన ఆశీర్వాదాలకు నిలయంగానే ఉంటారు. వాళ్ళెక్కడ కాలు పెడితే అక్కడికి ఆశీర్వాదాలు కూడా వెళ్తాయి. ‘వారు బాకాలోయలో వెళ్తూ దాన్ని జలమయం  చేస్తారన్నది దేవుని వాగ్దానం (కీర్తన 84:6). కొందరు కాలు పెడితే పచ్చని స్థలాలు కూడా ఎడారులవుతాయి, మరికొందరు నడిస్తే అది ఎడారైనా  నీటి వూటలతో నిండి సస్యశ్యామలమవుతుంది. విశ్వాసుల బాటను దేవుడే అలా మార్చుతాడు
– రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్‌
prabhukirant@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement