దైవం మానుష రూపేణా | Sai patham antarvedam 36 | Sakshi
Sakshi News home page

దైవం మానుష రూపేణా

Published Sun, Feb 10 2019 1:00 AM | Last Updated on Sun, Feb 10 2019 1:00 AM

Sai patham  antarvedam 36 - Sakshi

ఏమిటి? దైవం మానుష రూపేణా! అని సాయిని గురించి అన్నారా? దేవుడు ఓ మనిషి రూపంలో కనిపిస్తున్నాడని కదా దానర్థం. దేవుడంటే కనిపించనివాడు కదా! మనుష్యుడంటే అన్ని బాధలకీ గురవుతూ కనిపిస్తూ ఉండేవాడు కదా! ఇలా ఈ ఇద్దరూ తూర్పు పడమరల్లా ఉంటూంటే ఇద్దరూ ఒకటేనంటూ ఎలా అనడం సబబు? అనిపిస్తుంది పై దృష్టితో చూస్తే.సంస్కృతంలో ‘గంగాయాం ఘోషః’ (గంగానదిలో గొల్లపల్లె) అనే మాట ఒకటుంది. నిజంగా ఓ పల్లెటూరు ఓ నదిలో ఉండటం అసాధ్యం. మరి అసాధ్యమైనదని తెలిసి కూడా ఇలా ఎలా అనగలుగుతున్నారట? గంగానది ఎంత చల్లగానూ ప్రశాంతంగానూ మనసుకి ఆనందం కలిగించేది గానూ చక్కని చల్లని గాలులతోనూ ఉంటుందో అలా ఈ పల్లెటూరు కూడా అంతగానూ గంగానది పోలికలతోనూ ఉంటుందని దాని భావం. అదే తీరులో ‘దైవం మానుష రూపేణ’ అంటే కావడానికి మనిషే అయినా దైవంలా అన్ని సందర్భాల్లోనూ కాపాడుతూ వస్తూ దైవంతో సమానంగా అనిపిస్తాడని దీనర్థం. ఈ నేపథ్యంలో ఎలా ఈ సాయి ఆ దైవంలా అనిపించాడో చూద్దాం!

సాయిలో దైవం...
భారతంలో భీష్ముడూ విదురుడూ కుంతీ అనే వాళ్లు కనిపిస్తారు. వీళ్లు జీవిస్తున్న కాలంలోనే కృష్ణుడూ ఉన్నాడు. ప్రధానంగా ఈ ముగ్గురూ ఆ కృష్ణుడ్ని మానవావతారంలో తమ కళ్లతో చూస్తున్నా కూడా, ఎప్పుడూ ఆ కృష్ణుడ్ని ఓ దైవంగా భావిస్తే దర్శించేవాళ్లే తప్ప, ఏనాడూ దైవమనే భావనే వాళ్లకి ఉండేది కాదు. (ఆత్మలో ఎరుకయున్‌..) అందుకే ఎంత మాట్లాడాలో, ఏం మాట్లాడాలో అనే ఆ అంశాన్ని ఒకటికి రెండు మార్లు లోపల అనుకుని ఆ మీదటే మాట్లాడుతూ ఉండేవాళ్లు, 9 తీరుల భక్తి భావంలోనూ ఈ తీరుభక్తి (దైవమే సుమా!) ఒకటి.అదే తీరగా ఖాపర్దే (దాదాసాహెబ్‌ ఖాపర్దే) అనే ఆయన తన కుటుంబంతో సహా షిర్డీకి వచ్చి కొంతకాలం పాటు ఉండదలిచాడు. ఆయనేదో అందరు భక్తుల్లా సాధారణుడు కాడు. గొప్ప పండితుడు. పైగా అంత విద్య తన వద్ద ఉందనే అహంకారాన్ని ఏ మాత్రమూ ప్రదర్శించేవాడు కాదు. అతి సాధారణంగా ఉంటూ అందరితోనూ కలిసిమెలిసి తిరుగుతూ ఉంటూ తన అసాధారణ విధానాన్ని ఏనాడూ చూపించడం కోసం ప్రయత్నం కూడా చేసి లేడు.ఎప్పుడూ ఆయన పాదాల దగ్గరే నిలబడి ఉంటూ కూచోవాలనే ఆలోచనతో కూడా ఉండేవాడు కాడు. ఎవరైనా భక్తులు సాయికి ఏ ఫలాన్ని గానీ ఆహారాన్ని గానీ సమర్పించుకుంటే సాయి దాన్ని తీసుకుని ఖాపర్దేకి గాని ఇస్తే దైవానికి మనం దేన్నైనా సమర్పిస్తే పూజారి దాంట్లో సగాన్ని మనకి ఇస్తే ఎలా దాన్ని ప్రసాదంగా భావిస్తూ తీసుకుంటామో అలా సాయి ఇచ్చిన ఫలహారాలని మాత్రమే తీసుకుంటూ ఉండేవాడు. ఈయన భక్తిలోని లోతు తెలియని ఏ కొందరో మరీ అంతగా ఉండాలా? అనుకునే వాళ్లు.

ఇటుపక్క ఆంగ్లభాషలో నిష్ణాతుడు కావడమే కాకుండా, అటుపక్క విద్యారణ్యులవారి ‘పంచదశి’ని చక్కగా తేలిక తేలిక పదాలతో వివరించి చెప్తూండేవాడు దానియందిష్టమున్న భక్తులకి. ఆకాశంలో 7వ ఎత్తులో గరుడుడికి  నేల మీద అలా అడుగులేస్తూ నడవడం ఎంతో కష్టం కదా! అయినా అంతటి మహా పండితుడు ఇటు ఆంగ్లం అటు సంస్కృతం ఈ రెంటికీ మధ్యలో తెలుగులోనూ కూడా అయ్యుండీ. అందరికీ అర్థమయ్యే స్థాయికి దిగి ఎదుటివారికి అర్థమయ్యేంత వరకూ తాను తృప్తి చెందేవాడు కాడు. ఇలా వివరించి చెప్పడానికి దేన్నో ఆశించి ఉండటం కాదు కారణం – ఆనాటి మహనీయుల విజ్ఞానం అతిసామాన్యునికి కూడా అందాలి, అందజెయ్యాలనే తాపత్రయం మాత్రమే.సాయి వద్దకొచ్చే ఎందరో సాయిని చనువుగా పలకరించడం, అప్పుడప్పుడు వాదించి మాట్లాడటం, మరి కొందరైతే తిట్లు తినడం, ఇంకొందరైతే ఆయనకి ముందు నడవటం, కలిసి వెళ్తూ ఉండటం... వంటివి చేస్తూ ఉండేవారు గానీ ఖాపర్దే మాత్రం ఏనాడూ అలా ప్రవర్తించేవాడే కాదు సరికదా సాయి సమక్షంలో ఆయన కనీసం కూచుని కూడా ఎరుగడు– నోరు విప్పి మాట్లాడేవాడు కాదు తనంత తానుగా. సాయి మాట్లాడి ప్రశ్నిస్తే తప్ప సమాధానాన్ని కూడా ఇచ్చేవాడు కాదు. ఈయన్ని చూసే ఈయన విధానం నచ్చి క్రమంగా ఈయన గమనించిన సాయిలోని దైవత్వాన్ని గుర్తించి ‘నూల్‌కర్‌ బుట్టి’ అనే ఇద్దరూ కూడా ఖాపర్దేలాగానే ప్రవర్తిస్తూ ఉండేవారు. ఖాపర్దేనే ముగ్గురిగా మూడు రూపాలతో ఉన్నాడా? అనిపిస్తూ ‘ఉండేవాళ్లు ఖాపర్దేని చూస్తూ విజ్ఞానంలో పై స్థాయిలో ఉండే పెద్దలంతా ఓ మాటని అనుకునేవాళ్లు – వేదాలదగ్గరికి సామాన్యశబ్దాలు వెళ్లి మారు మాట్లాడలేక మౌనంగా ఎలా ఉంటాయో, అలా ఈ ముగ్గురూ సాయి సమ్ముఖంలో మౌనంగానే ఉంటూ ఉంటారు అని. ఎంత పచ్చినిజం ఆ మాటలు!

లోకంలో సాధారణంగా ఎక్కడో కాని భార్యాభర్తలిద్దరూ ఒకే తీరుగా ఉండటమనేది కనిపించదు. ఈమె తీవ్ర దైవభక్తి పరురాలైతే ఆయన నాస్తికుడు కాకపోయినా అంత దైవభక్తి పరుడు కాకుండానూ లేదా ఆమె చేసేదాన్ని మరీ అంత చాదస్తమా? అనుకునే తీరుగానూ ఉంటుంటారు. చిత్రమేమంటే ఖాపర్దే సాయి పట్ల చూపుతున్న ఆ భక్తితత్పరతలోని లోతుని గమనించి ఆమె కూడా సాయి పట్ల అంత గాఢ భక్తి కలిగినదిగానూ అయిపోయింది.ఆయన మహాపండితుడైతే ఆమె చక్కని వంటకత్తె. దాంతో సాయికి ఏయే పదార్థాలు భోజనంలో రుచికరంగా ఉంటాయో ప్రతి నిత్యం గమనిస్తూ ఆ పదార్థాలనే ఆమె స్వయంగా వండి తేవడమూ, తెచ్చిన ఆ పళ్లెం మీద గుడ్డని కప్పి భక్తి పూర్వకంగా సాయికి దైవానికి సమర్పించే నైవేద్యమనుకుంటూనే ఆయన ముందుంచడమూ చేస్తూ ఉండేది.ఎందరో ఎందరెందరో ఎన్నెన్నో వంటకాలని, సాయి ఇష్టమైన భక్ష్యాలని ఫలాలని తెచ్చి వెండిపళ్లాలలో ఆయన సమ్ముఖంలో ఉంచినా, సాయి మాత్రం ఖాపర్దే భార్య తెచ్చిన పళ్లెం ఎక్కడుందా? అని ఓ క్షణం పరిశీలించి ముందుగా ఆ పళ్లెంలోని ప్రసాదాన్నే ఆరగిస్తూండేవాడు. ఒక్కోసారి సాయి తన భక్తులతో మాట్లాడుతూనో భిక్షాటనకంటూ వెళ్లి తాను తెచ్చిన ఆహారాన్ని కుక్కలకీ పక్షులకీ... ఇతర జీవులకీ వేస్తూ భోజన సమయాన్ని దాటి తినకుండా ఉంటే, ఆ సాయి భోజనాన్ని తీసుకుని తినేంతవరకూ ఈమె కూడా తింటుండేది కాదు. అంతటి దైవభావన ఆ దంపతులకి సాయి విషయంలో ఉంటూండేది. ఖాపర్దేకి కొన్ని ముఖ్యవ్యవహారాలుండి ఆయన ఒకే బిగిని 4 నెలల కంటే ఉండలేక వెళ్లవలసి వస్తూంటే, ఆయన తన భార్యని అక్కడే సాయికి భోజన సమర్పణం కోసం ఉంచేసి వెళ్లాడు. అంతటి గాఢభక్తి ఆ ఇరువురికీ. అది కూడా దైవసమాన దృష్టితో కూడిన భక్తి మాత్రమే. 

ఇదీ కారణం!
ఎవరెవరి మనసులోని మాటల్నైనా, ఎంత దూరంలో వాళ్లు మాట్లాడుకున్నా గ్రహించగల శక్తి సాయికుందని అనేక ఉదాహరణల ద్వారా మనం తెలుసుకున్నాం. అలాంటి సాయి ఎవరిలో భక్తి ఎంత స్థాయిలో ఉందో తెలుసుకోలేడా? ఆ కారణంగా ఖాపర్దే దంపతుల భక్తిలోని లోతుదనాన్ని గ్రహించి – ఆ దంపతులకి సాధన మార్గంలో తేలికైన మార్గాన్ని ఉపదేశ రూపంగా చూపాలనుకున్నాడు. అలా అనుకున్న సమయానికి ఖాపర్దే పొరుగు ప్రదేశంలో తన కుటుంబపు పనిమీద వెళ్లి ఉండటాన్ని గ్రహించి, ముందుగా ఆమెకి సులువైన సాధనమార్గాన్ని (భగవంతుని అనుగ్రహాన్ని సాధించే పద్ధతిని) తెలియజేయాలనుకున్నాడు మనసులో.ఓ రోజు ఆమె ప్రతిరోజులాగానే సాయికి పళ్లెం నిండుగా తినుబండారాలని పట్టుకొచ్చింది! సాయికిష్టమైన పూరీ హల్వా అన్నం పప్పు పచ్చడి వడియాలూ మొదలైన పదార్థాలని పళ్లెం నిండుగా తెచ్చి సాయి ముందుంచిందో లేదో ఏ మాత్రమూ ఆలస్యం చేయకుండా సాయి ఆ పళ్లాన్ని తీసుకున్నాడు తన చేతితో. ఇవే పదార్థాలతో పాటు అటూ ఇటూగా మరికొన్ని పదార్థాలని వెండి పళ్లాలలో పట్టుకొచ్చి సాయికి మరింత దగ్గరగా ముందు వరుసలోనే పెట్టారు కొందరు.ఇన్ని పళ్లాలున్నా ఖాపర్దే భార్య తెచ్చిన పళ్లాన్ని మాత్రమే సాయి తీసుకుని భోజనాన్ని ప్రారంభించగానే సాయి భక్తుడూ అతిసన్నిహితుడూ నిరంతరం ఆయనతోనే ఉండేవాడూ ఆయన శ్యామా సాయిని ఉద్దేశించి పలుకుతూ ఏదో ప్రశ్నని అడుగదలిచినట్లుగా తన ముఖాన్ని సాయి వైపు చూస్తూ ఉంచాడు. సాయి శ్యామాని చూస్తూ – ‘ఏం అడుగదలిచా?’– వన్నట్లు కళ్లెగరేశాడు. శ్యామా నిర్భయంగా! ‘‘సాయిదేవా! దైవసమానులైన వారికి ప్రపంచ పద్ధతుల కంటే భిన్నమైన ధోరణులు కదా ఉంటాయి! ఇందరు ఇన్ని తినుబండారాలని ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి అతిపవిత్రంగా వండి తెచ్చి సమర్పిస్తూ ఉంటే అందరినీ మౌనంగా కాదంటూ ఖాపర్దే ధర్మపత్ని తెచ్చిన పళ్లాన్నే స్వీకరిస్తూ ఉన్నావు గదా! కనీసం రుచిని చూసి నచ్చలేదంటూ కొన్ని పళ్లాలని దూరంగా జరిపేసినా ఆ భక్తురాండ్రకి కొంత మానసికంగా తృప్తి ఉంటుంది గానీ, కనీసం అలా ముట్టుకోకుండా కూడా ఎంతో పరిశుభ్రత ఉట్టిపడుతూ ఉండే పళ్లాలని కూడా అలా జరిపివేస్తున్నావే! అది ఆ భక్తురాండ్ర మనసుకి గాయాన్ని కలిపించేది కాదా? అయినా అందరూ ఒక్కరే అని ప్రబోధించే నీకు ఈ వివక్షని చూపించడం సమంజసం అనిపిస్తోందా? భోజనాన్ని ఎలా ఉన్నా భిక్షాటనకి వెళ్లి తెచ్చినప్పుడు చద్ది అన్నమైనా, అది తెచ్చాక ఆ అన్నపుగిన్నెలో కాకులు కుక్కలు పిల్లులు మూతిని పెట్టి తిన్నా కూడా ఏ అసహ్యం భేదభావనా లేకుండా.. ఆరగించే నీకు ఖాపర్దేసతీమణి తెచ్చే ఆహారమే అంత ఇష్టం అవుతూ ఉండటంలో లోపలి కారణం ఏమై ఉంటుందో తెలుసుకోవాలని కుతూహలంగా ఉంది. నీతో బాగా చనువు ఉన్నవాణ్ని నేను కాబట్టి ఈ ప్రశ్నని ఇందరి సమక్షంలోనూ అడుగుతున్నాను. దీనిలో ఏదో పరమార్థం ఉండి ఉంటుందని భావిస్తున్నాను. నన్ను మన్నించి తెలుపరూ?’ అని అడిగాడు.

ఆ సుదీర్ఘ ప్రశ్నని సాయి విని చిరునవ్వు నవ్వుతూ ‘శ్యామా! ఈమె తెస్తున్న ఆహార పదార్థాలూ ఎంతటి శ్రేష్ఠమైనవో తెలియజెప్తాను విను. ఈ జన్మలో ఖాపర్దే పండితునికి భార్యగా కనిపిస్తున్న ఈమె తన కిందటి జన్మల్లో మొదటి జన్మలో అతిసాధువూ పుష్టికలదీ ఎందరికో పాలని ఇచ్చినదీ అయిన తెల్లని ఆవు. ఒక వ్యాపారస్తుడు అప్పటి ఆమె యజమాని.తరువాత  జన్మలో ఆమె ఓ తోటమాలి ఇంట్లో జన్మించింది. ఆ మీద జన్మలో క్షత్రియజాతిలో పుట్టి ఓ వర్తకునికి భార్య అయింది. ఆ మీదట జన్మలో ఓ బ్రాహ్మణవంశంలో పుట్టి పరమ ఆచారపరురాలూ సంప్రదాయ విధానం కలిగినదీ అయింది. చెప్పలేని దైవభక్తి ఆమెకి ఉచ్ఛ్వాసనిశ్వాసలుగా అయిపోయింది. ఎంతో కాలం నుండీ ఎదురుచూస్తూ ‘ఎప్పుడు చూస్తానా?’ అనుకుంటున్న ఈమె కాస్త ఈ జన్మలో ఎక్కడో పుట్టి ఇప్పుడు షిర్డీకి వచ్చి తనని తాను నాకు చూపించుకుంటోంది. ఆశ్చర్యకరంగా ఆమె భర్త కూడా పండితుడయ్యుండీ, ఆ సంస్కృత ఆంగ్ల పాండిత్యం అలాగే అధికారమూ హోదాలేని నన్నే ఆదరించడం కూడా జరుగుతూ ఉంది. ఈ ఇద్దరిలోనూ కనిపించే ఆ భక్తీ నా పట్ల చూపుతున్న ఆ భావనా (దైవ సమానభావన) మా ముగ్గురికే తెలుస్తుంది. అందుకే ఇష్టంగా తింటున్నాను. ఈ జన్మలూ ఆ జన్మకీ జన్మకీ మధ్య ఉన్న సంబంధం గురించి చెప్పాలంటే మరికొంత సమయం పడుతుంది గాని తృప్తిగా రెండు ముద్దల్ని నన్ను తిననీ! ఇలా ఆమె భోజనాన్ని తినడమనేది పక్షపాత బుద్ధిని చూపడం లేదా ఇతరుల్ని గాయపడేలా చేయడం అనుకోవద్దు.నా గురించి తెలియని భక్తులు కాదు వీళ్లంతా.. అంటూ మొత్తం అన్నాన్ని తినేసి తన ఆసనంలో కూర్చున్నాడు సాయి.ఇలా తననీ తన భర్తనీ అందరి సమక్షంలో సాయి అంతగా ప్రశంసించినా ఆమెలో ఏవిధమైన గర్వమూ కళ్లలో మెరుపూ అందరికంటే తానెక్కువ అనే భావంతో కనిపించాల్సిన నవ్వూ... ఏమీ లేనే లేవు. ఎవరి గురించో తానువింటున్నట్లుగా ఓ నది సముద్రంలో చెప్పలేనంత జలంతో వచ్చి కలిసినా సముద్రంలో ఏ మాత్రపు పెరుగుదలా లేకుండా గంభీరంగా యథాపూర్వంగానే (పూర్వం ఎలా ఉందో అలానే) ఉండిపోయింది. అది అందరికీ విస్మయాన్ని కలిగించింది.వాక్కు ద్వారా శక్తిపాతంసాయి అలా ఆసనంలో కూర్చున్నాడో లేదో ఆమె సాయి పాదాలని మృదువుగా నొక్కసాగింది. అలా తన పాదాలని మర్దన చేస్తున్న ఆమె చేతులని తాను తన చేతులతో గ్రహిస్తూ... ‘తల్లీ! ఓ మంత్రాన్నిజపించు’– అంటూ ‘రాజారామ్‌– రాజారామ్‌– రాజారామ్‌.. అంటూ ముమ్మారు అతిమంద్రంగా ఆమెకి ఉపదేశించాడు. ఇదేనమ్మా నువ్వు నిత్యం జపించాల్సిన మంత్రం! అంటూ ఆమె కళ్లలోకి ఆర్థ్రంగా చూశాడు.

‘దేవా!’ అని ఆమె అంటూంటే.. నీ జీవిత పరమార్థం నెరవేరేది ఈ మంత్రంతోనే. మీ దంపతులకి శ్రేయస్సు కలుగుతుంది’ అని ముగించాడు సాయి. వాక్‌ శక్తిపాతం చేశాడన్నమాట సాయి.శక్తిపాతమంటే..?ఎత్తుగా ఉన్న ప్రదేశం నుంచి నీరు పల్లంగా ఉన్న ప్రదేశంలో పడ్డట్టుగా ఉదాత్త తపశ్శక్తి ఉన్న మహనీయుని నుంచి ఆయన ఆర్జించిన తపశ్శక్తిలోని ఓ కొంత(ఈ తపశ్శక్తిని ఎంత నిష్ఠతో ఇష్టంతో మనఃపూర్వకంగా గ్రహించగల శక్తి ఉన్న వ్యక్తి ఉన్నాడో అతనికి అంత మాత్రమే లభించడం శక్తిపాతం ద్వారా లభిస్తుంది.ఒక సామాన్యశక్తిమంతుడు నిరంతర వ్యాయామం ద్వారా ఎంత బలవంతుడు తన అభ్యాసానికి అనుగుణంగా కాగలుగుతాడో అలా శక్తి పాతమనేది కూడా సాధకుని భక్తితత్పరతకి అనుగుణంగానే ఉంటుంది. ఖాపర్దే భార్య ఇలా భక్తిశ్రద్ధలతో సాయిని కేవలం ఓ సాధకునిగా లేదా సిద్ధునిగా లేదా తమ కోరికలని తీర్చే మహనీయునిగా కాక ఓ దైవంలానే నిరంతరం భావించింది కాబట్టి, సాయి కూడా తనలో దృష్టితో ఆమెని అంతటి నిరంతర సాధకురాలిగా గుర్తించాడు కాబట్టీ ఆమెకి తన వాక్కు ద్వారా తన తపశ్శక్తిని శక్తిపాతరూపంగా అందజేశాడు.అంతేకాదు. ‘తల్లీ! నా శక్తిపాతం ద్వారా శక్తి మంతురాలివైన నువ్వు చేయాల్సింది ‘నా నామజపం కాదు– రాజారామ్‌– అనే మంత్రంతో ఆ రామచంద్రుడ్ని మాత్రమే’ అని మౌనంగా తెలియజేశాడు కూడా.స్వాములవారు సమీపానికి భక్తులు వెళ్లడం మంత్రోపదేశాన్ని పొందటం, మళ్లీ మరొకరి వద్దకి వెళ్లడం కొంతకాలమయ్యాక మరొకరి వద్దకి వెళ్లి ఉపదేశం తీసుకుందామనే ఆలోచనతో ఉండటం ఎంత సరికాదో, గురువుని మెప్పించి శక్తిపాతం ద్వారా మంత్రోపదేశాన్ని పొందటం ఎంత సరైనదో పరోక్షంగా తెలియజేశాడు సాయి ఈ సంఘటన ద్వారా. ఆయన ‘మూర్తీభవించిన దైవం’ అనే దృష్టితో సేవించింది కాబట్టే ఆమెకి మంత్రాన్ని పొందడం సాధ్యమైంది. ‘నాకు మోక్షవిద్య కావాలి! అందుకే వచ్చాను....’
– సశేషం
డా. మైలవరపు శ్రీనివాసరావు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement