సాయి అనే మాటకి అర్థం..? | Sai is the name of the temple ruler Mahalasapati | Sakshi
Sakshi News home page

సాయి అనే మాటకి అర్థం..?

Published Sun, Jul 8 2018 12:46 AM | Last Updated on Sun, Jul 8 2018 12:46 AM

Sai is the name of the temple ruler Mahalasapati - Sakshi

ఖండోబా గ్రామదేవత ఆలయ అర్చకుడు మహల్సాపతి పెట్టిన పేరే ‘సాయి’. ‘యా సాయీ!’ (దయచేసి రండి సాయీ!) అని ఆయన ఆహ్వానిస్తే సాయి లోనికొచ్చాడు.ఇంతకీ సాయి అనే పేరుతోనైతే మహల్సాపతి పిలిచాడు గానీ ఈ పదానికున్న అర్థం ఏమిటనే సంశయం మనకొస్తుంది కదా! మరాఠీ భాషా నిఘంటువు ప్రకారం సాయి అనే మాటకి ‘ప్రభువు – దేవుడు – నాథుడు – ప్రియుడు – ఫకీరు’ అనే అర్థాలున్నాయి. ఇది ఇప్పుడే కొత్తగా వచ్చిన పదం కాదు. భక్తకబీరు ‘సాయి’ అనే పదాన్ని ‘అత్యంత సమర్థతతో లోకాలని నడిపించే భగవంతుడు’ అనే అర్థం వచ్చేలా తనగీతాల్లో వాడాడు.‘సాయి’ అని ఎందుకు మహల్సాపతి సంబోధించాడో క్రమంగా చూసుకుంటూ వెళదాం. సాయి పదానికి మొదటర్థం ‘ప్రభువు’ అని. ‘భు’ అంటే ‘ఉన్నవాడు’ అని అర్థం. ‘స్వయం+భు+వు’ అనే పదానికి తనంతట తానుగా పుట్టి, ప్రస్తుతం ఉన్నవాడని అర్థం. అలాగే ‘ఆత్మభువు’ అనే మాటకి ఆత్మ నుండి పుట్టి ప్రస్తుతం ‘ఉన్నవాడు’ అని అర్థం. మనోభువు అనే మాటకి మనసు నుండి పుట్టి ప్రస్తుతం ‘ఉన్నవాడు’ అని అర్థం. ఈ తీరులో ‘ప్రభువు’ అనే అర్థమున్న సాయిపదానికి ‘ప్ర+భు+వు’అంటే మానవ అతీతమైన లక్షణాలు కలిగి ప్రస్తుతం ఉన్నవాడు అని అర్థమౌతుంది. ఎదుటివారి మనసులో ఏముందో తెలుసుకోగల శక్తి సాయికి ఉండడమనేది ఈ ప్రభువనే అర్థానికి సరైన ఉదాహరణ.

ఇక సాయి అనే పదానికి ఉన్న రెండో అర్థం ‘దేవుడు’. దీవ్యతీత దేవః – ఎప్పుడూ మానసికానందంతో ఉండేవాడని దీనర్థం. ఎండకి మాడుతున్నా, వర్షం తనని తడుపుతున్నా, చలి తనని బాధిస్తున్నా, సమయానికి తిండి దొరక్కున్నా, ఎవరిమటుకు వారు తమతమ ఇళ్లలో తలుపులు వేసుకుని కూర్చున్నా – ఏవిధమైన దుఃఖమనేది లేకుండా అదే మసీదు దగ్గర ఉండటం. ఆ సమయంలో కూడా ఆనందంగానే ఉండటమనేది ‘దేవుడు’ అనే ఆ అర్థానికి సరైన ఉదాహరణ.సాయి అనే పదానికున్న మూడో అర్థం ‘నాథుడు’. ‘నాథే’ తాను అండగా ఉండి రక్షించేవాడని ఈ మాటకి అర్థం. కలరావ్యాధితో బాధపడుతున్న షిర్డీవాసులకి తాను అండగా ఉండే కదా గ్రామప్రజలు కలరా రోగులు కాకుండా రక్షించాడు! కాబట్టి నాథుడనే అర్థానికి ఉదాహరణ ఇదన్నమాట!సాయి అనే పదానికున్న నాలుగో అర్థం ‘ప్రియుడు’. ప్రియుడు అనగానే రోజులు మారాక ‘ప్రేమించిన వాడు’ అనేది అర్థంగా అయిపోయింది. అయితే ప్రియుడనేమాటకి సరైన అర్థం అది కాదు. శరీరం నిండుగా ప్రేమతత్త్వం కలవాడని. ప్రియుడు అనగానే కేవలం మనుషుల విషయంలో.. అందునా యవ్వనవంతుల విషయంలో మాత్రమే ప్రేమ కలిగినవాడనేది దాని భావంగా కనిపిస్తుంది. ప్రేమభావమనేది పక్షుల విషయంలో, కుక్కల విషయంలో, చెట్ల విషయంలో ఇలా అన్ని చరాచర జాతులన్నింటిలోనూ ఉండాలి. సాయి ఎన్నో పక్షులకి తిండిగింజల్ని వేసేవాడు. కుక్కలకి ఆహారాన్ని పెట్టేవాడు. నిత్యం ‘లెండీ’ అనే పేరుగల తోటలో చెట్లకి నీటిని క్రమం తప్పకుండా పోస్తుండేవాడు. కాబట్టి ప్రియుడనే ఆ అర్థానికి ఇవన్నీ ఉదాహరణలన్నమాట!

సాయి అనే పదానికి ఉన్న చివరి అర్థం ‘ఫకీరు’. దేని మీదనూ ధ్యాసలేకుండా ఉండేవాడిని ఫకీరు అంటారు. ఒకే వస్త్రాన్ని కట్టుకోవడం, భిక్షాటన చేసి తెచ్చుకున్న ఆహార పదార్థాలని ఒక గిన్నెలో ఉంచి, కనీసం మూత కూడా లేకుండా చేసి.. కుక్కలు, పక్షులు, చీమలు తింటున్నా పట్టించుకోకుండా.. అవి తినగా మిగిలిందాన్ని ఏ మాత్రపు అసహ్యం లేకుండా తినడం, ఒకవేళ భిక్షాటనలో ఆహారం లభించకపోతే తిండి లేకుండా ఉండటం ఇవన్నీ ఫకీరు లక్షణాలే కదా! కాబట్టి ఫకీరు అనే అర్థానికి ఇవి ఉదాహరణలన్నమాట!ఇన్ని తీరుల లక్షణాలనీ గమనించాడు కాబట్టే ఖండోబా దేవాలయ అర్చకుడైన మహల్సాపతి ‘సాయి’ అనే పేరుతో ఆయన్ని సంబోధిస్తూ తన గౌరవాభిమాన భక్తులన్నిటినీ కలుపుతూ ‘యా సాయీ! (సాయీ! దయచేయండి)’ అన్నాడన్నమాట.సంస్కృత పండితులు కొందరు ‘సాయి’ అనే పదం సంస్కృత వ్యాకరణం ప్రకారం సరికాదు కాబట్టి ఆయన్ని ‘శాయి’ అని పిలవాలంటూ ‘శాయి బాబా’ అనడం మొదలెట్టారు ఒకప్పుడు. ‘శాయి’ అనే పదం సంస్కృత భాష ప్రకారం.. నిత్యం శయనించి (పరుండి) ఉండేవాడు (శేతే ఇతి శాయీ) అనే అర్థాన్నిస్తుంది. శేషుని మీద పరుండి ఉండేవాడు కాబట్టి ‘శేష శాయి’ అయ్యింది. ఆ పదాన్ని ఉచ్చరించేటప్పుడు ‘శేషసాయి’ అనకూడదు. ఇక్కడ ‘సాయి’ అనేది సంస్కృత భాషాపదం కాదు. మరాఠీ పదం కాబట్టి ‘శాయి’ అనకూడదు. ‘సాయి’ అనే అనాలి. అలాగే ‘బాబా’ అనేది కూడా ‘తండ్రి వలే రక్షకుడు’ అనే అర్థాన్నిస్తుంది కాబట్టి సాయి లేదా సాయి బాబా అనే అనాలి తప్ప శాయి అని గాని శాయిబాబా అనిగాని అనకూడదు. శాయి అనేది సంస్కృత పదమే అయినా మళ్లీ ‘బాబా’ అనేది సంస్కృతం కాదు కాబట్టి ‘శాయి బాబా’ అనకూడదు.

దాసగణు కథ
ఒక ఇంటిని మనం కట్టుకున్నాక ఏయే వస్తువులు మనకి అవసరమవుతాయో గమనించుకుని ఎలా తెచ్చుకుని మనింట్లోనే ఉంచుకుంటామో, అలా సాయి కూడా తనతో పాటుగా ఏయే లక్షణాలున్నవారిని ఎవరెవరిని శాశ్వతంగా ఉంచుకోవాలో బాగా ఆలోచించుకున్నాడు. ఆయన దృష్టి అనన్యసామన్యం కదా! అలా ఆయన మనోభీష్టానికి అనుగుణంగా వచ్చి ఆయన దగ్గరే ఉండిపోయినవాళ్లే కాకా సాహెబ్, నానా సాహెబ్, సచ్చరిత్ర రాయాలనే దృక్పథానికి వచ్చిన అన్నాసాహెబ్‌ అనేవాళ్లు. ఈ ముగ్గురూ మంచి మిత్రులైపోయారు. వీరు కాక ఇంకా ఎందరో ఆయన దగ్గరికి రావడం భక్తులుగా మారిపోయి ఆయన సన్నిధిలోనే ఉండిపోవడం జరిగింది.అలాంటి ఉత్తమ భక్తుల కోవలోకి మరొకర్ని రప్పించుకోవాలని మనసులో భావించాడు సాయి. ఆ అనుకున్నది ‘దాసగణు’ అనే ఒక పోలీసు ఉద్యోగాన్ని చేస్తున్నవానిని గూర్చి సాయి తనలో అనుకోవడం తడవు – దాసగణుకి షిర్డీ రావాలని అనిపించింది. సాయి అతణ్ణి చూస్తూ.. ‘గణూ! ఆ పోలీసు ఉద్యోగాన్ని మాని ఈ మానవసేవకి అంకితం అయిపోకూడదూ? ప్రశాంతంగా జీవితాన్ని వెళ్లదీయచ్చుగా!’ అన్నాడు.దాసగణు ఆ మాటలకి కొద్దిగా అసంతృప్తి పడి – ‘స్వామీ! నేనిప్పుడు సాధారణ పోలీసుని. ఎందుకో పదవోన్నతిని పొంది సబ్‌ ఇన్‌స్పెక్టరుగా కొంతకాలంపాటు ఆ హోదాలో ఉండి ఆ మీదట వద్దామనుకుంటున్నా’ అన్నాడు. సాయి చిరునవ్వుతో ‘అలాగా! అలాగే కానీ!’ అన్నాడు.

చాలా తొందరకాలంలోనే దాసగణుకి పదవోన్నతి లభించింది. సబ్‌ ఇన్‌స్పెక్టరయ్యాక సాయి వద్దకొస్తానన్న ఆ మాట తనలో తిరుగాడుతూనే ఉంది. సాయి దర్శనానికొచ్చాడు. సాయి మాట్లాడుతూ.. ‘గణూ! ఇన్‌స్పెక్టరయ్యాక వచ్చేస్తానన్నావుగా!’ అన్నాడు. దాసగణు ఆ మాటకి సమాధానాన్ని చెప్పలేకపోయాడు. దానిక్కారణం ఆ ఉద్యోగంలో కొంతకాలం ఉండాలనే మోజు మాత్రమే. సాయి చిరునవ్వు నవ్వుకుంటూ తనలో అనుకున్నాడు. మంచి ఆధ్యాత్మిక భవిష్యత్తున్నవాడు కదా దాసగణు! ఈ లౌకిక ప్రవృత్తిలో ఎందుకిలా జీవితాన్ని నష్టపరుచుకుంటున్నాడు? అని. ఇలా అనుకుని ‘సరే గణూ! ఎలా ఆ ఉద్యోగాన్ని నిర్వహిస్తావో చూద్దాం!’ అన్నాడు సాయి. ఆ మాటకర్థం అప్పుడు తెలియలేదు దాసగణుకి.కొన్నాళ్లయ్యాక పోలీసుస్టేషన్లో ఏదో చోరీసొత్తు దొంగలనుండి రాబట్టి తెచ్చినది కనిపించలేదు. దురుదృష్టవశాత్తూ ఆ సొమ్ముని దాసగణు తీసి ఉంటాడనే అభియోగం మోపబడింది. నిజానికి తాను నిర్దోషి. ఎన్ని విధాల తాను దోషిని కాదంటూ తగిన పత్రాలని సమర్పించినా దాసగణు మాత్రమే నేరగాడుగా లెక్కించబడ్డాడు. దాంతో దాసగణు ఉద్యోగానికి రాజీనామా చేస్తూ సాయి పలికిన పలుకుల్ని గుర్తు చేసుకుని – షిర్డీకి తన మకాంను మార్చేసాడు. 70 సంవత్సరాల వయసున్నప్పటికీ దృఢంగా ఉన్న తాను సాయిసేవలో పూర్తిగా తన జీవితాన్ని వెళ్లదీయాలని నిశ్చయించుకుని సాయి అనుమతిని కోరాడు. సాయి అనుగ్రహించాడు.

దాసగణుది మంచి శ్రావ్యమైన కంఠం. రాగాలజ్ఞానం కూడా ఉంది. సొంతంగా కీర్తనలని రచించి స్వరపరిచి పాడగల నైపుణ్యం ఉంది. తనకి కల్గిన అనుభవంతో, సాయిది భవిష్యత్‌ జ్ఞాన శక్తి కల తపశ్శక్తి అని గ్రహించి సాయి మీదే కీర్తనలని సొంతంగా రచించాడు. అంతతో ఊరుకోకుండా చుట్టుపక్కలనున్న గ్రామాల్లో హరికథల రూపంలో సాయి చరిత్రని శ్రావ్యంగా పాడుతూ అనేకుల్లో సాయి భక్తిని రగుల్కొల్పాడు. శ్రావ్యమైన కంఠం, కీర్తనల్లోని సాహిత్యం కారణంగా కేవలం మహారాష్ట్రలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా దాసగణు కీర్తనలని వినాలనే తపన ప్రారంభమయింది శ్రోతలైన భక్తులకి. దాంతో అనేక ప్రదేశాల్లో సాయి కీర్తనలని విరివిగా వినిపించాడు దాసగణు. ప్రతిఫలాపేక్ష ఏ మాత్రమూ లేకుండా ఇలా సాయి ప్రచారం విశేషంగా అయిన కారణంగా సాయి భక్తుల సంఖ్య మరింత అయిపోయింది.
నిజమైన ఆశ్చర్యకరమైన అంశమేమంటే దాసగణు నిజానికి సాయి భక్తుడు కాదు. తొట్టతొలుతదశలో అతను పండరిపురాధీశుడైన విఠ్ఠల భక్తుడు. ఆ సాహిత్యాన్ని బాగా చదివిన వాడూ అనేక అనుభవాలని పొందినవాడు కూడా. అయితే షిర్డీక్కూడ వస్తుండేవాడు కేవలం విఠ్ఠలునివద్దకే కాకుండా. అలాంటి దాసగణు సాయిని సమీపించి పాదాలని స్పృశించి నమస్కరించి ‘ప్రభూ! ఒక్కసారి పండరిపురానికి వెళ్లి విఠ్ఠలుని దర్శించి రావాలని అనిపిస్తోంది. నీ సన్నిధిని విడిచి వెళ్లడమా? అని మనసు వెనకడుగువేస్తోంది! కాదు పాండురంగణ్ణి. దర్శించాల్సిందేనని బుద్ధి వెంటపడుతోంది! నాకేమీ పాలుపోవడం లేదు’ అన్నాడు.

సాయి చిరునవ్వుతో దాసగణుని చూస్తూ ‘గణూ! పండరి వెళ్తేనే విఠ్ఠలుని దర్శనమవుతుందా? ఆయన అక్కడ మాత్రమే ఉన్నాడా? ఉంటూ ఉంటాడా? సరే! నీ అభీష్టానికి అనుగుణంగా పండరినాథుని దర్శనం కలిగేలా చేస్తాను. మరి నామగుప్తాహాన్ని (పండరి విఠ్ఠలదేవుని నామాన్ని క్రమం తప్పకుండా ఏడు రోజుల పాటు చేయడం) చేస్తావా?’ అన్నాడు. గురుదేవుని ఆజ్ఞ ప్రకారం తప్పక చేస్తానన్నాడు దాసగణు.తాను చెప్పిన ప్రకారం దాసగణు ఏడురోజుల పాటూ నియమనిష్ఠలతో పండరినాథుని దర్శనమవుతుందనే గట్టి ఎదురుచూపుతో సప్తాహాన్ని ముగించి సాయికి పాదాభివందనాన్ని చేసాడు. తలనెత్తి చూసే సరికి సాయి లేడు. పండరిపురనాథుడైన విఠ్ఠలుడే రుక్మిణీ సమేతంగా దర్శనమిస్తుండే సరికి దాసగణుకి కలిగిన ఆనందానికి శరీరం పట్టలేదు. ఏమిటీ వింత? నా దగ్గరికొచ్చి విఠ్ఠలుడు దర్శనమీయడమా? భగవంతుణ్ణి మన చెంతకి నామపారాయణం వల్ల రప్పించుకోగలమా? దానికి గురు అనుగ్రహం ఇంతగా ఉంటుందా? అనుకుంటూ ఆ విఠ్ఠలుని పాదాలని తన చేతులతో స్పృశించాడు. విఠ్ఠల పాండురంగడు విగ్రహరూపంలో లేడు. జీవించివున్న దైవరూపంలో సచేతనంగా కనిపించాడు. కనులనిండా ఆనందబాష్పాలు అలా కారిపోతుంటే... ‘సాయీ! సాయీ!’ అంటూ సాయిని మనఃపూర్వకంగా స్మరించాడు ఇంతటి ఆనందాన్ని కలిపించినందుకు.  

అంతే! ఎదురుగా అయిదడుగుల శరీరంతో తానెప్పుడూ ధరించే పెద్దలాల్చీతో సాయి కనిపించాడు. దాసగణుకి నోట మాట రాలేదు. సాయి నిత్యం తన చెంత ఉన్న కారణంగా ఆయన గొప్పదనాన్ని లెక్కించలేకపోయానని సిగ్గుపడ్డాడు.కొంతకాలమయ్యాక దాసగణుకి గంగాయమునల్లో స్నానం చేసి రావాలనే బుద్ధి పుట్టింది. ఆ అభిప్రాయాన్నే సాయికి వెల్లడించాడు. సాయి మళ్లీ పూర్వంలాగానే నవ్వి – దాసగణూ! గంగాయమునలు ఇక్కడలేవా? ఇది ప్రయాగ కాదనుకుంటున్నావా? తప్పక స్నానాన్ని చేయిస్తాను’ అనగానే దాసగణు సాయిపాదాల చెంత తన శిరసునుంచి నమస్కరించాడు. అంతే ఒకపాదం నుండి గంగా మరోపాదం నుండి యమునా ధారలుగా రాసాగాయి. దాసగణుతో పాటు అందరికీ ఆశ్చర్యం ఆనందం కలిగాయి. ఇది సాధ్యమా? ఎలా వచ్చాయి ధారలుగా?         (సశేషం..) 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement