ఇద్దరు గ్రామస్తుల మధ్యన తమలో ఎవరు గొప్ప భక్తుడనే వాదన మొదలయ్యింది. వందలాది పుణ్య క్షేత్రాలు తిరిగి వచ్చిన తను గొప్ప భక్తుడినని ఒక గ్రామస్తుడు వాదించాడు. ఎన్నో ఉపవాసాలు, వ్రతాలు, దీక్షలు చేసిన తానే నిజమైన భక్తుడని మరో గ్రామస్తుడు వాదించసాగాడు. వాదనలు తీవ్ర రూపం దాల్చడంతో గ్రామం గుండా పోతున్న ఓ గురువును వారు ఆశ్రయించారు.
‘‘మా భక్తి నిరూపించుకోడానికి ఏమైనా చేస్తాం, ఎన్ని సాహసకార్యాలైనా చేయగలం’’ అని గట్టిగట్టిగా అరిచి చెప్పారు. వారిద్దరి వాదనలూ ఓపికగా విన్నాడు గురువు.
చిన్న నవ్వు నవ్వి ‘‘మీలో ఎవరు నిజమైన భక్తుడో సులభంగా తెలుసుకోవచ్చు. మీరు నాతోపాటు రండి, ఎన్నో మహిమలను చూపే దేవుడు మా ఆశ్రమంలో ఉన్నాడు. ఆ దేవుడికి మీలో ఎవరు తలనీలాలు సమర్పిస్తారో వారే నిజమైన భక్తులు’’ అని సెలవిచ్చాడు.
‘‘అదెంత పని?’’ అని వారిద్దరూ ముందుకు వచ్చారు. ‘‘అయితే మా దేవుడికి తలనీలాలు ఎవరైతే సమర్పిస్తారో వారికి ఆ తదనంతరం తల పైన ఒక్క వెంట్రుక కూడా మొలకెత్తదు. దానికి సంసిద్ధులైనవారు మాత్రమే నాతో రాగలరు’’ అని గురువు చెప్పాడు. అంతే... అప్పటిదాకా గొప్ప భక్తులమని చెప్పుకున్న ఇద్దరూ, చల్లగా అక్కడినుంచి జారుకోబోయారు.
వారిని ఆపిన గురువు ‘‘భవిష్యత్తులో వెంట్రుకలు రావని చెప్పేసరికి మీరు తలనీలాలు ఇవ్వడానికే సుముఖత చూపడం లేదు. బాహ్య సౌందర్యంలో చిన్న మార్పుకు సైతం అంగీకరించని మీరు అంతః సౌందర్యంలో మార్పులకు అంగీకరిస్తారా..? నిజమైన భక్తుడు ఎప్పుడూ లాభనష్టాలు బేరీజు వేయడు. సంపూర్ణంగా తనను నమ్మి సర్వస్వ శరణాగతి కోరే వారి వెంటే దేవుడు సర్వకాల సర్వావస్థలలోనూ ఉంటాడు’’ అని వివరించాడు. తప్పు తెలుసుకున్న ఆ ఇద్దరు గ్రామస్తులు గురువును క్షమాపణ కోరారు.
అమృత బిందువులు
♦ ఎవరికీ తల వంచనిది ఆత్మగౌరవం. ఎవరి ముందూ చేయి చాచనిది ఆత్మాభిమానం. ఎవరినీ కాదనలేనిది ఆత్మీయత.
ఈ మూడు ఆత్మలు కూడిన మనిషి జీవితం సఫలం.
♦ వేడినీరు ఒకటే... కాని కోడిగుడ్డును ఉడికిస్తే గట్టిపడుతుంది. ఆలుగడ్డను ఉడికిస్తే మెత్తబడుతుంది.
రాగద్వేషాలు ఒక్కటే కాని ... ఆనందం కలిగినప్పుడు ఆనంద బాష్పాలు అవే. దుఃఖం కలిగినప్పుడు కన్నీటి ఓదార్పులు అవే.
– ఆర్.సి. కృష్ణస్వామి రాజు
Comments
Please login to add a commentAdd a comment