Psalms Annamayya
-
దేవుని దయ ఉంటే... కొండ భూమి కూడా సాగు భూమే!
జీవితంలో సవాళ్లు, భయాలు లేని వారెవరు? కాకపోతే వాటికి లోబడి జీవించడం మానేసి బతుకు వెళ్లదీస్తున్నవారు చాలామందైతే, వాటిని అధిగమించి నిర్దిష్ట లక్ష్యాలను చేరుతూ సాఫల్యంతో జీవించేవాళ్ళు మాత్రం చాలా కొద్దిమంది. యూదా గోత్రపు వాడైన కాలేబు ఆ రెండో కోవకు చెందినవాడు. ‘నాకు కొండప్రాంతాన్ని ఇవ్వు, ఎంతో బలాఢ్యలైన అనాకీయులుండే ప్రాకారాల పట్టణాలక్కడ ఉన్నా, యెహోవా సాయంతో నేను అదంతా స్వాధీనం చేసుకుంటాను’ అని కాలేబు వాగ్దాన దేశంలో స్వాస్త్యాలను పంచుతున్న యెహోషువాను అడిగాడు .అప్పుడాయనకు 85 ఏళ్ళు! సారవంతమైన నేల, సులభంగా స్వాధీనం చేసుకోవడానికి వీలుగా బలహీనులుండే పట్టణాలివ్వమని అడగడం సాధారణంగా ‘తెలివైనవారు’ చేసేపని. ఈ లోకం దష్టిలో ‘తెలివి’ అంటే దేన్నైనా సులభంగా, సునాయాసంగా వశం చేసుకోవడమే కదా? కానీ 85 ఏళ్ళ కాలేబు హృదయంలో అసాధారణమైన విశ్వాసానికే తప్ప అలాంటి చౌకబారు ఆలోచనలకు తావులేదు. ఇశ్రాయేలు దేశాన్ని వేగు చూడమని మోషే పంపిన 12 మందిలో కాలేబు, యెహోషువ అనే ఇద్దరు తప్ప మిగిలిన 10 మంది అక్కడి ప్రజలు, పట్టణాలను చూసి బెదిరిపోయి వెనక్కి తిరిగి ఐగుప్తుకెళ్లి బానిసలుగా బతకడమే మేలని వాపోయారు. కానీ దేవుడే మనతో ఉన్నాడు కాబట్టి ఆ దేశాన్ని చిటికెలో స్వాధీనం చేసుకోవచ్చునన్నారు కాలేబు, యెహోషువ.. ఇపుడు అదే కొండంత విశ్వాసం, చెట్టంత గుండెతో తనకు కొండ ప్రాంతాన్నివ్వాలంటున్నాడు. కాలేబు. పిరికితనం పుట్టుకతోనే వస్తుంది, ధైర్యం, తెగింపు మాత్రం దేవుని ఎరిగిన జ్ఞానంతో, దేవుడు నాతో ఉన్నాడన్న విశ్వాసంతో సమకూరుతుంది. సవాళ్లు, సమస్యలు లేని సాఫీ జీవితాన్ని కోరుకోవడం మంచిదే. కాకపోతే పుట్టడానికి గిట్టడానికి తప్ప మరెందుకూ పనికిరాని పుట్టలోని చెదలకు మనకు అపుడు తేడా ఉండదు. సామాజిక బాధ్యతల నెరవేర్పు కోసం అత్యంత ఉదాత్తమైన ఆశయాలతో నిర్మించబడిన మనిషి ‘నేను, నా కుటుంబం’ అనే గిరి దాటకుండా బతకాలనుకుంటే, దేవుడు కాదనడు. కానీ మనిషి తనను తాను అలా నియంత్రించుకోవడం చూసి దేవుడు తప్పకుండా నొచ్చుకుంటాడు. మరయంత్రాన్ని, ఎలక్ట్రిసిటీని, టెలిఫోన్ ను, రేడియోను, విమానాలను, కంప్యూటర్లను ఇలా ఎన్నింటినో కనుగొని మన సామాజిక జీవనాన్ని సులభతరం చేసిన వారంతా అనేక సవాళ్లనెదుర్కొని, అడుగడుగునా కష్టాలపాలై జీవించినవాళ్ళే. అయితే తమ కృషి, పట్టుదల ద్వారా తమ ప్రత్యేకతను చాటుకొని వాళ్ళు సమాజానికి దిశా నిర్దేశం చేశారు. ఆయుష్షును నిస్పృహతో అరవై, డెబ్భై అంటూ నంబర్లతో నిర్వచించే వాళ్లకు జీవితం విలువ, జీవితాన్ని నడిపే దేవుని విలువ తెలియదు. తన 85 ఏళ్ళ జీవితంలో 45 ఏళ్ళు కాలేబు ఐగుప్తులో ఫరో బానిసగా దుర్భరంగా బతికాడు, ఆ తర్వాత 40 ఏళ్ళు అరణ్యంలో ఒక లక్ష్యం అంటూ లేకుండా అందరితో కలిసి బతకాల్సి వచ్చింది. ఇపుడు వాగ్దానదేశంలో. సమాధికి సిద్ధంగా ఉన్నామని అంతా భావించే 85 ఏళ్ళ వయసులో, కొండప్రాంతాన్ని తనకిస్తే కొట్లాడి దాన్ని స్వాధీనం చేసుకొంటానని ప్రకటిస్తున్నాడు. అదే చేశాడు కూడా. దేవుణ్ణి ప్రసన్నుని చెయ్యడమే కాదు, ఆయన్ను ఆశ్చర్యపరిచే విశ్వాసం ఇది. దేవుడు తమతో ఉన్నాడని నమ్మేవాళ్ళెపుడూ ఆయన ఆశీర్వాదాలకు నిలయంగానే ఉంటారు. వాళ్ళెక్కడ కాలు పెడితే అక్కడికి ఆశీర్వాదాలు కూడా వెళ్తాయి. ‘వారు బాకాలోయలో వెళ్తూ దాన్ని జలమయం చేస్తారన్నది దేవుని వాగ్దానం (కీర్తన 84:6). కొందరు కాలు పెడితే పచ్చని స్థలాలు కూడా ఎడారులవుతాయి, మరికొందరు నడిస్తే అది ఎడారైనా నీటి వూటలతో నిండి సస్యశ్యామలమవుతుంది. విశ్వాసుల బాటను దేవుడే అలా మార్చుతాడు – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ prabhukirant@gmail.com -
నీ వెనుక రావడానికి ఆయనెప్పుడూ సిద్ధమే!
‘నీవు వటువువా! గృహస్థువా! సన్యాసివా! యతివా! ఎవరికి కావాలి ? నీ హృదయ పద్మాన్ని తీసి పరమేశ్వరుడి పాదాల దగ్గర పెట్టావా, లేదా! అలా పెడితే నీ వెంట పరిగెతి రావడానికి పరమేశ్వరుడు సిద్ధంగా ఉన్నాడు.’’ అంటారు శంకరాచార్యుల వారు శివానంద లహరిలో. అన్నమాచార్యుల వారు అదే భావనతో కీర్తన చేస్తూ..‘‘కుమ్మర దాసుడైన కురువరతినంబి రమ్మన్న చోటికి వచ్చి అంతగా కోర్కె తీర్చినవాడివే’’ అంటూ తరువాత చరణంలో ‘‘దొమ్ములు సేసినయట్టి తొండమాన్ చక్కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు’’ అంటారు. ఈ తొండమాన్ చక్రవర్తి ఎవరు ?పూర్వకాలంలో సుధర్మడునే రాజు ఉండేవాడు. ఆయన కపిలతీర్థం దగ్గరికి వచ్చారు. అక్కడ స్నానాలు చేస్తున్న సమయంలో పాతాళ లోకాన్ని పరిపాలించే ధనంజయుడనే నాగలోకపు ప్రభువు కుమార్తె అక్కడ జలకాలాడుతూ కనపడింది. ఆమె అంగీకారంతో ఆయన ఆమెను గాంధర్వ వివాహం చేసుకున్నాడు. వారు కొంతకాలం అక్కడ ఉన్న దొండపొదలలో విహరించారు. ఆమె గర్భందాల్చి పుట్టింటికి వెడుతుంటే..‘‘నీకు కుమారుడు కలిగి పెద్దయిన తరువాత వాడిని నా దగ్గరికి పంపేటప్పుడు నేను గుర్తుపట్టడానికి వీలుగా దొండ తీగలను నడుముకు చుట్టుకుని ఈ రాజముద్రికను వేలికి పెట్టుకుని రమ్మనమను. అలా వస్తే నేను సులభంగా గుర్తుపడతాను’’ అని ఉంగరం ఇచ్చి ఆమెకు అభయం ఇస్తాడు. ఆమె తరువాత అలాగే సుధర్ముడి వద్దకు పంపింది. నడుముకి దొండతీగలు చుట్టుకుని వచ్చాడు కనుక ఆయనకు తొండమాన్ అని పేరొచ్చింది. (తొండమాన్ తవ్వించిన చెరువు ఇప్పటికీ ఉంది. ఈయన వేంకటేశ్వరుడి మామగారయిన ఆకాశరాజుకు సోదరుడు. ఇద్దరికీ సమానమైన రాజ్యభాగం ఇచ్చారు). తొండమాన్ జీవితంలో ఒక పొరబాటు చేసాడు. ఒకరోజు కూర్ముడు అనే బ్రాహ్మణుడు ఆయన దగ్గరకు వచ్చి‘మా తండ్రిగారి అస్థికలు గంగలో నిమజ్జనం చేయడానికి కాలినడకన కాశీకి వెడుతున్నాను. నాభార్య గర్భిణి, కొడుకు ఐదేళ్ళవాడు, ఎక్కువ దూరం నడవలేడు. నేను తిరిగొచ్చేదాకా వారి ఆలనాపాలనా మీరు చూడాలి’ అని కోరగా సమ్మతించిన తొండమాన్ వారిని కట్టుదిట్టమైన ఏర్పాట్లతో ఒక భవంతిలో ఉంచి తదనంతరకాలంలో మర్చిపోయాడు. కొంతకాలానికి అక్కడ వారికి ఆహార పదార్థాలు అయిపోయాయి. మరికొంతకాలానికి కూర్ముడు తిరిగొచ్చి తన భార్యబిడ్డలని అప్పగించమని కోరతాడు. అప్పడు వారి విషయం గుర్తొచ్చి మొదట భయపడినా ‘‘వారు స్వామి దర్శనానికి వేంకటాచలం వెళ్ళారు. వచ్చేస్తారు. అప్పటిదాకా సత్రంలో ఉండండి భోజన సంభారాలు ఏర్పాటు చేయిస్తాను’ అని చెప్పి పంపుతాడు. తొండమాన్ వెంటనే తన కుమారుడిని పంపి వాళ్ళకోసం వాకబు చేయించాడు. వెళ్ళినవాడు తిరిగొచ్చి ‘‘ఆహారం లేక వారు మరణించారు. అక్కడ అస్థిపంజరాలు పడి ఉన్నాయి’’ అన్నాడు. భయపడిపోయిన తొండమాన్ ఆనంద నిలయానికి పరుగున వెళ్ళి స్వామి పాదాలను ఆశ్రయించాడు. తన భక్తుడివై, రాజువై ఉండి మాట ఇచ్చి తప్పి ఇంతటి ఘాతుకానికి కారణమయ్యావు. అయినా రక్షిస్తా. అస్థి తీర్థంలో(ఇప్పటికీ ఉంది) నేను మెడలోతు నీళ్ళలో మునిగి ఉంటా. వెంటనే వెళ్ళి అస్తికలు తెచ్చి ఒడ్డున పెట్టి ఆ తీర్థం నీళ్ళతో ప్రోక్షణ చెయ్యి.’’ అని ఆదేశించాడు. ఆ తరువాత వాళ్ళు బతికారు.అప్పటివరకు భక్తులతో మాట్లాడుతుండే స్వామివారు ‘ఈనాటినుంచి నేనిక మాట్లాడను. నేనేదయినా చెప్పవలసి వస్తే అర్చకులమీద ఆవహించికానీ, మరో రూపంలో కానీ నా మనోగతాన్ని తెలియచేస్తాను’ అని ప్రకటించారని చెబుతారు. -
పదివేల చేతుల పడగలమయం
‘కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు...’, ‘అదివో అల్లదివో శ్రీహరి వాసమూ...’ వంటి కీర్తనలు వినని తెలుగువారుండరు, అలాగే అన్నమయ్య పేరు కూడా. దేశంలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో, మరీ ముఖ్యంగా తెలుగునాట... జీవితంలో ఎవరికి ఏ కష్టమొచ్చినా ఏ దేవుడిని తలచుకుంటారో ఆయనతో జీవితమంతా పెనవేసుకుపోయిన వాడు పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమాచార్యులు. కడప జిల్లా, రాజంపేట తాలూకా, తాళ్ళపాక గ్రామవాసులయిన నారాయణ సూరి, లక్కమాంబల కుమారుడే అన్నమయ్య. తండ్రి మహాపండితుడు. దంపతులిద్దరూ చెన్నకేశవ స్వామి, వేంకటాచలపతి భక్తులు. నారాయణ సూరి భార్యను కూర్చోపెట్టుకుని కావ్యాలు చెబుతుండేవాడు. మహాభక్తుల స్థితి అలా ఉంటుంది. సమాజంలో సంస్కారం అనేది కుటుంబ యజమాని నుండే ప్రారంభం కావాలి. సుప్రసిద్ధ రచయిత వాకాటిపాండురంగారావు గారు గతంలో ‘దిక్సూచి’ అనే వ్యాసంలో– ‘‘సినిమాకు కుటుంబంతోసహా వెళ్ళడానికి త్వరపడుతున్న సమయంలో పిల్లవాడు వచ్చి తండ్రి చేయి పట్టుకుని నాన్నగారూ, ఇంద్ర ధనుస్సు అంటే ఏమిటండీ’ అని అడిగితే... పట్టించుకోకుండా సినిమాకు పరుగులు తీసే తండ్రి ఈ జాతికి పెద్ద బరువు’ అని రాసారు. అందుకే సంస్కారం అనేది ఇంటి యజమాని దగ్గర ప్రారంభం కావాలని అనేది. నారాయణ సూరి భార్యను కూర్చోబెట్టుకుని తనకి తెలిసున్నవి అన్నీ చెబుతుండేవాడు. దోగాడుతూ(పారాడుతూ) తిరిగే వయసులో అన్నమయ్యకి ఈ సంభాషణ ఎంతవరకు అర్థమయ్యేదో తెలియదు కానీ, అక్కడ చేరి ఊ కొడుతుండేవాడట. కొద్దిగా పెద్దవాడవుతున్నాడు అన్నమయ్య. పెద్దవాళ్ళు పసిపిల్లలని కూర్చోబెట్టుకుని రెండు చేతులెత్తించి ‘గోవిందా’ అంటూ ఆడిస్తుంటాం కదా. అన్నమయ్య తన తోటిపిల్లలతోకూడా చేతులెత్తించి గోవిందా అనిపిస్తూ, తాను స్వయంగా పాటలు పాడుతూ, వాటికి తగ్గట్టుగా అడుగులు వేస్తూ, తోచినట్లుగా నాట్యం చేస్తూ తిరుగుతూ ఉండేవాడట. వారిది ఉమ్మడి కుటుంబం. ఉమ్మడిగా ఉంటున్నప్పుడు సహజంగా ఏవో అప్పుడప్పుడు మాటలు, పట్టింపులు వస్తుంటాయి. ‘ఇలా గాలికి తిరుగుతున్నాడు, ఒక్కనాడూ ఏ ఒక్క పనీ చేయడు. దానికి తోడు చేతిలో ఆ తుంబుర ఒకటి....’ అంటూ పశువులకు మేతకోసం ఊరి బయటికి వెళ్ళి గడ్డికోసుకు వస్తుండమన్నారు. అలా వెళ్ళి గడ్డికోసే క్రమంలో ఓ రోజున కొడవలి తగిలి చిటికెన వేలు తెగింది. రక్తం కారుతోంది. ‘అమ్మా !..’ అని అరుస్తూ ఆ వేలు పట్టుకుని దిక్కులు చూస్తున్నాడు. అల్లంత దూరంలో భాగవతుల బృందం ఒకటి గోవింద నామస్మరణ చేస్తూ వెడుతున్నది.అన్నమయ్య ఒక్కసారి తన గ్రామం వంక చూసాడు. ఈ గడ్డికోయడానికి, ఈ పశువుల వెంట తిరగడానికా ఈ జన్మ?’ అనిపించిందేమో...అయినా వైరాగ్యం ఎంతలో రావాలి కనుక! ఆ గోవిందుడిని చేరుకోవడానికి ఆ బృందం వెంట వెళ్ళిపోయాడు. కొండ ఎక్కుతున్నాడు. చుట్టూ చాలా కొండలు... ‘శ్రీహరి వాసం, పదివేల చేతుల పడగలమయం’లా కనిపించింది. ఎక్కలేక సొమ్మసిల్లి పడిపోయాడు. పద్మావతీ దేవి ఒడిలో కూర్చోబెట్టుకుని సేదదీరుస్తున్నట్లు అనిపించసాగింది.‘ఈ చెట్లు, పుట్టలు, పొదలు ఎన్నో జన్మలు తపస్సు చేసిన మహర్షులవి, సిద్ద పురుషులవి. ఈ రాళ్ళన్నీ సాలగ్రామాలే...ఎటు చూసినా ఓం నమో నారాయణాయ.. అంటూ తపస్సు చేస్తున్నవారే...’’ అని తనకి చెబుతున్నట్లు అనిపించసాగింది. వెంటనే అప్రయత్నంగా అమ్మవారి మీద దండకం చెప్పేసాడు. -
ఆ తాంబూలం ఇలా నోట్లోపడిందా!
అమ్మవారి కబరీబంధం(జడ)లో ఎంత గొప్పదనం ఉందో తెలుసా....శ్యామశాస్త్రిగారు తన కీర్తనలో ‘అలమేలవేణీ కీరవాణీ, శ్రీ లలితే హిమాద్రిసుతే పాహిమాం..’’ అంటూ అదే అంటారు. అమ్మవారి జుట్టు నల్లగా ఉంటుందట. అమ్మవారు ఎప్పటిది? ఇవ్వాళ్టిదా, నిన్నటిదా ? ‘అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల బె/ద్దమ్మసురారులమ్మ కడుపారడి బుచ్చిన యమ్మదన్నులో/నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ మాయమ్మ...’ అంటారు పోతనగారు. మరి అంత వృద్ధురాలయిన తల్లి, కాలగతిలో ఇన్నేళ్ళ నుంచి ఉన్న తల్లి కదా! అమ్మ, ఎంత ముసల్దయి పోయి ఉండాలి? అమ్మ జుట్టు తెల్లగా ఉండాలి కదా! మరి నల్లగా ఉండడమేమిటి? అంటే – పిచ్చివాడా! కాలగతిలో శరీరాలలో వచ్చే మార్పులు మనకు కానీ, అమ్మ కన్యాకుమారి కదా. అందుకే పరమశివుడి ప్రస్తావన ఎప్పుడు వచ్చినా ఆయన నిత్య యవ్వనుడంటారు. అమ్మవారు–నిత్య యవ్వనా మదశాలిని. తాంబూలం వేసుకుని పతివ్రతా లక్షణంతో పెద్ద కేశపాశంతో ఉంటుంది అమ్మ. దాన్ని దర్శనం చేస్తే ఇన్ని జన్మలనుంచి పేరుకు పోయిన అజ్ఞాన తిమిరాల్ని పోగొట్టగలిగిన భాస్కర దర్శనం కబరీబంధ దర్శనంగా కనపడుతుందట. అటువంటి దర్శనం చేసి నీ పాద సేవ చేయాలనే ఉత్తమమైన కోర్కెలు మాలో ప్రచోదనం చేసి వాటిని తీర్చే స్వరూపమున్న వరదే... హిమగిరి సుతే పాహిమాం... అమ్మా! అటువంటి నీలవేణి కలిగిన నా తల్లీ...నిన్ను శరణు వేడుతున్నాను.కీరవాణీ అని కూడా అంటున్నారు శ్యామశాస్త్రి గారు. అమ్మా! నీ పలుకెటువంటిదో తెలుసా! లలితా సహస్రనామంలో వ్యాసభగవానులంటారు...‘‘పక్కన సరస్వతీదేవి కూర్చుని వీణ వాయిస్తూ పరమశివుడి వైభవాన్ని కీర్తనగా ఆలపిస్తున్నదట. అమ్మవారు వింటూ వింటూ ఒక్కసారి ‘శెహభాష్’ అందట! అలా అనేటప్పటికి అమ్మవారి చెవులకున్న తాటంకాలు ఊగాయట.. అలా ఊగుతుంటే వాటి ప్రతిబింబాలు అద్దాల్లా మెరిసిపోతున్న అమ్మవారి చెక్కిళ్ళ మీద పడి ప్రతిఫలించాయట. అమ్మవారు తాంబూల చర్వణం చేస్తుందేమో... నోరు ఎర్రగా ఉంటుంది. ‘శెహభాష్’ అనేటప్పటికి నోరు తెరుచుకుందట. ఈ ప్రపంచంలో వేదం నేర్చుకున్న మహాపురుషులందరూ అమ్మవారి దంతపంక్తిగా ఉన్నారట. ఎర్రటి నాలుక. ఆ తాంబూలం ఇలా నోట్లో పడిందా... మూకుడు మహాకవి అయిపోయాడు. కాళిదాసుగారి నాలుక మీద బీజాక్షరాలు రాసిన వెంటనే... ‘‘జయజననీ...సుధాసముద్రాంత హృద్యన్మణిద్వీప సంరూఢ బిల్వాటవీమధ్య కల్పద్రుమాకల్ప కాదంబ కాంతారవాస ప్రియే... కృత్తివాస ప్రియే సర్వలోక ప్రియే...సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోల నీపస్రగాబద్ధ చూళీ సనాథత్రికే సానుమత్పుత్రికే....’’... అంటూ ఆయన శ్యామలా దండకం చెప్పేసారు. అటువంటి వైభవాన్ని ఇవ్వగలిగిన తల్లీ...అటువంటి నీలవేణీ...అటువంటి కీరవాణీ... నువ్వు శెహభాష్ అనేటప్పటికి ఇంత కచ్చేరీ చేసిన సరస్వతీ దేవి ఉలిక్కిపడి..‘అమ్మో ! ఈవిడ శెహభాష్ అంటేనే ఇంత అందంగా అంది. ఈవిడే పాట పాడితేనా...అని భయపడి తన వీణ సర్దుకుని వెళ్ళిపోయిందట. అటువంటి వాక్కున్న దానివమ్మా! కీరవాణివి. చిలక పలుకులు ఎలా ఉంటాయో అటువంటి పలుకులు ఉన్నదానివి..అటువంటి నువ్వు ఒక్కసారి..‘‘ఒరే శ్యామశాస్త్రీ! బాగుందోయ్ నీ కీర్తన ’అన్నావనుకో అమ్మా, నా జన్మకెంత చరితార్థకత తల్లీ!’’ ఇదీ ఆయన ఆర్తి. -
కీర్తనల్లో...ద్రాక్ష, అరటి, కొబ్బరి
దక్షిణాదిన ఒక నానుడి ఉంది. త్యాగరాజ కీర్తనలు ద్రాక్షపళ్ళలాంటివి...నోట్లో వేసుకుని చిదిమితే చాలు, పులకించిపోతాం. శ్యామశాస్త్రి గారి కీర్తనలు కదళీఫలం లాంటివి. కొంచెం కొంచెంగా తొక్క ఒలుచుకుని తింటుంటేనే అరటి పండును ఆసాంతం సంతృప్తిగా ఆస్వాదించగలం. ముత్తుస్వామి దీక్షితులు గారి కీర్తనలు నారికేళ పాకం లాంటివి. కొబ్బరి బోండాం తెచ్చి, పీచు తీసి, పగుల కొట్టి, కొబ్బరి తీసి, తురిమి, పాకం పట్టించి తింటే తప్ప ఆ ఆనందం తెలియదు. దంతసిరి కూడా ఉండాలి. లేకపోతే పళ్ళమధ్య ఇరుక్కుపోతున్నవాటిని సభా గౌరవం కూడా పాటించకుండా పుల్లలతో గుచ్చుకుంటుండాలి. అంటే ముగ్గురివి అటువంటి స్థాయి కలిగిన కీర్తనలు. శ్యామశాస్త్రి గారికి శ్రీవిద్యా సంప్రదాయం అంటే కరతలామలకం. సాక్షాత్ అమ్మవారిని ఉద్దేశించి చేసిన కీర్తనలో ఎన్ని రహస్యాలు దాచారో.. అదొక అద్భుత కీర్తన...‘‘హేమాద్రిసుతే పాహిమాం వరదే పరదేవతే/సుమేరు మధ్య వాసినీ అంబ శ్రీకామాక్షి/శ్యామకృష్ణ సోదరీ గౌరీ పరమేశ్వరీ గిరిజా/అలమేలవేణీకీరవాణీ శ్రీలలితే.....’’ పాహిమాం వరదే పరదేవతే అని చిట్టచివరి చరణంలోకి వెళ్ళేటప్పటికి శ్రీలలితే అని చేసారు. ఆయన అమ్మవారిని పిలుస్తున్నారు. రాజగోపురంలో కూర్చుని ఒళ్ళు మరిచి సంకీర్తన చేస్తుంటే... అమ్మవారు చిన్నపిల్ల రూపంలో ఒంటినిండా నగలు ధరించి చేత్తో పాలు పట్టుకొచ్చి..‘అన్నయ్యా! అన్నయ్యా!!!’ అని పిలిచి ఇచ్చేది. అవి తాగేవారు ఆయన. ఇంటికొచ్చి వారి అమ్మనడిగేవారు..‘‘చెల్లిని ఎందుకు పంపావు ?’’ అని.‘నీ చెల్లీ రాలేదు, నేనూ పంపలేదు’ అని ఆమె అనేవారట. అందుకే ఎక్కువగా ఆయన కీర్తనలలో చివర ‘శ్యామకృష్ణ సహోదరీ’ అని చేర్చారు. ఒక అర్థంలో కామాక్షీదేవిని వాళ్ళ ఇంటి ఆడపడుచు–అని, మరొక అర్థంలో విష్ణు సహోదరి అయిన అమ్మవారు– అని అర్థం వచ్చేలా ఉంటుంది. త్యాగరాజుగారు ‘త్యాగరాజనుత’ అని వేసుకున్నట్లుగానే, శ్యామశాస్త్రిగారు ‘శ్యామకృష్ణ సహోదరి’ అనీ, ‘శ్యామకృష్ణ పూజిత’ అని వేసుకున్నారు.అనేకమంది మహర్షులకు నిలయం హిమవత్ పర్వతం. ఎందరో అక్కడ ధ్యానం చేస్తుంటారు. అటువంటి హిమవత్ పర్వత రాజయిన హిమవంతుడి భార్య మేనక. దక్షప్రజాపతి కుమార్తె దాక్షాయణిగా ఉండి హిమాలయాల్లో సంచరిస్తుండగా ఆమెను చూసిన మేనక –‘నాకు ఇటువంటి కుమార్తె ఉంటే బాగుండును’ అనుకున్న కారణంగా ఆమె హైమవతి గా జన్మించింది. ప్రపంచంలోని పర్వతాలన్నింటిలోకి శ్రేష్టమయినదిగా పిలవబడే హిమవత్పర్వతం... దానికి రాజయిన హిమవంతుడికి కుమార్తె అయిన దానా... వరదే.. అంటే వరములిచ్చేది... ఇక్కడ ఆ తల్లిని అడుగుతున్నది మామూలు వరాలు కాదట. ఏ ఆనందాన్ని అనుభవించడం చేత అటువంటి సుఖం కలుగుతుందో అటువంటి ఆనందం కేవలం పరమేశ్వరుని పాదాలనుంచి స్రవించే అమృతంలో తప్ప మరొక దానిలో లేదు. అటువంటి పాదసేవ కోర్కెను తీర్చగలిగే తల్లి కనుక ‘వరదే’ అన్నారు. అంటే లౌకికమైన స్థితినుంచి అలౌకికమైన స్థితిని పెంచడానికి అవకాశమున్న భక్తి సామ్రాజ్యానికి పట్టాభిషిక్తునిగా చేయగలిగిన దానివి. అందుకని .. వరదే.. అన్నారు. ఆ తల్లిని అడుగుతున్నది మామూలు వరం కాదు. ఆ వరానికి ‘కాదంబరి’ అన్న నామంతో సంబంధం ఉంది. ఈ కీర్తన గొప్పతనం ఎంతంటే.. .అది ప్రతిరోజూ విన్నంత మాత్రం చేత అద్భుతమైన వాక్శక్తినీ, వాఙ్మయ ధారను అమ్మవారు కటాక్షించ గలుగుతుంది. -
అలరించిన అన్నమయ్య కీర్తనలు
అనంతపురంలోని లలిత కళాపరిషత్‌లో ఆదివారం శ్రీ నృత్య కళానిలయం ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నమయ్య అష్టోత్తర శత సంకీర్తనార్చన ఆకట్టుకుంది. 150 మంది కళాకారుల గాత్రాలతో ఏకధాటిగా 108 అన్నమయ్య సంకీర్తనలను ఆలపించారు. ఏకరూప వస్త్రధారణతో గాయనీమణులు తమదైన గాత్రమాధుర్యంతో ఆహూతులను మంత్రముగ్ధులను చేశారు. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు విద్యార్థులు ఏకధాటిగా అన్నమయ్య సంకీర్తనలు ఆలపించారు. ఈ కార్యక్రమాన్ని ప్రపంచ రికార్డులో నమోదు చేయడానికి ‘అనంత’కు విచ్చేసిన నిర్వాహకులు చిన్నారుల గళాలకు తాము ముగ్ధులైనట్లు ప్రకటించారు. - అనంతపురం