ఆ తాంబూలం ఇలా నోట్లోపడిందా! | Whenever the Mention of Lord Shiva is Coming He Will Be Eternal | Sakshi
Sakshi News home page

ఆ తాంబూలం ఇలా నోట్లోపడిందా!

Published Sun, Apr 28 2019 12:37 AM | Last Updated on Sun, Apr 28 2019 12:37 AM

Whenever the Mention of Lord Shiva is Coming He Will Be Eternal - Sakshi

అమ్మవారి కబరీబంధం(జడ)లో ఎంత గొప్పదనం ఉందో తెలుసా....శ్యామశాస్త్రిగారు తన కీర్తనలో ‘అలమేలవేణీ కీరవాణీ, శ్రీ లలితే హిమాద్రిసుతే పాహిమాం..’’ అంటూ అదే అంటారు. అమ్మవారి జుట్టు నల్లగా ఉంటుందట. అమ్మవారు ఎప్పటిది? ఇవ్వాళ్టిదా, నిన్నటిదా ? ‘అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల బె/ద్దమ్మసురారులమ్మ కడుపారడి బుచ్చిన యమ్మదన్నులో/నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ మాయమ్మ...’ అంటారు పోతనగారు. మరి అంత వృద్ధురాలయిన తల్లి, కాలగతిలో ఇన్నేళ్ళ నుంచి ఉన్న తల్లి కదా! అమ్మ, ఎంత ముసల్దయి పోయి ఉండాలి? అమ్మ జుట్టు తెల్లగా ఉండాలి కదా! మరి నల్లగా ఉండడమేమిటి?  అంటే – పిచ్చివాడా! కాలగతిలో శరీరాలలో వచ్చే మార్పులు మనకు కానీ, అమ్మ కన్యాకుమారి కదా.

అందుకే పరమశివుడి ప్రస్తావన ఎప్పుడు వచ్చినా ఆయన నిత్య యవ్వనుడంటారు. అమ్మవారు–నిత్య యవ్వనా మదశాలిని. తాంబూలం వేసుకుని పతివ్రతా లక్షణంతో పెద్ద కేశపాశంతో ఉంటుంది అమ్మ. దాన్ని దర్శనం చేస్తే ఇన్ని జన్మలనుంచి పేరుకు పోయిన అజ్ఞాన తిమిరాల్ని పోగొట్టగలిగిన భాస్కర దర్శనం కబరీబంధ దర్శనంగా కనపడుతుందట. అటువంటి దర్శనం చేసి నీ పాద సేవ చేయాలనే ఉత్తమమైన కోర్కెలు మాలో ప్రచోదనం చేసి వాటిని తీర్చే స్వరూపమున్న వరదే... హిమగిరి సుతే పాహిమాం... అమ్మా! అటువంటి  నీలవేణి కలిగిన నా తల్లీ...నిన్ను శరణు వేడుతున్నాను.కీరవాణీ అని కూడా అంటున్నారు శ్యామశాస్త్రి గారు. అమ్మా! నీ పలుకెటువంటిదో తెలుసా! లలితా సహస్రనామంలో వ్యాసభగవానులంటారు...‘‘పక్కన సరస్వతీదేవి కూర్చుని వీణ వాయిస్తూ పరమశివుడి వైభవాన్ని కీర్తనగా ఆలపిస్తున్నదట.

అమ్మవారు వింటూ వింటూ ఒక్కసారి ‘శెహభాష్‌’ అందట! అలా అనేటప్పటికి అమ్మవారి చెవులకున్న తాటంకాలు ఊగాయట.. అలా ఊగుతుంటే వాటి ప్రతిబింబాలు అద్దాల్లా మెరిసిపోతున్న అమ్మవారి చెక్కిళ్ళ మీద పడి ప్రతిఫలించాయట. అమ్మవారు తాంబూల చర్వణం చేస్తుందేమో... నోరు ఎర్రగా ఉంటుంది. ‘శెహభాష్‌’ అనేటప్పటికి నోరు తెరుచుకుందట. ఈ ప్రపంచంలో వేదం నేర్చుకున్న మహాపురుషులందరూ అమ్మవారి దంతపంక్తిగా ఉన్నారట. ఎర్రటి నాలుక. ఆ తాంబూలం ఇలా నోట్లో పడిందా... మూకుడు మహాకవి అయిపోయాడు. కాళిదాసుగారి నాలుక మీద బీజాక్షరాలు రాసిన వెంటనే... ‘‘జయజననీ...సుధాసముద్రాంత హృద్యన్మణిద్వీప సంరూఢ బిల్వాటవీమధ్య కల్పద్రుమాకల్ప కాదంబ కాంతారవాస ప్రియే... కృత్తివాస ప్రియే సర్వలోక ప్రియే...సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోల నీపస్రగాబద్ధ చూళీ సనాథత్రికే సానుమత్పుత్రికే....’’... అంటూ ఆయన శ్యామలా దండకం చెప్పేసారు.

అటువంటి వైభవాన్ని ఇవ్వగలిగిన తల్లీ...అటువంటి నీలవేణీ...అటువంటి కీరవాణీ... నువ్వు శెహభాష్‌ అనేటప్పటికి ఇంత కచ్చేరీ చేసిన సరస్వతీ దేవి ఉలిక్కిపడి..‘అమ్మో ! ఈవిడ శెహభాష్‌ అంటేనే ఇంత అందంగా అంది. ఈవిడే పాట పాడితేనా...అని భయపడి తన వీణ సర్దుకుని వెళ్ళిపోయిందట.  అటువంటి వాక్కున్న దానివమ్మా! కీరవాణివి. చిలక పలుకులు ఎలా ఉంటాయో అటువంటి పలుకులు ఉన్నదానివి..అటువంటి నువ్వు ఒక్కసారి..‘‘ఒరే శ్యామశాస్త్రీ! బాగుందోయ్‌ నీ కీర్తన ’అన్నావనుకో అమ్మా, నా జన్మకెంత చరితార్థకత తల్లీ!’’  ఇదీ ఆయన ఆర్తి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement