ఒక బల్లెంతో వెనుకనుంచి వచ్చే శత్రువుల్ని పొడిచి.. ముందున్న వాళ్లను కత్తులతో చీల్చేసి.. ఇంతలో ‘‘కాటేరమ్మ రాలేదు కానీ, బదులుగా కొడుకుని పంపింది అమ్మ’’ అని డైలాగ్‌పడగానే.. అపరకాళిలా అవతారం కటౌట్‌లో ప్రభాస్ అబ్బో రోమాంఛితమైన ఆ సలార్ సీన్.. ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్.. విజిల్స్‌తో థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. ఇంతకీ ఈ కాటేరమ్మ కథ గురించి తెలుసా?
ద్రవిడ సంస్కృతి నుంచి ఉద్భవించి హిందూ ఆరాధన దైవంగా మారింది శ్రీ కాటేరీ దేవత. నమ్ముకున్నవాళ్లకు అండగా ఉంటూ.. దుష్ట సంహారం చేసే దేవతే ఈ అమ్మ. దక్షిణ భారత దేశంలో.. మరీ ముఖ్యంగా తమిళనాడులో కాటేరీ అమ్మన్‌గా, కర్ణాటకలో కాటేరమ్మగా Kateramma ఆలయాల్లో కొలువై పూజలు అందుకుంటోంది. పార్వతిదేవి మరో రూపంగా భావించే కాటేరమ్మను.. కలియుగంలో రోగాల్ని నయం చేసేందుకు వెలిసిన దేవతగా పూజిస్తున్నారు. కొన్నిచోట్ల ఊరికి కాపలా దేవతగా.. మరికొన్ని చోట్ల కులదేవతగా తరతరాల నుంచి కొలుస్తున్నారు.
జానపద కథ ప్రచారం..
కైలాసంలో శివుడు నిద్రపోయే సమయంలో పార్వతి దేవి రోజూ రాత్రిళ్లు ఎటో వెళ్లిపోతుంటుంది. సూర్యోదయానికి ముందు తిరిగి కైలాసానికి చేరుతుంది. ఈ చర్యపై శివుడు పార్వతిని నిలదీస్తాడు. తన ప్రమేయం లేకుండానే అలా జరిగిపోతుందంటూ పార్వతి బాధపడుతుంది. ఒకరోజు కైలాసం అడవుల గుండా వెళ్తున్న ఆమెను శివుడు అనుసరిస్తాడు. హఠాత్తుగా కాళి రూపంలోకి మారిపోయి.. శవాలను తవ్వి బయటకు తీసి తినే యత్నం చేస్తుందామె. ఉగ్ర రూపంలో ఉన్న పార్వతిని నిలువరించేందుకు అడవి మార్గంలో పెద్ద గొయ్యిని సృష్టిస్తాడు. ఆమె అందులో పడిపోయి.. తన చర్యలకు పశ్చాత్తాపం చెందుతుంది.
ఇకపై ఇలాంటి చేష్టలకు పాల్పడబోనని శివుడికి మాటిస్తుంది. భయంకరమైన ఈ రూపాన్ని ఆ గొయ్యిలోనే వదిలేసి, విధేయురాలైన భార్య.. పార్వతిదేవిగా వెంట వస్తానని శివుడికి చెబుతుంది. అలా విడిచిపెట్టిన ఆ శక్తి అవతారమే.. కాటేరీ దేవతగా చెబుతుంటారు. తనను నమ్ముకున్న వాళ్లను రక్షించే దయగల దేవతగా, సర్వరోగాల్ని నయం చేసే అమ్మవారిగా వందల ఏళ్ల నుంచి పూజలు అందుకుంటోంది కాటేరమ్మ. ఈ దేవతకు జాతరలు, ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి.
దళిత కమ్యూనిటీలో మరోలా..
అయితే తమిళనాడు, కర్ణాటకలోని దళిత కమ్యూనిటీలు మాత్రం కాటేరమ్మను మరోలా విశ్వసిస్తాయి. శివుడి శాపం చేత ఆమె అడవుల్లో తిరుగుతుంటుందని.. ఈ కారణం చేతనే ఆమె ఉగ్రరూపంలో దర్శనం ఇస్తుందని చెబుతూ కాటేరమ్మను బలి దేవతగా కొలుస్తుంటారు. కాటేరమ్మకు ఇష్ట నైవేద్యంగా వేప ఆకుల్ని భక్తులు పేర్కొంటారు. నిమ్మకాయలు, ఎర్ర పువ్వులతో పూజిస్తారు. జంతు బలిలో కోళ్లను, మేకల్నే కాకుండా పందుల్ని కూడా ఒక్కోసారి బలిస్తుంటారు. కుల దేవతగానూ కాటేరమ్మ దక్షిణ భారతంలో పూజలు అందుకుంటోంది. మద్రాసీ సంస్కృతిలో మద్యం, సిగరెట్లు సైతం సమర్పిస్తుంటారు. మరికొన్ని చోట్ల బలి లేకుండా ప్రసాదాలతో కొలుస్తారు.
ఇదీ చదవండి: సలార్ మూవీ రివ్యూ
శక్తివంతమైన దేవతగా..
కాటేరమ్మ.. అనేక రూపాల్లో దర్శనమిస్తుంది. ఉగ్ర రూపంలోనే కాదు.. శాంత స్వరూపిణిగానూ పూజలు అందుకుంటోంది. నీలి రంగు లేదంటే నలుపు రంగు విగ్రహాల్ని.. ఎక్కువగా నాలుగు భుజాల దేవతగా.. ఒక్కో చేతిలో కత్తి, త్రిశూలం, తామర, గిన్నెతో రూపొందిస్తారు. మరికొన్ని చోట్ల అనేక భుజాలతో ఉగ్రరూపంలో ఏర్పాటు చేస్తారు. దక్షిణ రాష్ట్రాల్లోనే కాదు.. శ్రీలంకలోనూ కొన్ని తెగలు కాటేరమ్మను కొలుస్తారు. ట్రినిడాడ్, గుయానా, జమైకా, మారిషస్, సౌతాఫ్రికాలో స్థిరపడిన తమిళ కమ్యూనిటీ ప్రజల నుంచి కూడా పూజలు అందుకుంటోంది. కన్నడ ప్రజలు కాటేరమ్మగానే కాకుండా.. రక్త కాటేరమ్మగానూ కాటేరీ దేవి ఆరాధ్య దైవం. రోగాలు మాయం చేయడంతో పాటు దుష్టశక్తుల్ని వదిలిస్తుందని నమ్ముతారు. అలా కన్నడనాట శక్తివంతమైన దేవతగా పేరున్న కాటేరమ్మ రిఫరెన్స్‌ను ఇలా ప్రభాస్ ఫైట్ సీన్‌తో Salaar Kateramma Scene ప్రేక్షకులకు రుచిచూపించాడు దర్శకుడు ప్రశాంత్ నీల్.
Comments
Please login to add a commentAdd a comment