అతిపెద్ద హనీ కేక్ తయారీ ద్వారా గిన్నిస్ రికార్డ్ సాధనకు హైదరాబాద్ నగరం వేదిక కాబోతోంది. నగరంలోని మాదాపూర్‌లో ఉన్న హార్లీస్ ఇండియా బేకింగ్ కంపెనీ ఈ వినూత్న ఫీట్‌ను సమర్పిస్తోంది. ఈ విషయాన్ని సంస్థ సీఈఓ సురేష్‌నాయక్ ఓ ప్రకటనలో తెలిపారు. అత్యంత ఆదరణ పొందిన మెడోవిక్ హనీ కేక్ ద్వారా ఈ రికార్డ్ సాధించనున్నామని, దీని కోసం ఇప్పటికే 3వేల కిలోల బరువున్న కేక్‌ను తయారు చేశామని వివరించారు. భారీ కేక్ 7 అడుగుల వెడల్పు, 70 అడుగుల ఎత్తు ఉంటుందన్నారు. గతంలో ఉన్న రికార్డ్ కంటే దాదాపు 10 రెట్లు మిన్నగా ఈ భారీ కేక్ రూపొందిందన్నారు. ఈ భారీ కేక్‌ను శుక్రవారం నగరంలోని మాయా కన్వెన్షన్ సెంటర్‌లో ప్రదర్శించనున్నామని తెలియజేశారు.
ఏళ్ల వయసు.. 16 వేల అడుగుల ఎత్తు..
16 ఏళ్లకే 16 వేలకుపైగా అడుగుల పర్వతాన్ని అధిరోహించి అరుదైన ఘనత సాధించాడు హైదరాబాద్‌కు చెందిన విశ్వనాథ్ కార్తికేయ. అంటార్కిటికాలోని ఎత్తయిన శిఖరం మౌంట్ విన్సన్ మాసిఫ్(16,050 అడుగులు)ను అధిరోహించిన అతి పిన్న వయసు్కడైన భారతీయుడిగా రికార్డుల్లోకెక్కాడు. నిర్మల్ పుర్జా నేతృత్వంలో బూట్స్, క్రాంపాన్స్–ఎలైట్ ఎక్స్‌పెడ్ బృందంలో విశ్వనాథ్ ఈ నెల 3న శిఖరాగ్రానికి చేరుకున్నాడు. అనంతరం సురక్షితంగా బేస్ క్యాంప్‌నకు చేరుకున్నాడు.
నవంబర్ 21న హైదరాబాద్ నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించి, 25న యూనియన్ గ్లేసియర్‌కు చేరుకున్నాడు. అక్కడి వాతావరణానికి అలవాటు పడిన అనంతరం బేస్ క్యాంప్‌నకు తరలించారు. భిన్నమైన వాతావరణ పరిస్థితులు, సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొని, లక్ష్యాన్ని సాధించాడు. ‘నీకు నచ్చింది చేయడం వల్ల సంతృప్తికరమైన, విజయవంతమైన జీవితం ఉంటుంది’అని తన తల్లి చెప్పేదని ఆయన అన్నారు.
లాంగ్వేజ్.. స్కిల్స్ అందించేందుకు..
పాఠశాల విద్యార్థుల్లో ఆంగ్ల భాషా ప్రావీణ్యాన్ని పెంపొందించేందుకు కోటక్ మహీంద్రా గ్రూప్ ఆధ్వర్యంలోని కోటక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్(కేఈఎఫ్) నడుం కట్టింది. ఇందులో భాగంగా కమ్యూనికేటివ్ ఇంగ్లిష్ ఫ్యూచర్ రెడీ(సిఈ–ఎఫ్‌ఆర్) డిజిటలైజ్డ్ కంటెంట్‌ను ఉపాధ్యాయులకు అందించే ప్రక్రియను ‘వన్ కేఈఎఫ్’ అనే లెర్నింగ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా పలు ప్రాంతాల్లో ప్రారంభించింది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధులు ఓ ప్రకటనలో తెలిపారు.
చదవండి: ఆ విషయంలో మిగిలిన మెట్రో నగరాలన్నింటికన్నా మనమే టాప్
ప్రపంచీకరణ ప్రపంచంలో విజయం సాధించడానికి సంభాషణా చాతుర్యం ముఖ్యంగా ఆంగ్లభాషా నైపుణ్యం ముఖ్యమైనదని, తమ కంటెంట్ ద్వారా విద్యార్థులు భాషా నైపుణ్యంతో పాటు ఇతర సవాళ్లను ఎదుర్కొనే అనేక సామర్థ్యాలను సొంతం చేసుకుంటారన్నారు.
హ్యాండ్లూమ్ ఉత్పత్తులను ఆదరిస్తున్న యువత
సహజసిద్ధ ఉత్పత్తులను తయారు చేసే చేనేతను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని మిసెస్ ఇండియా తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ 2023 విజేత ఛాయాదేవి రుద్రరాజు అన్నారు. బంజారాహిల్స్ రోడ్ నంబర్–12లోని కళింగ కల్చరల్ హాలులో బుధవారం ఏర్పాటు చేసిన జాతీయ చేనేత పట్టువస్త్ర ప్రదర్శనను ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె అక్కడ కొలువుదీరిన చేనేత వ్రస్తోత్పత్తులు తిలకించి చేనేత వస్త్ర తయారీ విధానం, ప్రత్యేకతలను తెలుసుకున్నారు.
భారతీయ సంస్కృతిలో పట్టు, హ్యాండ్లూమ్ వస్త్ర ఉత్పత్తులకు ఎంతో ప్రత్యేకత ఉందని ఆమె అన్నారు. ఆ ఉత్పత్తులకు నేటికీ వన్నె తగ్గలేదన్నారు. నేటితరం యువతలో కూడా హ్యాండ్లూమ్ ఉత్పత్తులను ఎంతో ఆదరిస్తున్నారని, ప్రతి ఒక్కరూ చేనేతకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నిర్వాహకులు మాట్లాడుతూ.. ఈ నెల 8వ తేదీ వరకు కొనసాగుతున్న ఈ ప్రదర్శనలో దేశంలోని 14 రాష్ట్రాల నుంచి చేనేతకారులు 75 వేల రకాల వస్త్ర ఉత్పత్తులను ఇక్కడ అందుబాటులో ఉంచారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment