‘‘కాలుష్యం నిండిన ఆలోచనల్ని దివ్య సంగీతంతో నిర్మూలించండి’’... హైదరాబాద్, మాదాపూర్‌లోని అన్నమయ్య భావన వాహినిలోకి అడుగుపెట్టగానే నిలువెత్తు వేంకటేశ్వరుని విగ్రహం తల మీదుగా ఈ వాక్యం కనిపించింది. అన్నమయ్య భావన వాహిని స్థాపించి మొన్న శనివారం (నవంబర్ 30) నాటికి 36 ఏళ్లు నిండాయి. అన్నమయ్య కీర్తనల గానమే శ్వాసగా కూనిరాగాలు తీసుకుంటూ, ఏవో పేపర్‌లు చూసుకుంటూ కనిపించారు శోభారాజు గారు. చిత్తూరు జిల్లా వాయల్పాడు నుంచి తిరుపతి, హైదరాబాద్ మీదుగా ఖండాంతరాలకు సాగిన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని సాక్షితో పంచుకున్నారు.
‘‘వాయల్పాడులో పురాతనమైన వీరరాఘవ స్వామి ఆలయం ఉంది. ఆ స్వామి మీద అన్నమయ్య రాసిన కీర్తనలు చాలా ఉన్నాయి. మా అమ్మకు అవేవీ తెలియదు, గర్భంతో ఉన్నప్పుడు తరచూ ఆ ఆలయానికి దర్శనానికి వెళ్లేదట. అలా అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి నాకు అన్నమయ్య కీర్తనలతో బంధం ఏర్పడింది. వాయల్పాడు బ్లాక్ డెవలప్‌మెంట్ ఆఫీసర్‌గా ఉన్న మా నాన్నను భారత ప్రభుత్వం ప్రత్యేకమైన బాధ్యతలతో నేపాల్‌కు పంపించింది. అలా నాలుగేళ్ల్ల వయసులో నేపాల్‌లో నా పాఠశాల విద్య మొదలైంది. అక్కడ ఒక గుళ్లో ఎర్రని బాల కృష్ణుడు కళ్లముందు మెదలిన సంఘటన నాకింకా గుర్తుంది.
అయితే అది నా భ్రమనో, వాస్తవమో ఇప్పటికీ తెలియదు. ఆ క్షణంలో ఆ కృష్ణుడి మీద ఆశువుగా పాట పాడాను. ఇండియాకి వచ్చిన తర్వాత బాలానందం, స్కూలు వేడుకల్లోనూ, కర్నూలులో ఉన్నప్పుడు చిన్మయ మిషన్, భగవద్గీత పఠనం, ఇతర సాంస్కృతిక వేడుకల్లో పాటలు పాడేదాన్ని. నాన్నకు ప్రకాశం జిల్లాకు బదిలీ కావడంతో మా చదువుల కోసం కుటుంబాన్ని తిరుపతిలో పెట్టారు. ఇంటర్ పద్మావతి కాలేజ్‌లో చదివాను. కాలేజ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించడంలో ఆరితేరాను. ఎస్వీ యూనివర్సిటీలో బీఏ మ్యూజిక్ చేసేటప్పుడు చండీఘర్‌లో జాతీయ స్థాయి పాటల పోటీల్లో ఎస్వీయూనివర్సిటీని రిప్రజెంట్ చేశాను, నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది.
నా గమ్యం... పాటలే
మా ఇల్లు అలిపిరిలోని వెంకన్న పాదాల గుడికి ఫర్లాంగు దూరంలో ఉండేది. ఏ పోటీలకు వెళ్తున్నా సరే... ఆ గుడికి వెళ్లి స్వామి పాదాలను తల మీద పెట్టుకుని ప్రదక్షణ చేసి ‘నేనిలా వెళ్తున్నాను స్వామీ, ప్రైజ్ ఇప్పించు’ అని అడిగేదాన్ని. డిగ్రీ అయిపోగానే మా అమ్మ ‘పీజీలో చేరకపోతే పెళ్లి చేస్తా’నని బెదిరించింది. ఆ భయంతోనే ఎంఏ హిస్టరీలో చేరాను. పది రోజులకే నా గమ్యం ఇది కాదనిపించి కాలేజీ మానేశాను. రోజూ సాయంత్రం స్వామి పాదాలు మొక్కి, సంగీతంలో నైపుణ్యం కోసం మంచి సంగీతకారుడి దగ్గర శిక్షణ తీసుకునే భాగ్యం కల్పించమని కోరేదాన్ని.
అటు సినిమా ఇటు వేంకటేశ్వరుడు
మద్రాసులో అదృష్టాన్ని పరీక్షించుకుందాం అనే ప్రయత్నంలో ఉండగా... టీటీడీ చైర్మన్ అన్నారావు గారు నా గాత్రం బావుందని అన్నమాచార్య కీర్తనల ప్రచార ప్రాజెక్టులో ఉద్యోగం కోసం అప్లికేషన్ పెట్టమనడం, నాకు స్కాలర్‌షిప్ ఇచ్చి, నేదునూరి గారి దగ్గర శిక్షణ ఇప్పించాలని నిర్ణయించడం జరిగిపోయింది. అప్పుడు నాలో కలిగిన సందిగ్ధం చిన్నది కాదు. ఎటూ తేల్చుకోలేక ‘నువ్వు ఏం చెప్తే అదే చేస్తాను స్వామీ’ అని చెప్పి రోజూ కపిల తీర్థంలోని నమ్మాళ్వార్ ఆలయానికి వెళ్లి ధ్యానం చేశాను. తొమ్మిదో రోజుకి నాలోనే లోపలి నుంచి ఒక తీవ్రమైన అనుభూతి, దృఢమైన సంకల్పం కలిగాయి. ఆ మరుసటి రోజు కొండకు నడిచి వెళ్లి దర్శనం చేసుకున్నాను. తలెత్తి వేంకటేశ్వరస్వామిని చూడగానే దుఃఖం కట్టలు తెంచుకుంది. ‘నాకంటే గొప్ప గాయకులెందరో ఉన్నారు. వాళ్లను కాదని నాకు అవకాశం ఇచ్చావు. జీవితాంతం నీ పాటలే పాడుతాను.
నీ కీర్తనలకు ప్రపంచం అంతటా విస్తృతి కల్పించడానికి నా జీవితాన్ని అంకితం చేస్తాను’ అని ఆ స్వామికి మాటిచ్చాను. టీటీడీ ఇచ్చిన ఆర్డర్ కాపీని తిరుమలలో ఉన్న అన్నమాచార్య వారసులకు చూపించి, 1978 మే ఐదవ తేదీన ఉద్యోగంలో చేరాను. అలా దేవుడిచ్చిన అవకాశాన్ని ఆనందంగా స్వీకరించి స్వామి సేవలో తరిస్తున్న సమయంలో నా మనసు నొచ్చుకునే సంఘటన ఒకటి జరిగింది. దాంతో 1992లో రాజీనామా చేశాను. కొంతకాలం భద్రాచలం రాముడి సేవ చేసి హైదరాబాద్‌కి వచ్చిన తర్వాత 1983, నవంబర్ 30న నా పుట్టినరోజు నాడు ‘అన్నమయ్య భావన వాహిని’ని స్థాపించాను. నా జీవితంలో మరో చేదు అనుభవం కారణంగా నాకు పిల్లలు వద్దనుకున్నాను. నా భర్త కూడా అందుకు అంగీకరించారు. అయితే స్వామి సేవలో భాగంగా దేశవిదేశాల్లో వేలాది మంది పిల్లలకు అన్నమయ్య కీర్తనలు నేర్పించాను.
వారందరిలో నా బిడ్డలను చూసుకున్నాను.
అన్నమయ్య స్త్రీ అభ్యుదయ సమాజాన్ని ఆకాంక్షించారు. కానీ ఇంకా అది రాలేదనడానికి ఎన్నో ఉదంతాలు. నా జీవితమే పెద్ద ఉదాహరణ. స్త్రీ అయిన కారణంగా నా ప్రయాణం ఇంత వరకు ఎదురీతతోనే సాగింది... అలానే కొనసాగుతోంది. నా గొంతులో ఊపిరి ఉన్నంత వరకు పాడుతూనే ఉంటాను. అన్నమయ్య పాటలే నాకు ప్రాణం’’.
– ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి
ఫొటోలు: నోముల రాజేశ్ రెడ్డి
పెండెంట్ అలా వచ్చింది
నా స్టూడెంట్ ఒకామె నన్ను ఎంతగానో ఇష్టపడేది. ఆమెకి ఎనభై ఏళ్లు. ఎప్పుడూ నాకు బంగారు పెండెంట్ చేయిస్తానంటుండేది. అలా నాలుగేళ్లు గడిచాక ఓ రోజు పట్టుపట్టి నన్ను, మా అక్కను షాప్‌కి తీసుకెళ్లిందామె. అపుడు నేను ‘ఓం నమో నారాయణాయ’ అనే అక్షరాలు, వేంకటేశ్వరుడు, అన్నమయ్య ఉండేటట్లు డిజైన్‌ని పేపర్ మీద గీసిచ్చాను. దానిని చేయడానికి లక్షన్నర అవుతుందన్నారు షాపువాళ్లు. అంత ఖరీదైన బహుమతులు తీసుకోకూడదని వచ్చేశాను. నేను అక్కడితో ఆ సంగతి మర్చిపోయాను. కానీ మా అక్క ఆ పేపర్‌ని దాచుకుంది.
మా సిస్టర్స్ అందరూ కలిసి ఈ పెండెంట్ చేసి పబ్లిక్ మీటింగ్‌లో ‘ఎలాంటి అవసరం వచ్చినా అమ్మకూడద’ని చెప్పి మరీ ఇచ్చారు. స్వామి సేవకు డబ్బు లేకపోతే నా దగ్గరున్న బంగారం అమ్మేస్తుంటాను. అలాగే ఆ పెండెంట్‌ని కూడా అమ్మేస్తానని మా అక్క భయం. స్వామి రూపం ఉన్న కారణంగా పెండెంట్‌ని అమ్మకుండా కాపాడుకుంటున్నాను. అయితే స్వామికి కుంభాభిషేకం చేయడానికి డబ్బు సర్దుబాటు కాకపోవడంతో ఓ సారి ఫేస్‌బుక్‌లో అమ్మకానికి పెట్టాను. కానీ స్వామి నన్ను వదిలి వెళ్లడానికి ఇష్టపడలేదు.
అన్నమయ్య నోట... సమసమాజ పాట
అన్నమయ్య పాడిన... ‘అందరికీ శ్రీహరే అంతరాత్మ, నిండార రాజు నిదురించే నిద్ర– బంటు నిద్ర ఒక్కటే, మెండైన బ్రాహ్మణుడు మెట్టుభూమి– చండాలుండేటి సరిభూమి’ అనే పదాల్లోని సామాజిక చైతన్యం ఇప్పటికీ నిత్యనూతనమే. మన సమాజంలో వేళ్లూనికుని ఉన్న కులవ్యవస్థను నిర్మూలించడానికి కంకణం కట్టుకున్న సోషలిస్టు అన్నమయ్య. ఆయన స్త్రీవాది కూడా. ‘పురుషులూ జీవులే, పొలతులూ జీవులే’ అని స్త్రీపురుష సమానత్వాన్ని దాదాపు ఆరువందల ఏళ్ల కిందటే చెప్పాడు.
సమాజంలో అవసరమైన మార్పుని అన్నమయ్య నోటి నుంచి పలికించాడు ఆ శ్రీవేంకటేశ్వరుడు. సంగీతాన్ని పామరులకు అర్థమయ్యే భాషలో చిన్న చిన్న పదాలతో గొప్ప భావాన్ని పలికించిన వాగ్గేయకారుడు ఆయన. నేను కొత్తగా ఏమీ చేయడం లేదు. ఆనాడు అన్నమయ్య పాడిన కీర్తనలను ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి జీవితాన్ని అంకితం చేస్తానని ఆ వేంకటేశ్వరుడికి మాట ఇచ్చాను. ఆ దేవదేవుడికిచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్నమే ఇదంతా.
– పద్మశ్రీ శోభారాజు,
అన్నమయ్య భావన వాహిని స్థాపక కర్త
Comments
Please login to add a commentAdd a comment