
తిరుమల: శ్రీవారి దర్శనం చేసుకునేందుకు ఆలయంలోకి ప్రవేశించే ప్రతి భక్తుడికీ ఉచితంగా లడ్డు ప్రసాదాన్ని సోమవారం నుంచి అందించనున్నామని టీటీడీ అదనపు ఈఓ ఏవీ ధర్మారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన తిరుమలలో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గం నుంచి కాలినడకన వచ్చే 20 వేల మంది భక్తులకు మాత్రమే ఉచిత లడ్డును అందిస్తున్నామని, ఇకపై శ్రీవారిని దర్శించుకునే ప్రతి భక్తుడికీ 175 గ్రాముల లడ్డును ఉచితంగా అందిస్తామన్నారు. గత నెల టీటీడీ బోర్డు తీర్మానం మేరకు ప్రతి భక్తునికి ఉచిత లడ్డును అందించనున్నట్లు చెప్పారు.
రూ.50కు ఎన్ని లడ్డులైనా అందిస్తాం
ప్రస్తుతం శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని అదనంగా కోరుకునే భక్తులకు ఒక్కొక్కటి రూ.50 చొప్పున టీటీడీ ఇప్పటికే అందిస్తోందని ధర్మారెడ్డి చెప్పారు. ఇక ముందు అదే ధరకు కోరుకున్నన్ని అదనపు లడ్డులను అందిస్తామన్నారు. లడ్డు కేంద్రంలో ప్రస్తుతం నాలుగు ఎల్పీటీ కౌంటర్లు పనిచేస్తుండగా వాటి సంఖ్యను 12కు పెంచామని తెలిపారు. భక్తులకు లడ్డుల కొరత లేకుండా ప్రతిరోజూ నాలుగు లక్షల లడ్డులను సిద్ధంగా ఉంచనున్నామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment