తిరుమల: తొలి తెలుగు వాగ్గేయకారుడు, పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు తిరుమలలో నివసించిన స్థలాన్ని నిర్లక్ష్యం చేస్తున్నట్లు కొన్ని పత్రికలు, సామాజిక మాధ్యమాలు దుష్ప్రచారం చేస్తున్నాయని టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి అన్నారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2003లో తిరుమల మాస్టర్ ప్లాన్‌లో భాగంగా వరాహ స్వామి ఆలయం వెనుక మఠాలు, శిథిలావస్థలో ఉన్న నిర్మాణాలు తొలగించారన్నారు.
అప్పట్లో ఆయా మఠాల నిర్వాహకులు ఆ విగ్రహాలను తీసుకెళ్లారన్నారు. వరాహస్వామి ఆలయ పరిసరాల్లో ఉన్న అన్నమయ్య, ఆంజనేయస్వామి విగ్రహాలను కూడా అన్నమయ్య వంశస్థులు తీసుకెళ్లారని తెలిపారు. 2007లో తిరుమల నాలుగు మాడ వీధులను సందర్శించిన కొంతమంది సాధువులు విగ్రహాలను ప్రతిష్టించాలని ప్రతిపాదించగా, ఆగమ సలహా మండలి మాడవీధుల్లో శ్రీవారు తప్ప వేరే విగ్రహాలను పూజించకూడదని నివేదిక సమర్పించిందన్నారు.
శ్రీవారి సేవలో అన్నమయ్య వంశీకులు: శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ, కల్యాణోత్సవం, ఏకాంత సేవల్లో అన్నమయ్య వంశీకులు పాల్గొంటున్నారని ధర్మారెడ్డి చెప్పారు. నిత్యం సహస్ర దీపాలంకరణ సేవలో అన్నమాచార్యుల సంకీర్తనలు ఆలపిస్తారని తెలిపారు. అన్నమయ్య సంకీర్తనలను ప్రాచుర్యంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో 45 ఏళ్ల క్రితమే అన్నమాచార్య ప్రాజెక్ట్ ఏర్పాటు చేసి ఏటా రూ.25 కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు. 1995నుంచి అన్నమయ్య జయంతి, వర్థంతి కార్యక్రమాలను టీటీడీ ఘనంగా నిర్వహిస్తోందన్నారు. తాళ్లపాకలో 108 అడుగుల అన్నమయ్య విగ్రహాన్ని టీటీడీ ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతన జిల్లా పేరును అన్నమయ్య జిల్లాగా నామకరణం చేసిందని వివరించారు. ఎస్వీబీసీ చానల్‌లో యువ కళాకారులతో అన్నమయ్య సంకీర్తనలపై అదివో అల్లదివో కార్యక్రమాన్ని రూపొందిస్తున్నామన్నారు.
14 నుంచి శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు
తిరుమల శ్రీవారి ఆలయంలో 14 నుంచి 16 వరకు మూడు రోజుల పాటు సాలకట్ల వసంతోత్సవాలు నిర్వహించనున్నారు. ఏటా చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లు ఈ ఉత్సవాలను మూడు రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీ. 14వ తేదీ ఉదయం 7 గంటలకు శ్రీదేవి భూదేవి సమేతంగా మలయప్ప స్వామి నాలుగు మాడవీధుల్లో ఊరేగుతారు. అనంతరం వసంతోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు. ఇక్కడ వసంతోత్సవ అభిషేక నివేదనలు పూర్తయ్యాక తిరిగి ఆలయానికి చేరుకుంటారు.
రెండో రోజు 15న శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామి ఉదయం 8 నుంచి 9 గంటల వరకు బంగారు రథాన్ని అధిరోహించి తిరుమాడ వీధుల్లో ఊరేగుతారు. అనంతరం వసంత మండపంలో అర్చకులు వసంతోత్సవాన్ని నిర్వహిస్తారు. చివరి రోజు 16న శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామితో పాటుగా సీతారామలక్ష్మణ ఆంజనేయస్వామి ఉత్సవర్లు, రుక్మిణీసమేత శ్రీకృష్ణస్వామి ఉత్సవమూర్తులు వసంతోత్సవ వేడుకల్లో పాల్గొని తిరిగి సాయంకాలానికి ఆలయానికి చేరుకుంటారు.
ఈ సందర్భంగా రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం 4 వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు. వసంతోత్సవాన్ని పురస్కరించుకుని 14 నుంచి 16 వరకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను, 15న నిజపాద దర్శనం సేవను టీటీడీ రద్దు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment