నూతన కౌంటర్లలో వసతి గదులకు నమోదు చేసుకుంటున్న భక్తులు
తిరుమల: తిరుమలలోని ఆరు ప్రాంతాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా వసతి గదులు పొందే అవకాశాన్ని భక్తులకు కల్పిస్తున్నట్లు టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలోని సీఆర్‌వో వద్ద ఏర్పాటు చేసిన నూతన కౌంటర్లను అదనపు ఈవో శనివారం పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటివరకు సీఆర్‌వో వద్ద మాత్రమే వసతి గదుల రిజిస్ట్రేషన్, కేటాయింపు చేసేవారన్నారు. ఇక్కడ రద్దీ అధికంగా ఉండడం, పార్కింగ్ సౌకర్యం లేకపోవడం వల్ల భక్తులు ఇబ్బందులు పడుతుండటంతో త్వరితగతిన రిజిస్ట్రేషన్ చేసి, గదులు కేటాయించేందుకు తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో నూతన కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
వీటిల్లో సీఆర్‌వో వద్ద రెండు కౌంటర్లు, బాలాజీ మెయిన్ బస్టాండ్ వద్ద రెండు కౌంటర్లు, కౌస్తుభం అతిథి భవనం వద్ద ఉన్న కారు పార్కింగ్ ప్రాంతంలో రెండు కౌంటర్లు, రాంభగీచ బస్టాండ్ వద్ద రెండు కౌంటర్లు, ఎంబీసీ ప్రాంతంలోని శ్రీవారి మెట్టు వద్ద రెండు కౌంటర్లు, జీఎన్‌సీ టోల్‌గేట్ వద్ద ఉన్న లగేజీ కౌంటర్ వద్ద రెండు కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రిజిస్ట్రేషన్ కౌంటర్లలో పేర్లు నమోదు చేసుకున్న భక్తులకు ఎస్‌ఎమ్‌ఎస్ ద్వారా వారికి కేటాయించిన గదుల సమాచారం తెలియజేస్తామన్నారు. అనంతరం వారికి గదులు కేటాయించిన ప్రాంతాల్లోని ఉప విచారణ కార్యాలయాల వద్ద రుసుం చెల్లించి గదులు పొందవచ్చని ధర్మారెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment