అందరికీ ఆరోగ్య సిరి | AP Government is ensuring complete health care to the people with YSR Aarogyasri | Sakshi
Sakshi News home page

అందరికీ ఆరోగ్య సిరి

Published Wed, Jul 15 2020 4:19 AM | Last Updated on Wed, Jul 15 2020 8:21 AM

AP Government is ensuring complete health care to the people with YSR Aarogyasri - Sakshi

సాక్షి, అమరావతి: కాన్పు నుంచి కరోనా దాకా ఎలాంటి వైద్యమైనా ఉచితంగానే అందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకుసంపూర్ణ ఆరోగ్య భరోసా కల్పిస్తోంది. టీడీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ పెద్ద జబ్బులకు చికిత్సలు అందక ప్రైవేట్‌ ఆస్పత్రుల ఛీత్కారాలతో నరకం చవిచూసిన దుస్థితి నుంచి ఇప్పుడు భరోసాగా ఆరోగ్యశ్రీతో చికిత్స పొందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలతో ఆరోగ్యశ్రీలో జబ్బుల సంఖ్య పెరిగింది, వార్షికాదాయ పరిమితీ పెరిగింది. అన్నిటికీ మించి శస్త్ర చికిత్సల అనంతరం రోగి కోలుకునే సమయంలో రోజుకు రూ.225 చొప్పున ప్రభుత్వమే చెల్లిస్తుండటం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. 

మాట ప్రకారం... 
► పాదయాత్రలో ఇచ్చిన మాట ప్రకారం చికిత్స ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చి తొలుత పశ్చిమ గోదావరి, ఇప్పుడు ఈనెల 16 నుంచి మరో ఆరు జిల్లాలకు విస్తరిస్తూ ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయాలపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలలో తాజాగా ఇది అమలులోకి రానుంది.

1,059 నుంచి 1,259 చికిత్సలకు...
► గత సర్కారు హయాంలో ఆరోగ్యశ్రీలో 1,059 చికిత్సలు ఉండగా అది కూడా సరిగా వైద్యం అందేది కాదు. దీంతో చికిత్స ఖర్చు రోగి కుటుంబమే భరించాలి.. లేదంటే చావే శరణ్యం. ఇలాంటి దుస్థితిని తప్పిస్తూ ఇప్పుడు 1,259 చికిత్సలకు పెంచి భరోసా కల్పిస్తూ చికిత్స అందిస్తున్నారు.

ఇతర రాష్ట్రాల్లోనూ వైద్యం...
► రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశ్రీ ద్వారా చెన్నై, హైదరాబాద్, బెంగళూరుల్లో 716 సూపర్‌ స్పెషాలిటీ చికిత్సలు పొందే వీలు కల్పించింది. ఈ ఏడాది మే 30 నాటికి 3,577 మంది రోగులు ఇతర రాష్ట్రాల్లో వైద్యం చేయించుకున్నారు. ఇందు కోసం ప్రభుత్వం రూ.18.80 కోట్లు వ్యయంచేసింది.

వార్షికాదాయ పరిమితి రూ.5 లక్షలకు పెంపు..
► తెల్లకార్డు ఉన్నా లేకపోయినా రూ.5 లక్షల వార్షికాదాయం లోపు ఉన్న వారందరికీ పథకం వర్తింపచేయడంతో 95 శాతం పైగా ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చారు.
► గత ప్రభుత్వం ఆస్పత్రులకు బకాయి పెట్టిన సుమారు రూ.650 కోట్లను రాష్ట్ర  ప్రభుత్వం ప్రైవేటు ఆస్పత్రులకు చెల్లించింది.

దీర్ఘకాలిక జబ్బుల బాధితులకు పెన్షన్‌
► దీర్ఘకాలిక జబ్బులతో మంచానికే పరిమితమైన వారిని ఆదుకునేందుకు ప్రతి నెలా జబ్బును బట్టి రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు ప్రభుత్వం చెల్లిస్తోంది.
► ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చే అందరికీ క్యూ ఆర్‌ కోడ్‌తో హెల్త్‌ కార్డులు(క్విక్‌ రెస్పాన్స్‌ కార్డులు) జారీ ఇప్పటికే Æరాష్ట్రవ్యాప్తంగా మొదలైంది.

కోవిడ్‌కూ ఆరోగ్యశ్రీలో చికిత్స..
► కోవిడ్‌ చికిత్సను తొలిసారిగా ఆరోగ్యశ్రీలో చేర్చిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ కావడం గమనార్హం. కనిష్టంగా రూ.16 వేల నుంచి రూ.2 లక్షల పైచిలుకు వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుంది ఆరోగ్యశ్రీకార్డుతో పనిలేకుండా ఎవరైనా ఉచితంగా చికిత్స పొందవచ్చు.

చికిత్స ఖర్చులు తలచుకుని ఏ ఒక్కరూ భయపడకూడదనే లక్ష్యంతో వైద్యానికి ఎంత వ్యయమైనా ప్రభుత్వమే భరించేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యసేవలు అందేవిధంగా వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీని అమలు చేస్తున్నాం. రాష్ట్రంలో అమలుచేస్తున్న ఈ వినూత్న పథకం వల్ల జబ్బు చేస్తే భయపడే పరిస్థితులుతొలగిపోయాయి’
–డా.కె.ఎస్‌.జవహర్‌రెడ్డి, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ, వైద్య ఆరోగ్యశాఖ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement