అక్రమ మద్యం, నగదు, డ్రగ్స్, ఉచితాలపై నిఘాపెట్టి నియంత్రించండి
ప్రతి ఓటరు తన ఓటుహక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలి
అన్ని పార్టీలకు సమాన అవకాశాలివ్వాలి
సీఎస్‌లు, డీజీపీలు, కేంద్ర ఏజెన్సీలతో కేంద్ర ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్
ఏపీ సీఎస్, డీజీపీ, అధికారుల హాజరు
సాక్షి, అమరావతి: ప్రశాంత వాతావరణంలో స్వేచ్ఛాయుత, హింసారహిత ఎన్నికలు నిర్వహించడమే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించింది. ఇందుకోసం గట్టి చర్యలు తీసుకోవాలని రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులు, కేంద్ర ఏజెన్సీ అధికారులను ఆదేశించింది. ఓటర్లు నిర్భయంగా స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగించుకునేలా పోలింగ్ కేంద్రాలు ఉండాలని సూచించింది. ఎన్నికల తనిఖీల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
ఏ పార్టీ అధికారంలో ఉన్నా అన్ని పార్టీలకు వివిధ అంశాల్లో సమాన అవకాశాలు ఇవ్వాలని సూచించింది. సాధారణ ఎన్నికల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం ఢిల్లీ నుంచి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్, కమిషనర్లు జ్ఞానేష్‌కుమార్, సుఖ్‌బీర్‌సింగ్ సంధు రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలు, కేంద్ర ఏజెన్సీ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లోక్‌సభతో పాటు వివిధ రాష్ట్రాల శాసనసభలకు జరగనున్న ఎన్నికల నిర్వహణలో భాగస్వాములైనవారందరూ సమన్వయంతో చర్యలు తీసుకోవడంపై దిశానిర్దేశం చేశారు.
మద్యం, నగదు, మత్తుపదార్థాలు, ఆయుధాల అక్రమ రవాణా, తాయిలాల పంపిణీపై కఠినమైన నిఘా ఉంచాలని ఆదేశించారు. భద్రతా దళాల తరలింపు, సున్నిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యలు, రాష్ట్రాల సరిహద్దుల్లో చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలిచ్చారు. పోలింగ్ రోజున అంతర్‌రాష్ట్ర సరిహద్దుల్ని మూసేయాలని సూచించారు. నేరస్తులు, సంఘవిద్రోహ శక్తులపై నిఘా ఉంచాలని చెప్పారు. లైసెన్స్‌డ్ ఆయుధాలను సకాలంలో డిపాజిట్ చేయించుకోవాలని, నాన్‌బెయిలబుల్ వారెంట్లను వెంటనే అమలు చేయాలని సూచించారు.
ముప్పు ఎదుర్కొంటున్న నేతలు, అభ్యర్థులకు తగిన భద్రత కల్పించాలని నిర్దేశించారు. వ్యయ పర్యవేక్షణ కట్టుదిట్టంగా ఉండాలని చెప్పారు. ఈ సందర్భంగా ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్ మాట్లాడుతూ ఎక్కడా రీ పోలింగ్‌కు అవకాశం లేని విధంగా ఎన్నికలను సక్రమంగా నిర్వహించాలని సూచించారు. పోలింగ్‌కు 48 గంటల ముందు (సైలెంట్ పీరియడ్) ఓటర్లను ప్రభావితం చేసేందుకు డబ్బు, మద్యం వంటి తాయిలాల పంపిణీకి ప్రయత్నాలు జరుగుతాయని, వాటిని సమర్థంగా అడ్డుకోవాలని చెప్పారు.
కట్టుదిట్టంగా కోడ్ అమలు: సీఎస్ జవహర్‌రెడ్డి
ఈ వీడియో సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డాక్టర్ కె.ఎస్.జవహర్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుండి ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇప్పటివరకు రూ.258 కోట్ల విలువైన నగదు, మద్యం, డ్రగ్స్, ఇతర విలువైన వస్తువులను స్వా«దీనం చేసుకున్నట్టు వివరించారు. రాష్ట్ర సరిహద్దుల్లో 150 చెక్‌పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో 132 ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్టులు, 632 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు నిరంతరం పనిచేస్తున్నాయని ఆయన చెప్పారు.
పటిష్ట భద్రత: డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి
డీజీపీ కె.వి.రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ సరిహద్దు రాష్ట్రాలైన ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ల నుంచి మావోయిస్టుల సమస్య ఉండే 91 పోలింగ్ కేంద్రాలను గుర్తించి కట్టుదిట్టమైన భద్రతాచర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఇటీవల మహారాష్ట్రకు పంపిన 10 కంపెనీల పోలీసు బలగాలను తిప్పి పంపడమేగాక అదనపు బలగాలను పంపాలని ఆయన కోరారు. ఏపీసీఈవో ముఖేశ్‌కుమార్ మీనా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు నీరబ్‌కుమార్‌ప్రసాద్, రజత్‌భార్గవ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీశ్‌కుమార్ గుప్త, అదనపు డీజీపీ బాగ్చి, పన్నుల చీఫ్ కమిషనర్ గిరిజాశంకర్, ఎక్సైజ్ కమిషనర్ వివేక్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment