నాలుగు వైద్య కళాశాలలకు రూ.2,050 కోట్లు | Rs 2050 Crore For Four Medical Colleges In AP | Sakshi
Sakshi News home page

నాలుగు వైద్య కళాశాలలకు రూ.2,050 కోట్లు

Published Sun, Sep 13 2020 4:15 AM | Last Updated on Sun, Sep 13 2020 4:15 AM

Rs 2050 Crore For Four Medical Colleges In AP - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతీ పార్లమెంట్‌ నియోజకవర్గంలో ఒక కొత్త వైద్య కళాశాల నిర్మించ తలపెట్టిన సర్కారు.. తాజాగా నాలుగు వైద్య కళాశాలలకు రూ.2,050 కోట్ల మేర పరిపాలనా అనుమతులిచ్చింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ డా.కేఎస్‌ జవహర్‌రెడ్డి శనివారం ఉత్తర్వులు జారీచేశారు. మచిలీపట్నం, పిడుగురాళ్ల, పులివెందుల, పాడేరు కళాశాలలకు ఈ నిధులు మంజూరు చేశారు. ఇవికాక.. అమలాపురం, ఏలూరు, పిడుగురాళ్ల, మదనపల్లె, ఆదోని, పులివెందుల మెడికల్‌ కాలేజీల స్థలాల నిమిత్తం ఒక్కో కాలేజీకి రూ.104.17 కోట్లు కేటాయిస్తూ పరిపాలనా అనుమతులిచ్చింది. ఇప్పటికే ఈ కళాశాలల డిజైన్లు పూర్తయ్యాయి. దీనికి సంబంధించిన పనులకు కన్సల్టెంట్లనూ నియమించారు. మూడేళ్లలో మొత్తం 16 వైద్య కళాశాలలను పూర్తిచేయాలన్నది సర్కారు లక్ష్యం.

వైద్యవిద్యలో అతిపెద్ద ప్రాజెక్టు
రాష్ట్రంలో వైద్యవిద్యకు సంబంధించి ఇది అతిపెద్ద ప్రాజెక్టు. స్పెషాలిటీ వైద్యానికి పెద్దఎత్తున అవకాశం ఏర్పడుతుంది. వేలాది మందికి వైద్యవిద్య.. లక్షలాది మందికి మెరుగైన వైద్యం అందుతుంది. ఈ కాలేజీలన్నింటినీ సకాలంలో పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ వైద్య వ్యవస్థ బలోపేతానికి ఇది మంచి పునాది.
– డా. కేఎస్‌ జవహర్‌రెడ్డి, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ.. వైద్య, ఆరోగ్యశాఖ 

ఏ కళాశాలకు ఎంత కేటాయించారంటే..
► కృష్ణాజిల్లా మచిలీపట్నం కాలేజీకి రూ.550 కోట్లకు అనుమతులిచ్చారు. ప్రస్తుతం ఇక్కడ జిల్లా ఆస్పత్రి కొనసాగుతోంది. ఈ కళాశాలకయ్యే ఖర్చును 60–40 నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరిస్తాయి. ఇప్పటికే ఈ కళాశాలకు 150 ఎంబీబీఎస్‌ సీట్లకు సర్కారు ఎసెన్షియాలిటీ ఇచ్చింది.
► గుంటూరు జిల్లా పిడుగురాళ్ల కళాశాలకు రూ.500 కోట్లకు అనుమతులిచ్చారు. దీనికి కూడా కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులు వ్యయంచేస్తాయి. ఈ కళాశాలకు కూడా 100 ఎంబీబీఎస్‌ సీట్లకు ఎసెన్షియాలిటీ ఇచ్చారు.
► కడప జిల్లా పులివెందులలో ఏర్పాటుచేసే వైద్య కళాశాలకు రూ.500 కోట్లకు అనుమతిచ్చారు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. 100 ఎంబీబీఎస్‌ సీట్లకు ఎసెన్షియాలిటీ ఇచ్చారు.
► విశాఖ జిల్లా పాడేరు కళాశాలకు రూ.500 కోట్లకు అనుమతిచ్చారు. ఈ కళాశాలకు కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం వ్యయం చేస్తాయి. దీనికి 100 ఎంబీబీఎస్‌ సీట్లకు ఎసెన్షియాలిటీ ఇచ్చారు.
► ఇక స్థలాల కోసం ఒక్కో కాలేజీకి కేటాయించిన రూ.104.17 కోట్లకు సంబంధించి సత్వరమే చర్యలు తీసుకోవాలని వైద్యవిద్యా సంచాలకులను డా.కేఎస్‌ జవహర్‌రెడ్డి ఆదేశించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement