సాక్షి, అమరావతి: ఇప్పటివరకూ కరోనా వైరస్ అనుమానిత లక్షణాలున్న వారు 95 శాతం మంది విదేశాల నుంచి వచ్చినవారే. విదేశాల నుంచి ఎవరైనా స్వరాష్ట్రానికి వస్తే వారిని కనీసం 14 రోజులపాటు ఇళ్లలోనే ఉంచేలా వైద్య ఆరోగ్య శాఖ పకడ్బందీ చర్యలు తీసుకుంది. వారు సాధ్యమైనంత వరకు ఇంట్లో నుంచి బయటకు రాకుండా చూసేందుకు ఆశా కార్యకర్తలను నియమించారు. ఇమ్మిగ్రేషన్ బ్యూరో ఇచ్చిన వివరాల మేరకు రోజుకు సగటున 600 మంది విదేశాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నారు. ప్రధానంగా జర్మనీ, ఇటలీ, ఇరాన్, అమెరికా, చైనా దేశాల నుంచి వచ్చే వారిపై వైద్య ఆరోగ్య శాఖ నిఘా పెంచింది. ఇలా విదేశాల నుంచి వచ్చినవారు ఇంట్లోనుంచి బయటకు రావద్దని విజ్ఞప్తి చేసింది.
విదేశాల నుంచి వచ్చిన వారికి వైద్య ఆరోగ్య శాఖ విజ్ఞప్తి
- కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటూనే.. మరోవైపు చికిత్సకు సంబంధించిన వసతులు పెంచుతున్నారు. ఇప్పటివరకూ తిరుపతి, విజయవాడలోనే ల్యాబొరేటరీలు ఉండగా, తాజాగా కాకినాడలోనూ మరో ల్యాబొరేటరీ అందుబాటులోకి వచ్చింది.
- వారం రోజుల్లో అనంతపురంలో ల్యాబొరేటరీని అందుబాటులోకి తీసుకురానున్నారు.
- ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉన్న వెంటిలేటర్లతో పాటు కొత్తగా 100 వెంటిలేటర్లకు ఆర్డరు ఇచ్చారు. ఇందుకోసం రూ.10 కోట్లకుపైగానే ఖర్చు చేస్తున్నారు.
- రాష్ట్రంలో మంగళవారం నాటికి 100 మందికి కరోనా వైరస్ అనుమానిత లక్షణాలున్నట్టు గుర్తించి, నమూనాలు సేకరించగా 90 నమూనాల్లో కరోనా వైరస్ లేదని తేలింది.
- 9 నమూనాలకు సంబంధించిన రిపోర్టు రావాల్సి ఉంది. ఇప్పటివరకూ రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసు ఒక్కటి మాత్రమే.
- మాస్కులు, శానిటైజర్లను ప్రజలకు విస్తృతంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది.
క్వారంటైన్ వ్యవస్థ అంటే..
వైద్య పరిశీలన కేంద్రం.. వైరస్ లక్షణాలున్న వ్యక్తిని ఒకే గదిలో ఉంచి చికిత్స అందజేస్తారు. తద్వారా వైరస్ వ్యాప్తి చెందకుండా అదుపులో ఉంటుంది.
క్వారంటైన్ వ్యవస్థ బలోపేతం
‘‘కరోనా వైరస్ నిరోధంపై ప్రచార సాధనాల ద్వారా ప్రచారం ముమ్మరం చేశాం. ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాప్తి చెందకుండా క్వారంటైన్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నాం. ప్రజలు అత్యవసరం అనుకుంటే తప్ప ప్రయాణాలు చేయకూడదు. షాపింగ్ మాల్స్‌కు వెళ్లవద్దు’’
– డా.కె.ఎస్.జవహర్‌రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఆరోగ్యశాఖ
Comments
Please login to add a commentAdd a comment