సాక్షి, అమరావతి: కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు పిలుపునిచ్చారు. ఏ ఒక్క ఉద్యోగి కూడా ఏమరపాటుతో ఉండకూడదని, ఇప్పటివరకూ రాష్ట్రంలో పాజిటివ్ కేసులు చాలా తక్కువగా ఉన్నాయన్న నిర్లక్ష్యం కూడదన్నారు. నిన్నటివరకూ 95 శాతం అనుమానిత కేసులు విదేశాల నుంచి వచ్చిన వారికే వున్నాయని.. వారి నుంచి కాంటాక్టు అయిన కేసులు కేవలం 5 శాతం మాత్రమేనని.. కానీ ఇప్పుడు కాంటాక్టు కేసులు పెరిగే అవకాశం ఉన్నందున దాన్ని మనం నిరోధించాలని, దీనికి అన్ని విభాగాలు సహకరించాలని మిగతా శాఖల అధికారులను వారు కోరారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో సీఎం ప్రత్యేక అదనపు కార్యదర్శి పీవీ రమేష్, వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా. కేఎస్ జవహర్‌రెడ్డి అధ్యక్షతన సుమారు 14 విభాగాల ఉన్నతాధికారులు కరోనా నిరోధానికి ఎలా ముందుకెళ్లాలన్న దానిపై సోమవారం సమావేశమయ్యారు. ముఖ్య కార్యదర్శులందరూ సమావేశంలో పాల్గొని తీసుకోవాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు.
కోవిడ్‌పై ప్రభుత్వం తీసుకున్న చర్యలివే..
రాష్ట్రంలో కరోనా వైరస్‌పై ఆందోళన చెందాల్సిన అవసరంలేదని వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా. కేఎస్ జవహర్‌రెడ్డి స్పష్టంచేశారు. స్థానిక ఎన్నికల వాయిదా నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నికి కరోనా వైరస్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలపై ఆయన నివేదిక ఇచ్చారు. ఆ వివరాలు..
- జిల్లా స్థాయిలో డిస్రిక్ట్ ర్యాపిడ్ రెస్పాన్ టీములు, అంబులెన్సులు ఏర్పాటుచేశాం. విశాఖ, విజయవాడ, తిరుపతిలో మరొకటి చొప్పున అదనంగా ఏర్పాటుచేశాం.
- 140 లక్షల కుటుంబాలకు ఇంటింటి సర్వే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఇప్పటివరకూ 102 లక్షల కుటుంబాల సర్వే పూర్తయింది. ఇందులో 6,777 మంది విదేశాల నుంచి స్వస్థలాలకు వచ్చినట్టు గుర్తించాం.
- విదేశీ ప్రయాణీకులందరినీ ఇంట్లోనే ఉండాలని స్పష్టంచేశాం.
- అనుమానితులందరినీ ప్రత్యేక వైద్య పరిశీలనలో ఉంచాం.
- విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో 8,691 మందికి, మరో ఆరు ఓడరేవుల్లో 1,710 మంది విదేశీ ప్రయాణీకులకు స్క్రీనింగ్ చేశాం.
- అన్ని జిల్లాల్లో కంట్రోల్‌రూమ్‌లు ఏర్పాటుచేశాం.
- 104 కాల్ సెంటర్ ద్వారా ఆరోగ్య సలహాలిస్తున్నాం
- 26 ఆస్పత్రులను గుర్తించి వాటిలో 366 ప్రత్యేక పడకలు, 87 వెంటిలేటర్లు ఏర్పాటుచేశాం.
- 449 ప్రైవేటు ఆస్పత్రుల్లో 900 ప్రత్యేక పడకలు, 445 వెంటిలేటర్ల ఏర్పాటుచేశాం.
- తిరుపతి, విశాఖపట్నంలో క్వారంటైన్ సదుపాయం కల్పన
- రాష్ట్రంలో 13607 పీపీఈ (పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్), 105515 ఎన్ 95 మాస్కులు అందుబాటులోకి తెచ్చాం.
- వ్యక్తిగత శుభ్రతలు పాటించే జాగ్రత్తలపై అన్ని మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం చేస్తున్నాం.
- ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లు, 300మంది ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ.
- నెల్లూరులో పాజిటివ్ కేసు వచ్చిన నేపథ్యంలో 20వేల ఇళ్లలో ఇంటింటి సర్వే నిర్వహించిప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నాం.
- మొత్తం మీద ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిగా అదుపులో ఉంది.
యథావిధిగా టెన్త్ పరీక్షలు
ఈనెల 31 నుంచి రాష్ట్రంలో జరగనున్న ఎస్‌ఎస్‌సీ (పదవ తరగతి) పరీక్షలు యథావిధిగా జరపాలని అధికారులు సమావేశంలో నిర్ణయించారు. వాయిదా వేయాల్సిన పరిస్థితుల్లేవని, ముందు నిర్ణయించిన షెడ్యూలు ప్రకారమే పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే, బీటెక్, మిగతా డిగ్రీ కోర్సుల ఫైనల్ ఇయర్ పరీక్షలు యథావిధిగా నిర్వహించాలని నిర్ణయించారు. డిగ్రీ లేదా బీటెక్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షలు విధిలేని పరిస్థితుల్లో అయితేనే వాయిదా వేయాలని.. తప్పదు అనుకున్నవి, సిలబస్ ఇప్పటికే పూర్తయి పరీక్షలు రాయాల్సి ఉన్నవన్నీ యథావిధిగా నిర్వహించాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment