
సాక్షి, అమరావతి: కోవిడ్–19 వ్యాప్తి నివారణలో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడాన్ని నిషేధిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో పొగాకు, పొగాకేతర ఉత్పత్తులు, ఖైనీ వంటి ఉత్పత్తులు నమిలి ఉమ్మివేయడంపై నిషేధం విధించింది.
ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారికి ఐపీసీ 1860, సీఆర్పీసీ చట్టం ప్రకారం శిక్ష విధించనున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కోవిడ్–19 నివారణలో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడాన్ని నిషేధించాలంటూ ఐసీఎంఆర్ కేంద్రానికి లేఖ రాసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడాన్ని నిషేధిస్తూ చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్రాలను కోరింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులను జారీ చేసింది.