సాక్షి, అమరావతి: కరోనా వ్యాధితో మరణించిన వారి మృతదేహాలలో 6 గంటల తర్వాత వైరస్ ఉండదని వైద్య, ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కేఎస్ జవహర్‌రెడ్డి వెల్లడించారు. వైరస్‌తో మృతి చెందిన వారి దహన సంస్కారాలను అడ్డుకుని ఇబ్బందులు కలుగజేయొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విజయవాడలోని ఆర్ అండ్ బీ భవన ప్రాంగణంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, ప్రజలు స్వచ్ఛందంగా ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించాలని కోరారు. జవహర్‌రెడ్డి ఇంకా ఏమన్నారంటే..
► మాస్కు ధరించడం, 6 అడుగుల భౌతిక దూరాన్ని పాటించడం, తరచూ చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవడం అనే మూడు సూత్రాలు పాటిస్తే కరోనా మన దరిచేరదు.
► రాష్ట్రంలో మార్చి 9న తొలి కరోనా కేసు నమోదైతే జూలై 3వ తేదీ నాటికి ఆ సంఖ్య 16,934కి చేరింది.
► రాష్ట్రంలో ఇప్పటివరకు 9,71,611 మందికి వైద్య పరీక్షలు నిర్వహించాం. ప్రతి 10 లక్షల మందికి సగటున 18,195 పరీక్షలు చేశాం.
► పరీక్షలు నిర్వహించేందుకు మొదట్లో మనకు ఒక ల్యాబ్ కూడా ఉండేది కాదు. ప్రస్తుతం 15 ప్రభుత్వ, 4 ప్రైవేట్ కలిపి మొత్తం 19 ల్యాబ్‌లు పని చేస్తున్నాయి.
► పరీక్షా ఫలితాలు వేగంగా తెలుసుకునేందుకు ప్రభుత్వ ల్యాబ్‌లలో 47 ఆర్‌టీపీసీ యంత్రాలు ఉన్నాయి.
► కరోనా వైరస్‌తో 9,096 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో వ్యాధి తీవ్రత తక్కువ ఉన్న 600 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.
► వెయ్యికి పైగా శాంపిల్ కలెక్షన్ సెంటర్లను ఏర్పాటు చేసి ఎక్కువగా.. వేగంగా పరీక్షలు నిర్వహిస్తున్నాం.
► కరోనా వ్యాప్తికి సంబంధించి పూర్తి స్థాయిలో అధ్యయం చేసేందుకు వివిధ కేటగిరీలుగా విభజించి ర్యాండమ్‌గా పరీక్షలు నిర్వహిస్తున్నాం.
► బయటి ప్రాంతాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారు, నిర్మాణ రంగం, వ్యవసాయ కూలీలు, కూరగాయలు విక్రయించేవారు, పరిశ్రమల్లోని కార్మికులు, మార్కెట్ యార్డులు, ఆరోగ్య తదితర రంగాల్లో పని చేసేవారికి ర్యాండమ్‌గా పరీక్షలు చేయిస్తున్నాం.
► పండ్లు, కూరగాయలు అమ్మేవారి ద్వారా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటున్నట్టు గుర్తించాం. 60 ఏళ్లు పైబడిన వారే ఎక్కువగా మృతి చెందుతున్నారు.
► కరోనా వ్యాధి ముదిరిన తర్వాత చికిత్సకు ఎక్కువ మంది వస్తున్నారు. లక్షణాలు కన్పించిన వెంటనే దగ్గర్లోని డాక్టర్, పీహెచ్‌సీ, సీహెచ్‌సీలను లేదా ఆశా వర్కర్లు, వలంటీర్లను సంప్రదించాలి.
► ప్రభుత్వం ప్రవేశపెట్టిన టెలీ మెడిసిన్ టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్‌చేసి సూచనలు పొందాలి. లాక్‌డౌన్ ఎత్తివేశాక కేసుల సంఖ్య పెరిగింది.
► డాక్టర్లపై భారాన్ని తగ్గించేందుకు 22 వేల మంది డాక్టర్లు, 24 వేల మంది పారా మెడికల్ తదితర సిబ్బందిని పెద్దఎత్తున నియమిస్తున్నాం.
► కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులకు త్వరలోనే కోవిడ్ చికిత్సలకు అనుమతి ఇస్తాం. అక్కడ వసూలు చేసే చార్జీలపై కూడా నియంత్రణ ఉంటుంది.
మృతదేహాల్లో 6 గంటల తర్వాత కరోనా వైరస్ ఉండదు
Published Sat, Jul 4 2020 4:32 AM | Last Updated on Sat, Jul 4 2020 8:28 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment