పండితులతో సమావేశమైన టీటీడీ ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి
తిరుమల: తిరుమల గిరుల్లోని అంజనాద్రి శ్రీ ఆంజనేయస్వామివారి జన్మ క్షేత్రమని పురాణాలు ముక్త కంఠంతో చెబుతున్నాయని పలువురు పండితులు టీటీడీ ఈఓ కేఎస్ జవహర్‌రెడ్డికి వివరించారు. దీనిపై విస్తృతంగా పరిశోధనలు జరిపి ఆధారాలతో నిరూపించాలని ఈఓ పండితులను కోరారు. టీటీడీ పరిపాలన భవనంలోని ఈఓ కార్యాలయంలో బుధవారం సాయంత్రం ఆయన పండితులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ కొన్ని దేవాలయాల స్థల పురాణాల ఆధారంగా వేరువేరు ప్రాంతాలను హనుమంతుని జన్మ స్థలంగా ప్రచారం చేస్తున్నారని చెప్పారు.
ఈ నేపథ్యంలో పౌరాణిక, చారిత్రక, ఆచార వ్యవహార దృష్టితో ఆంజనేయస్వామివారు తిరుమలలో జన్మించారని పరిశోధించి నిరూపించడానికి పండితులతో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆధునిక కాలంలో శ్రీవారి భక్తులందరికీ అంజనాద్రిపై మరింత భక్తి విశ్వాసాలు ఏర్పడాలని ఈఓ సూచించారు. స్కంధ పురాణం, వరాహ పురాణం, పద్మ పురాణం, బ్రహ్మాండ పురాణం, భవిష్యోత్తర పురాణం, వెంకటాచల మహాత్మ్య మొదలైన పురాణాల్లో ఉన్న శ్లోకాలను పండితులు సమావేశంలో ప్రస్తావించారు. ఈ సమావేశంలో జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య మురళీధర శర్మ, ఎస్వీ వేద విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య సన్నిధానం సుదర్శన శర్మ, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యులు జె.రామక్రిష్ణ, శంకరనారాయణ, ఎస్వీ వేద ఆధ్యయన సంస్థ ప్రత్యేకాధికారి విభీషణ శర్మ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment